Uttarakhand assembly election: దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. 2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భాజపా, కాంగ్రెస్‌లే ఉత్తరాఖండ్‌ను పాలించాయి. ఈ దఫా ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. అవినీతి, పాలనాపరమైన లోపాలు, నిరుద్యోగం, పర్వత ప్రాంతాల నుంచి వలస వెళ్ళిపోతున్న యువత సమస్య ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి. వాస్తవానికి గత 20ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలన్నీ ఆ అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వాలు ఎంతవరకు కృషి చేశాయన్నదాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడంలో మునిగిపోయారు.
20 ఏళ్లు గడిచినా అవే సమస్యలు..
Uttarakhand political parties: తమ హయాములో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని అధికార భాజపా సంకల్పించింది. రాష్ట్రంలో నిర్మించిన రోడ్లతోపాటు ఉత్తరాఖండ్, దిల్లీని అనుసంధానిస్తూ ఏర్పాటు చేస్తున్న రహదారులను అభివృద్ధికి ఉదాహరణలుగా చూపిస్తూ ప్రచారాలు జోరెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీ విధానాలను సైతం ఎన్నికల ప్రచారాల్లో పొందుపరిచింది. మరోవైపు కాంగ్రెస్- ప్రధాని నరేంద్ర మోదీపైనే బాణాలు ఎక్కుపెట్టింది. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరలు, వాటిపై భాజపా ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఉత్తరాఖండ్ జనాభాలో మాజీ భద్రతాధికారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల వారి సమస్యలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవాలని హస్తం పార్టీ యోచిస్తోంది. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్, గోవాలో ఇచ్చిన హామీలనే ఉత్తరాఖండ్‌లోనూ ప్రయోగిస్తోంది. ఉమ్మడి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 20ఏళ్లు గడిచినా, చాలా ప్రాంతాల్లో ప్రజలు నేటికీ అవే సమస్యలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. 13 జిల్లాల్లోని 16 వేలకుపైగా గ్రామాల్లో ఇప్పటికీ రహదారులు లేవు. తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ప్రజలకు సరిగ్గా అందడంలేదు. రాష్ట్రంలో ఠాకూర్ జనాభా అధికంగా ఉంది. అందుకే ఎన్నికల పోటీలో వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా పార్టీలు జాగ్రత్తపడుతున్నాయి.
ఇదీ చూడండి: కాంగ్రెస్‌లో 'రావత్' అలజడి.. దిల్లీ పెద్దల పిలుపు
భాజపా, కాంగ్రెస్ పరంపర
Uttarakhand cms list: ఉత్తరాఖండ్ ఏర్పడిన కొత్తలో నాటి ఉత్తర్‌ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు నిత్యానంద స్వామి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో 32 మంది ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీల మద్దతుతో భాజపా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నిత్యానంద స్వామి కొద్దికాలమే సీఎం పదవిలో ఉన్నారు. ఆ తరవాత ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆయన స్థానంలోకి వచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎన్‌డీ తివారీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2007 ఎన్నికల్లో భాజపా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, విశ్రాంత మేజర్ జనరల్ బీసీ ఖండూరీకి సీఎం పదవిని అప్పగించింది. కొద్ది కాలానికి ఆ స్థానంలో రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌ను కూర్చోబెట్టింది. 2012లో ఎన్నికలకు ముందు ఖండూరీ తిరిగి సీఎంగా నియమితులయ్యారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దగా పేరుప్రఖ్యాతలు లేని విజయ్ బహుగుణను ముఖ్యమంత్రిని చేసింది. రెండేళ్లు గడిచేసరికి సీనియర్ నేత హరీశ్ రావత్ సీఎం బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చూడండి: హరీశ్ రావత్ తిరుగుబాటు? తీవ్ర సంక్షోభంలోకి కాంగ్రెస్?
ఎన్‌డీ తివారీ మినహా..
Bjp in uttarakhand: 2017లో ప్రజలు మళ్ళీ భాజపాకే పట్టంకట్టారు. కమలదళం త్రివేంద్రసింగ్ రావత్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. నాలుగేళ్లు ప్రశాంతంగా గడిచినా, ఆ వెంటనే రావత్‌ను ఆ పదవి నుంచి తప్పించి, తీరథ్ సింగ్ రావత్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయనా ఎక్కువకాలం నిలవలేకపోయారు. తీరథ్ స్థానంలో ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్‌డీ తివారీ మినహా ఇతర ముఖ్యమంత్రులెవరూ అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోలేకపోయారు. ఉత్తరాఖండ్ అంతర్గత సమస్యలతో విసిగిపోయిన పలువురు రాజకీయ పరిశీలకులు అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటారనే ప్రశ్నకు ప్రజల మౌనమే సమాధానంగా నిలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఇకనైనా సమస్యలు పరిష్కారమవుతాయా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
- ఆర్.పి.నైల్వాల్ (ఉత్తరాఖండ్ వ్యవహారాల నిపుణులు)
ఇవీ చూడండి: