ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులన్నింటా నీరు అత్యంత విలువైనది. ప్రపంచంలో మానవులతోపాటు అన్ని జీవరాసుల మనుగడకూ ఇది ఎంతో కీలకం. అత్యంత విలువైన నీటిని సక్రమంగా వాడుకోవడంలో విఫలమవుతున్నాం. భారతదేశంలో అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో కేవలం 28శాతం మాత్రమే వినియోగిస్తూ మిగిలిన 72శాతాన్ని సముద్రాల పాలు చేస్తుండటం బాధాకరమైన అంశం. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు పురాతన కాలంలో తవ్విన మెట్ల బావులు, చెరువులు, పుష్కరిణులు వంటి సంప్రదాయ నీటి సేకరణ నిర్మాణాలు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. కానీ, వాటిని సంరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చెరువుల ద్వారా పంటలు సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ్ బంగ, ఛత్తీస్‌గఢ్‌లను ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ రాష్ట్రాల్లో ఇప్పటికీ నదులు లేని చాలా గ్రామాల్లో చెరువు నీరే వ్యవసాయానికి ఆధారం. నానాటికీ పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేత.. ఫలితంగా పెచ్చరిల్లిన భూతాపంతో నదులు, సంప్రదాయ నీటి నిర్మాణాలు క్రమేణా అంతరించే స్థాయికి చేరుకున్నాయి. నీటివనరుల సంరక్షణ ప్రభుత్వాలకు సవాలుగా మారింది.
ఆనకట్టల నిర్మాణం
పురాతన సరస్వతి నది అంతరించిపోవడాన్ని- రానున్న నీటి సంక్షోభాలకు ఒక నాందీసూచకంగా భావించవచ్చు. అమూల్యమైన నీటి వనరులను పునరుద్ధరించడానికి బదులుగా, బ్రిటిష్ ప్రభుత్వం పన్నుల రూపంలో ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ప్రజా నిధులతో భారీ ఆనకట్టలను నిర్మించింది. స్వాతంత్య్రం వచ్చిన తరవాత సైతం ఆనకట్టల అనుసంధానిత కాలువల నీటిపారుదల విధానమే మన దేశంలో కీలకమైంది. పెరుగుతున్న జనాభా నీటి అవసరాలను తీర్చడానికి ఆనకట్టలు సముచితమైనవిగా భావించడంవల్ల వీటికి పంచవర్ష ప్రణాళికల్లోనూ పెద్దపీట వేశారు. ఆనకట్టలను 'ఆధునిక దేవాలయాలు'గా పేర్కొన్నారు. ఒక్క నర్మదా నది మీదే అత్యంత ఎత్తయిన సర్దార్ సరోవర్ డ్యామ్‌తో పాటు 30 పెద్ద ఆనకట్టలు, 135 మధ్య తరహా, మూడు వేల చిన్న ఆనకట్టలు నిర్మించాలని నర్మదా ట్రైబ్యునల్ నిర్ణయించింది. ఆ జలాశయాలవల్ల చాలా గ్రామాలు, అడవులు ముంపునకు గురయ్యాయి. పెద్ద ఆనకట్టలు నికర సాగునీటి అవసరాలను తీర్చినప్పటికీ- ముంపు ప్రాంతాలతో పర్యావరణ అసమతౌల్యం, పునరావాసం వంటి సమస్యలు పెచ్చుమీరతాయి. అందువల్ల, జీవనదుల పరిరక్షణతోపాటు సంప్రదాయ నీటి నిర్మాణాలైన చెరువులు, గుంటలు, నీటి బుగ్గలను పునరుద్ధరించడం ద్వారా పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుంది.
ఇదీ చదవండి: తరుముతున్న నీటి సంక్షోభం- మేల్కొనకపోతే గడ్డు కాలం
నదులు మన సంస్కృతిలో- కుంభమేళాలు, పుష్కరాలు, పరిక్రమణల రూపంలో అంతర్భాగమయ్యాయి. వీటిలో నర్మదా పరిక్రమణ అత్యంత పవిత్రమైన నదీ సంరక్షణ యాత్ర. నదీ సంరక్షణ చర్యలను కొనసాగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నర్మదా సేవా యాత్రను 2016 డిసెంబర్ 11 నుంచి 2017 మే 11 వరకు అధికారికంగా నిర్వహించింది. ఈ యాత్రలో జన్ అభియాన్ పరిషత్, మధ్యప్రదేశ్ వాటర్‌బోర్డ్, ఆర్థిక-గణాంక శాఖలతో పాటు వలంటీర్లు, సాధువులు, భక్తులు పాల్గొని నర్మదా నదిలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు నదికి ఇరువైపులా 3,350 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణం, జీవనోపాధి పరిరక్షణలో నదుల ప్రాధాన్యంవల్ల అంతర్జాతీయ నదుల సంఘం ఏటా మార్చి 14న నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది 'నదుల హక్కులు' అనే ఇతివృత్తంతో జరపాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: అపరిమిత వాడకంతో.. ప్రాణాలు తోడేస్తున్నారు!
ప్రజా భాగస్వామ్యం
నదీ పరిరక్షణ ప్రధాన లక్ష్యాలు- విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలపడం, సంప్రదాయ నీటి సేకరణ నిర్మాణాల పునరుద్ధరణ-నిర్వహణ, వ్యర్థాల నిర్మూలనలు. ఇందుకు అనుగుణంగా 2011లో భారత ప్రభుత్వం రూపొందించిన 'నేషనల్ మిషన్ ఫర్ గంగ' పథకంతో గంగానదిని వ్యర్థాల నుంచి ప్రక్షాళించడంతో పాటు దాని పునరుద్ధరణకు కృషి చేసింది. నదుల పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో తేదీని జాతీయ నదీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజున పలు రంగాల ప్రముఖులను ఆహ్వానించి, ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను జరుపుతున్నారు. వీటిలో ముఖ్యంగా గంగానదికి సంబంధించిన చరిత్ర, ఇతిహాసాలు, జానపదాలు తదితర అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. గంగా నది పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలకోసం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు తమవంతు బాధ్యతగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి. పర్యావరణ హితకరమైన ఉపకరణాలను వినియోగించాలి. నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా జాగ్రత్తపడాలి. చెట్లను నాటడం ద్వారా భావి తరాలను కరవుకాటకాల నుంచి, వాతావరణ మార్పులతో వచ్చే అనేక ఉపద్రవాల నుంచి కాపాడవచ్చు. ప్రజల భాగస్వామ్యం లేకుండా నదుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన అభివృద్ధి సాధించడం చాలా కష్టం.
- డాక్టర్ దన్నారపు వెంకట ప్రసాద్
ఇవీ చదవండి: 'జల సంక్షోభానికి' తెరదించాల్సిన సమయమిది..!