ETV Bharat / opinion

వరద ముంపులో పట్టణాలు.. అతివృష్టితో బీభత్సం - అర్బన్‌ ఫ్లడ్స్​పై ఐక్యరాజ్య సమితి గణాంకాలు

కుండపోత వానలు అనేక నగరాలను వణికిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి జరిపిన ఓ సర్వే ప్రకారం 2030 కల్లా భారత్‌ జనాభాలో 40.76శాతం పట్టణాల్లోనే స్థిరనివాసం ఏర్పరచుకోనున్నారు. నగర జనాభాకు వరదల గండం అధికమని చెప్పకనే చెబుతోందీ సర్వే. ఈ నేపథ్యంలో సాంకేతిక సహాయంతో.. సత్వర వరద హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వాల సత్వర విధి.

వరద
వరద
author img

By

Published : Sep 13, 2021, 8:21 AM IST

Updated : Sep 13, 2021, 8:40 AM IST

కొన్నేళ్లుగా పట్టణాలు, నగరాల్లో సంభవిస్తున్న వరదలు (అర్బన్‌ ఫ్లడ్స్‌) తీవ్ర ఆర్థికనష్టాన్ని మిగిలిస్తున్నాయి. ప్రాణనష్టానికీ కారణమవుతూ ప్రభుత్వాలకు పెను సవాలు విసురుతున్నాయి. ఏటా విస్తరిస్తున్న నగరీకరణకు అనుగుణమైన ప్రణాళిక లేకపోవడం, వాతావరణ మార్పులతో నెలల వ్యవధిలో కురవాల్సిన వర్షపాతం ఒకటి రెండు రోజుల్లో నమోదవడం వరద బీభత్సానికి ప్రధాన కారణాలు. నిరుడు హైదరాబాద్‌ నగరంలో సంభవించిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ ఏడాదీ కుండపోత వానలు అనేక నగరాలను వణికిస్తున్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 11.4శాతం పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు. ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం పట్టణాల్లో నివసిస్తున్న వారు 34శాతానికి పైనే. ఐక్యరాజ్య సమితి జరిపిన ఓ సర్వే ప్రకారం 2030 కల్లా భారత్‌ జనాభాలో 40.76శాతం పట్టణాల్లోనే స్థిరనివాసం ఏర్పరచుకోనున్నారు. దేశంలో నగరాలు విస్తరిస్తున్న తీరును దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం 2015లో 'స్మార్ట్‌ సిటీ మిషన్‌' పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వంద నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌లు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. ఈ నగరాల రూపురేఖలను మార్చేందుకు సంకల్పించారు. కానీ మంజూరు చేసిన పనుల్లో ఎక్కడా వరద నివారణకు పరిష్కారాలు లేవు.

ఆధునిక పరిష్కారాలివే..

దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు దేశంలోని అనేక నగరాల్లో వరద సమస్య పెను ఉపద్రవంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టడం మినహా- శాశ్వత పరిష్కార మార్గాల్ని కనిపెట్టడం లేదు. పాలనా యంత్రాంగాలు మేలుకొని సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వరదల నివారణకు పరిష్కార మార్గాల్ని వెతకాల్సిన అవసరం ఉంది. గతంలో వరదలకు అతలాకుతలమైన కొన్ని నగరాల్లో కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి సాంకేతికతలను వినియోగించి స్మార్ట్‌ పరిష్కారాలను వెతికేందుకు ఆయా రాష్ట్రాల్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముంబయిని వరదలు ముంచెత్తిన తరవాత అక్కడి నగర పాలక సంస్థ కళ్లు తెరిచి 'సమీకృత వరద హెచ్చరిక వ్యవస్థ (ఇఫ్లోస్‌)'ను అభివృద్ధి చేయగలిగింది. భారీ వర్షపాతం నమోదైన సమయంలో వరద తీవ్రతను హెచ్చరించే ఈ విధానం ప్రయోజనకరంగా నిలుస్తోంది. చెన్నై వరదల నుంచి గుణపాఠం నేర్చుకున్న అక్కడి సర్కారు 2019లో 'చెన్నై వరద హెచ్చరిక వ్యవస్థ'ను తీర్చిదిద్దుకుంది. వాతావరణ శాఖ సమాచారంతో అనుసంధానమై వరదల వల్ల కలిగే విపత్తును ప్రజలు, యంత్రాంగానికి తెలియజేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. రాజధాని నగరం బెంగళూరు కోసం కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన 'మేఘసందేశ్‌ మొబైల్‌ అప్లికేషన్‌' వర్షపాతం నమోదును కచ్చితంగా అంచనా వేయడమే కాకుండా, వరదలు, పిడుగుల ప్రభావం ఎలా ఉండబోతోందో ముందే సూచిస్తుంది. దేశ రాజధాని దిల్లీలో సైతం యంత్రాంగం వరదల నివారణకు బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకొంది. అక్కడ డ్రైనేజీ బృహత్‌ ప్రణాళికను ఐఐటీ దిల్లీ తయారు చేసి ఇచ్చింది. దిల్లీ జల మండలి సైతం నగరంలో వరద నిర్వహణకు సాంకేతికతను వినియోగించి- వరదల నుంచి ఊరట పొందే మార్గాలను అన్వేషిస్తోంది. సంప్రదాయ విధానాలతోపాటు, అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సమస్యకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.

పాఠాలు నేర్వాల్సిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాలను ముంచెత్తుతున్న వరదలను సమర్థంగా అరికట్టేందుకు సాంకేతిక మార్గాల్లో సులువైన పరిష్కారాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ఊరటను కలిగించే చర్యలకు బదులు అందుబాటులో ఉన్న సాంకేతిక సంస్థలు, నిపుణుల సహకారంతో శాశ్వత ప్రాతిపదికన వరద నివారణ చర్యలు చేపట్టాలి. నగరాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, వర్షపాతాన్ని ముందస్తుగా పసిగట్టడం, నాలాలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్న క్రమంలో యంత్రాంగాన్ని హెచ్చరించే సాంకేతికత, వరదల్లో వాహనాలు కొట్టుకుపోకుండా బహుళ అంతస్తుల పార్కింగ్‌ విధానం వంటి వాటిని అభివృద్ధి చేయడం ఎంతో ప్రయోజనకరం. హైదరాబాద్‌తోపాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, ప్రధాన పట్టణాల్లో వరదలకు మూల కారణాలను అన్వేషించి, పక్కా సమాచార వ్యవస్థను సిద్ధం చేసుకొని, డేటాబేస్‌తో అనుసంధానించాలి. అందుకు తగిన నిధులను కేటాయించి దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా వరదల సమస్యకు పరిష్కారాలు వెతకాలి. భవిష్యత్తులో మరింత జటిలమయ్యే పట్టణ వరదల సమస్యకు సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌ పరిష్కారాలను చూపే విధంగా కొత్త ప్రతిపాదనలను పట్టాలకెక్కించడం ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యం.

- గుండు పాండురంగశర్మ

ఇవ చదవండి:

Last Updated : Sep 13, 2021, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.