ETV Bharat / opinion

మృత్యుకోరల్లో మృగరాజు- సింహాలపై వైరస్ పంజా - మహమ్మారి సింహాలు

గుజరాత్​లో అంతుచిక్కని విధంగా సింహాలు మరణిస్తున్నాయి. గత రెండేళ్లలో 313 సింహాలు ప్రాణాలు కోల్పోయాయి. అసహజ కారణాలతోనే సింహాలు మరణిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. 'కానైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌'గా వ్యవహరించే మహమ్మారి సింహాల పాలిట మృత్యుపాశంగా మారినట్లు తెలుస్తోంది.

LIONS
మృత్యుకోరల్లో మృగరాజు- సింహాలపై వైరస్ పంజా
author img

By

Published : Mar 11, 2021, 7:27 AM IST

గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో అంతుచిక్కని రీతిలో సింహాలు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. గత రెండేళ్లలో 313 సింహాలు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలారంభంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ శాసనసభలో ప్రకటించింది. 2019 జనవరి నుంచి 2020 డిసెంబరు వరకు- 69 సింహాలు, 77 సివంగులు, 144 కూనలు సహజ మరణం చెందాయని; రెండు సింహాలు, 13 సివంగులు, ఎనిమిది కూనలు అసహజ కారణాలతో మృతి చెందాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణ్‌పత్‌ సిన్హ్‌ వాసవ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మాత్రం సింహాలు పెద్దయెత్తున అసహజ కారణాలతోనే మరణిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడే కాదు- నాలుగేళ్లుగా సింహాల మరణాలు అసాధారణ రీతిలో సంభవిస్తున్నాయి. రెండేళ్లలో 200 సింహాలు మృతి చెందాయని 2019 ఫిబ్రవరిలోనే రాష్ట్ర శాసనసభలో ఒక ప్రశ్నకు జవాబుగా ప్రభుత్వం పేర్కొంది. మరణిస్తున్న సింహాల లెక్కలు సేకరించడంలో చూపే శ్రద్ధను అధికార యంత్రాంగం వాటిని కాపాడటంపై పెట్టడంలేదని వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

కొంతకాలంగా పెరుగుతూ...

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌, జునాగఢ్‌, భావ్‌నగర్‌ తదితర ఎనిమిది జిల్లాల పరిధిలో గిర్‌ అభయారణ్యం విస్తరించి ఉంది. 1965లో 1,412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అది ఏర్పాటయింది. వందేళ్లకు ముందు అక్కడ 15 నుంచి 20 సింహాలు ఉండేవి. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వన్యప్రాణి సంరక్షణ చర్యలవల్ల పెద్ద జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సింహాల సంఖ్య 2005 నాటికి 359కి, 2015 సంవత్సరానికి 523కు పెరిగింది. 2020లో చేసిన సర్వే ప్రకారం సింహాల సంఖ్య 674కు చేరినట్లు గుర్తించారు. గత అయిదేళ్లలోనే సింహాల సంతతి 29శాతం పెరిగినట్లు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్రికా సింహాల తరవాత అంతటి ప్రఖ్యాతి గాంచిన ఆసియా సింహాలు అత్యధికంగా ఉన్నది అక్కడే. అలాంటిది అకస్మాత్తుగా అవి మరణిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. నాలుగేళ్ల క్రితం కొన్ని వారాల పరిధిలోనే ఒక్కొక్కటిగా సుమారు 13 సింహాలు మరణించాయి. మృగరాజుల సంఖ్య పెరగడం, వాటిలో అవి కలహించుకొని దాడులు చేసుకోవడంవల్లే అలా మృతి చెందుతున్నట్లు తొలుత అధికారులు భావించారు. అయితే వాటి మరణాల పరంపర కొనసాగుతూ ఉండటంతో 2018 సంవత్సరంలో భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ వైరాలజీ సంస్థ మృతి చెందిన కొన్ని సింహాల రక్త నమూనాలను పరీక్షించి వైరస్‌ ప్రభావంతోనే చనిపోయినట్లు ధ్రువీకరించాయి. ఆ సంవత్సరంలో వైరస్‌ ప్రభావంతో 20 సింహాలు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించినా, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

మహమ్మారి పంజా

'కానైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌'గా వ్యవహరించే మహమ్మారి సింహాల పాలిట మృత్యుపాశంగా మారింది. 1994లో ఆఫ్రికాలో ఈ వైరస్‌ వెయ్యికిపైగా సింహాలను మట్టుపెట్టింది. కొన్నేళ్లుగా గుజరాత్‌ అడవుల్లో వన్య ప్రాణులకు సోకింది. దీంతో రెండేళ్ల ముందు అమెరికా నుంచి టీకా తెచ్చి సింహాలకు వేశారు. అయినా మరణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ సోకిన రేచుకుక్కలు, తోడేళ్ల వంటి జంతువులను వేటాడటంవల్ల సింహాలు ఆ మహమ్మారి బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు. సింహాలకు వేసే జంతుమాంసం కలుషితం కావడమూ మరణాలకు ఒక కారణమనే వాదనలూ ఉన్నాయి. సింహాల్లో కొన్ని వృద్ధాప్యంతో, మరికొన్ని పాముకాటుతో, కొన్ని రైళ్లకింద పడి మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెరుగుతున్న వన్యప్రాణులకు గిర్‌ అభయారణ్యం సరిపోకపోవడంవల్లే సింహాల సమూహాల మధ్య దాడులు పెరిగాయనేది నిపుణుల అభిప్రాయం. సాధారణంగా 10 నుంచి 15 సింహాలు ఒక సమూహంగా కలిసి సంచరిస్తుంటాయి. రెండు సమూహాల మధ్య అప్పుడప్పుడు కలహాలు, దాడులు జరుగుతుంటాయి. 2013లోనే సుప్రీంకోర్టు అభయారణ్యంలోని సింహాలను మధ్యప్రదేశ్‌ వంటి ఇతర అటవీ ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలిచ్చినా- అది కార్యరూపం దాల్చలేదు. మృగరాజులను ఒకే ప్రదేశంలో ఉంచినప్పుడే అవి వ్యాధి నిరోధకతను పెంచుకొంటాయని తద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లను తట్టుకునే శక్తి వాటికి వస్తుందనే నిపుణుల సలహాతోనే ప్రభుత్వం వాటి తరలింపునకు ఇష్టపడటం లేదనే వాదన ఉంది. గిర్‌ అభయారణ్యంలో సింహాల అసహజ మరణాలను గుజరాత్‌ హైకోర్టు 2018లోనే సుమోటో కింద స్వీకరించి విచారించింది. వన్యప్రాణుల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించింది. అయినా ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యలు నామమాత్రమే. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యపై పాలకులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 'టైగర్‌ ప్రాజెక్టు' తరహాలో మృగరాజులకూ ప్రత్యేకంగా నిధులు కేటాయించి, వైద్యపరమైన సంరక్షణ అందించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణకు దిగితేనే సింహాల మరణాలకు అడ్డుకట్ట పడేది!

-వెన్నెల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.