సమస్త ప్రాణికోటికి జీవాధారమైన నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నీటికొరత నేడు ప్రధాన సమస్యగా మారింది. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం, ఉన్న నీటి వనరులు కలుషితమవుతూ, వినియోగానికి పనికిరాకుండా పోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ప్రపంచంలోని మొత్తం జలంలో- మంచి నీరు దాదాపు మూడు శాతమే. అందుకే నీటికోసం నిత్యం ప్రజలు, ప్రాంతాలు, రాష్ట్రాలు-దేశాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పోనుపోను పరిస్థితులు దిగజారుతున్నాయి. అయినా- భవిష్యత్తు తరాలకు నీటి కొరత ఎదురుకాకుండా సమర్థ వినియోగం, సంరక్షణ వంటి అంశాలపై ఎవరూ పెద్దగా శ్రద్ధపెట్టకపోవడం బాధాకరం.
వృథాపోతున్న నీరు
జాతీయ జల కమిషన్ (2019) అంచనా మేరకు దేశంలో ఏటా మూడు లక్షల కోట్ల ఘనపు మీటర్ల నీరు అవసరం. నీతి ఆయోగ్ (2021) గణాంకాల ప్రకారం భారత దేశ విస్తీర్ణాన్ని, 1985-2015 మధ్య సగటు వార్షిక వర్షపాతాలను లెక్కలోకి తీసుకొంటే దేశంలో ఏటా సగటున లభ్యమవుతున్న నీరు సుమారు నాలుగు లక్షల కోట్ల ఘనపు మీటర్లు. నీటి ఆవిరి, భౌగోళిక వ్యత్యాసాలు తదితర కారణాలవల్ల దేశంలో మొత్తం సగటు వార్షిక నీటి లభ్యత 1.86 లక్షల కోట్ల ఘనపు మీటర్లే! అందులో భూఉపరితల జలవనరుల నుంచి 69వేల కోట్ల ఘనపు మీటర్లు (36.92శాతం), భూగర్భజల వనరుల నుంచి 43.3వేల కోట్ల ఘనపు మీటర్లు (23.17శాతం) లభిస్తోంది. అంటే మొత్తం నీటిలో 1.12లక్షల కోట్ల ఘనపు మీటర్ల నీరు మాత్రమే ఉపయోగపడుతోంది. మిగిలిన 74వేల కోట్ల ఘనపు మీటర్ల మేర (39.91శాతం) నీరు వృథా అవుతోంది.
దేశంలో ఇతర నదులతో పోలిస్తే- గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదుల పరీవాహక ప్రాంతాల విస్తీర్ణం (14.2 లక్షల చదరపు కిలోమీటర్లు) చాలా ఎక్కువ. కాబట్టి, సహజంగానే ఈ ప్రాంతాల్లో వర్షం ద్వారా లభించే నీరు అధిక స్థాయిలో ఉంటుంది. భారత్‌లోని సగటు వార్షిక భూగర్భ జల లభ్యతలో 46శాతం గంగ, బ్రహ్మపుత్ర నదుల పరీవాహక ప్రాంతాలదే. ఇండియాలోని భూఉపరితల నీటివనరుల్లో నదీజలాలు 60శాతం మేర ఉన్నాయి. దక్షిణ భారత నదులైన గోదావరి, కృష్ణ, కావేరిల్లోనూ నీటి ప్రవాహం ఎక్కువగానే ఉంటుంది.
దేశంలోని వివిధ ప్రాంతాలతో పోలిస్తే- భూగర్భజలాల వినియోగం వాయవ్యాన, దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అధికంగానే ఉంటుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో భూగర్భ జల వినియోగం చాలా తక్కువ. జాతీయ భూగర్భజల సంస్థ (2011) లెక్కల మేరకు- దేశంలోని వివిధ ప్రాంతాలు (37.37శాతం బ్లాకులు) నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. నీతి ఆయోగ్ (2021) లెక్కల ప్రకారం ఇప్పటికే దేశంలో సగానికిపైగా జనాభాకు మంచి నీరు లభ్యం కావడంలేదు. నీటి లభ్యత సరిగ్గా లేకపోతే పని దినాలు తగ్గిపోతాయి. ఆ ప్రభావం ఆహార భద్రత మీదే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధిపైనా తీవ్రస్థాయిలో పడుతుంది.
కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ (2021) అంచనాల మేరకు దేశంలో తలసరి నీటి లభ్యత 1951లో 5,177 ఘనపు మీటర్లు. 2011 నాటికి అది 1,545 ఘనపు మీటర్లకు తగ్గింది. 2025నాటికి 1,341 ఘనపు మీటర్లకు, 2050కి 1,140 ఘనపు మీటర్లకు కుంగిపోతుందని అంచనా! అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తలసరి నీటి లభ్యత వెయ్యి ఘనపు మీటర్లకంటే తక్కువగా ఉంటే నీటి కొరతగా, 1,000-1,700 ఘనపు మీటర్ల మధ్య ఉంటే నీటి ఒత్తిడిగా పరిగణిస్తారు. 1,700 ఘనపు మీటర్లకు మించి ఉంటే నీటి సంరక్షణ సంతృప్తికరంగా సాగుతున్నట్లు! దీన్నిబట్టి రానున్న 30ఏళ్లలో దేశంలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చనున్నట్లు అర్థమవుతుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 70శాతం భూఉపరితల జలాలు మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమయ్యాయి. అధిక ఫ్లోరైడ్ వంటి ఖనిజాలు, ఇతర విషపూరిత రసాయనాలతో 40శాతం భూగర్భజలాలు కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (2020) అంచనాల ప్రకారం- నీటిలో జీవ రసాయనాలు మితిమీరడమే ప్రపంచంలో 80శాతం అనారోగ్య సమస్యలకు కారణం.
పొదుపుపై అవగాహన పెరగాలి
భారత్‌లో నీటి సంక్షోభాన్ని నివారించే పరిష్కార మార్గాలతో పాటు, పర్యావరణ పరిరక్షణ చర్యలూ ఎంతో అవసరం. నీటి కొరత కొనసాగితే సామాజిక అంతరాలు పేట్రేగి, తిరుగుబాట్లకూ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉంది. జనాభా పెరుగుదలను నియంత్రించడంతోపాటు నీటి వృథాను అరికట్టడంపైనా క్రియాశీలంగా కదలాలి. నదుల అనుసంధానంతో నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. వాన నీటిని భూమిలో నిల్వ చేయడానికి పెద్దయెత్తున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. చెరువులు, కుంటలు, బావులను సంరక్షించాలి. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కలిగించాలి. నీటి నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు పూర్తిగా సహకరిస్తేనే- భవిష్యత్తులో నీటి కొరత సమస్యను కొంతవరకైనా ఎదుర్కోగలం. రానున్న తరాలకు నీటి సంక్షోభం ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ!
-ఆచార్య నందిపాటి సుబ్బారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు
ఇదీ చదవండి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్