శరవేగంతో సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం సహజ వనరులపై గణనీయంగా పడటంవల్ల ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారుగా 780 కోట్లు. అందులో 220 కోట్లమందికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. 420 కోట్లమందికి సరైన పారిశుద్ధ్య పరిస్థితులూ లేవు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక(2020) ప్రకారం నానాటికి వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల ప్రభావం నీటి లభ్యత, నాణ్యతలపై తీవ్రస్థాయిలో ప్రసరిస్తుందని హెచ్చరించింది. ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా ప్రపంచ దేశాలు దృఢసంకల్పంతో అడుగులు వేయకపోతే 2030నాటికి అందరికీ రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులు కల్పించాలన్న ఆశయం సాకారంకాదని హెచ్చరించింది.
సకల దేశాల సమస్య
గడచిన వందేళ్లలో నీటి వినియోగం ఆరు రెట్లు పెరిగింది. జనాభా జోరెత్తుతోంది. ఆపై వాతావరణ మార్పులు శాపాలై తీవ్రమైన తుపానులు, వరదలు, కరవులు ప్రపంచ దేశాలను వేధిస్తున్నాయి. వీటి ఫలితంగా నీటిపై ఒత్తిడి గణనీయంగా పెరిగింది. వాస్తవానికి అనేక దేశాలు నీటి సంక్షోభం అధికస్థాయిలో ఎదుర్కొంటున్న తరుణమిది. ప్రపంచ వనరుల సంస్థ (2019) లెక్కల ప్రకారం అధిక స్థాయిలో నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న దేశాల్లో కతర్ మొదటిస్థానంలో, భారత్ 13వ స్థానంలో ఉన్నాయి. తక్కువ ఎక్కువ తేడాలే తప్ప భవిష్యత్తులో అన్ని ప్రపంచ దేశాలు నీటిఎద్దడి బారినపడటం ఖాయమని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. కాబట్టి నీటిఎద్దడి అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సమస్యగా మారింది. మొత్తం నీటి అవసరాల్లో 69శాతం వ్యవసాయమే వినియోగించుకుంటోంది. పరిశ్రమలు, ఇంధన ఉత్పత్తులు, మత్స్యసంపద వంటి రంగాలపైనా నీటిఎద్దడి దుష్ప్రభావం పడుతుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణం విషయంలో పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఇప్పటికే కాలతీతం అయిందని ఐరాసకు చెందిన వ్యవసాయాభివృద్ధి అంతర్జాతీయ నిధి నివేదిక సైతం వాపోయింది.
వాతావరణ మార్పుల ప్రభావంవల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా ప్రాణవాయువు శాతం తరిగి నీటి నాణ్యతలో మార్పులు వస్తాయి. సహజ నీటి మడుగులు, సరస్సులు తమ స్వీయ శుద్ధీకరణ సామర్థ్యాన్ని కోల్పోతాయి. కరవు కాటకాల సమయాల్లో కాలుష్య కారకాలు పెచ్చరిల్లి, నీరు కలుషితం అవుతుంది. వీటి తాలూకు దుష్ప్రభావాలన్నీ అంతిమంగా ఆహార ఉత్పత్తులపై పడతాయి. మనిషి శారీరక, మానసిక, ఆరోగ్య స్థితిగతుల్లో పెనుమార్పులు తెచ్చే పరిణామాలివి. వ్యాధులు, ఆర్థిక నష్టాల వంటి కారణంగా ప్రజలు వలసలను ఆశ్రయిస్తారు. కష్టాల నుంచి మనుషులు కోలుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా, పర్యావరణ వ్యవస్థలు ముఖ్యంగా అడవులు, చిత్తడి నేలలు అంతరించి జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.
వాతావరణ మార్పులవల్ల వర్షపాతంలో సంభవిస్తున్న తేడాలు అనేక రకాల అనిశ్చితులకు దారితీస్తాయి. నీటి వనరుల కొరత ప్రభావం ఎక్కువగా ఉష్ణమండల దేశాల్లో కనిపిస్తుంది.. అందులో భారత్ ఒకటి. కొన్ని చిన్నచిన్న ద్వీప ప్రాంతాలు ప్రపంచ పటంనుంచి కనుమరుగయ్యే ప్రమాదమూ లేకపోలేదు. వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా హిమనదాలపై అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పులను నిత్యం అనుసరిస్తూ, ఉపశమన చర్యలు తీసుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో ప్రపంచ దేశాలు అడుగులు వేయాలి. అనుసరణలో భాగంగా వాతావరణ మార్పులను సాంకేతికపరంగా శాస్త్రీయంగా అంచనా వేయగలగాలి. దీనివల్ల మార్పుల తీవ్రతను అంచనా వేయవచ్ఛు ఆ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్ఛు ఇక వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు, హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అనుసరించవలసిన చర్యలను చేపట్టడమే ఉపశమనం. ఇది పెద్ద భౌగోళిక ప్రాంతాలకు సంబంధించిన చర్య. నీటి వనరుల వినియోగం, నీటి పునర్వియోగం, మురుగు నీటి నిర్వహణ చర్యలు ఇందులో ఉంటాయి. హరిత గృహవాయువుల ఉత్పత్తి మూడు శాతం నుంచి ఏడు శాతం వరకు మురుగునీటి నుంచి వస్తుండటమే దీనికి కారణం.
పర్యావరణానికి చికిత్స
మురుగు నీటి నుంచి వచ్చు మీథేన్ శక్తిమంతమైన హరిత గృహవాయువు. ప్రపంచవ్యాప్తంగా 80శాతం నుంచి 90శాతం మురుగునీటిని ఎటువంటి శుద్ధి చేయకుండా పర్యావరణంలోనికి విడుదల చేస్తునట్లు అంచనా. నీటి కొరత గల జోర్డాన్, మెక్సికో, పెరూ, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో మాదిరిగా సేంద్రియ పదార్థాల నుంచి మీథేన్‌ను వెలికితీసే ఆధునిక చికిత్సా పద్ధతులు అవలంబించడం వల్ల అవసరమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల బొగ్గుపులుసు వాయువు, హరిత గృహ వాయువులు వేల టన్నుల్లో తగ్గుతాయి. అదేవిధంగా చిత్తడినేలల రక్షణ, పరిరక్షణ వ్యవసాయ పద్ధతుల ద్వారా నేల నిర్మాణంలో తేమను కాపాడటం వీలవుతుంది. వ్యవసాయం, పరిశ్రమల కోసం వాడి, పాక్షికంగా శుద్ధిచేసిన నీటిని పునర్వినియోగం చేయడం వల్ల నీటి వృథా చాలావరకు తగ్గుతుంది. నీటి వనరుల నిర్వహణకు, సరఫరాకు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడానికి అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలకు సమకూర్చాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇదీ చదవండి: విషవాయువు పీల్చి ఆరుగురి మృతి