విశ్వశాంతి స్థాపనను పల్లవిస్తూ మానవాళి ప్రతినిధిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ శిథిలాలపై ఐక్యరాజ్యసమితి అవతరించి ఇప్పటికి డెబ్బై అయిదేళ్లు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రారంభమైన వార్షికోత్సవాల వేళ, దీర్ఘ శ్రుతిలో మోగుతున్న డిమాండు- 'సంస్కరణలు'. సమితి స్వర్ణోత్సవ ఘట్టమప్పుడు పాతికేళ్లక్రితం అధ్యక్ష హోదాలో ఫ్రీటస్ దో అమరల్ సరిగ్గా ఇదే అంశాన్ని లేవనెత్తారు. సమితి సభ్యదేశాల సంఖ్య 51నుంచి మూడింతలకు పైగా విస్తరించినా భద్రతామండలి ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయిందంటూ సంస్కరణలు అత్యావశ్యకమన్న వాదనలకు నాడాయన గట్టిగా ఓటేశారు. అయిదేళ్లక్రితం, సమితి సప్తతి ఉత్సవాల నేపథ్యంలో మండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాలకే 'వీటో' విశేషాధికారం హేతుబద్ధతను ప్రశ్నిస్తూ 104 దేశాలు తీర్మానం ఆమోదించడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మరో కీలక మైలురాయికి చేరుకున్నా, సంస్కరణల ప్రక్రియ పట్టాలకు ఎక్కకపోవడం సమితి విశ్వసనీయతనే సంక్షోభంలోకి నెట్టుకుపోతున్నదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు అక్షరసత్యాలు.
అలా చేస్తేనే సమితి ఉనికి చాటుకున్నట్టు
ఐరాస ప్రస్థానంలో ఎన్నో ఘట్టాలు నమోదైనా మౌలిక లక్ష్యాన్ని అది ఇంకా సాధించనేలేదన్న ఆయన విశ్లేషణ, సత్వర మరమ్మతుల ఆవశ్యకతను ప్రస్ఫుటీకరిస్తోంది. భద్రతా మండలి విస్తరణకు వీలు కల్పించే ప్రతిపాదనల నమూనాను స్వర్ణోత్సవ సమావేశాల్లో సమర్పించాలని విఫలయత్నం చేసిన సమితి ఇప్పుడు ఆర్థికంగా బలమైన రెండు దేశాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధం ఆపాల్సిన అవసరం ఉందని పిలుపిస్తోంది. సౌహార్ద సౌభ్రాత్రాల పరికల్పన కృషిలో సమితి ఘోరవైఫల్యానికి ఇంతకన్నా వేరే రుజువులెందుకు? మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిని ప్రజాస్వామ్యీకరించి విశ్వజనీనత సంతరింపజేయడంలో కృతకృత్యమైతేనే తప్ప, సమితి ఉనికికి ఇక అర్థం ఉండదు!
'వీటో' దుర్వినియోగంలో చైనా
గత ఏడున్నర దశాబ్దాల్లో ప్రపంచ ముఖచిత్రమే మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ 'విజేతలు'గా అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యాలు వాటిని వెన్నంటి చైనా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కించుకున్నప్పటికి ఇప్పటికి మధ్య గుణాత్మక మార్పులెన్నో చోటుచేసుకున్నాయి. నేడు రష్యాతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్ సైతం గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. దశాబ్దాలుగా సమితిని తన కనుసన్నల్లో శాసించి ఇష్టారాజ్యంగా చలాయించుకున్న అమెరికా, ట్రంప్ రంగప్రవేశం దరిమిలా- 'ప్రతిష్ఠాత్మక సంస్థ'ను నానా రకాలుగా ఇక్కట్లపాలు చేస్తుండటం తెలిసిందే. ఇక చైనా, వీటో అధికారాన్ని దుర్వినియోగపరచడంలో నెలకొల్పిన రికార్డులకు సాటి, పోటీ లేదు. అంతర్జాతీయంగా వర్ధమాన దేశాల వాణిని వినిపించడంలో ముందున్న భారత్‌కు మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా సుముఖత వ్యక్తపరచినా- చైనాయే మోకాలడ్డుతోంది. తన సరసన ఇండియా, జపాన్లకు చోటు దక్కరాదన్న ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు మండలిలో ఏకైక శాశ్వత ప్రతినిధిగా చైనా వెలుగొందడం పూర్తిగా అసంబద్ధం. బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్లు చిరకాలంగా అరణ్యరోదనమవుతున్నాయి.
ఐరాస సార్థకత కావాలంటే..
కొవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని భిన్న శిబిరాలుగా చీల్చిన తరుణంలో బహుపక్షీయ సౌహార్ద వాతావరణాన్ని చురుగ్గా నెలకొల్పడం తక్షణావసరమని ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రభృతులు పిలుపిస్తున్నారు. 'వీటో' గుప్పిట సమితి, మండలి విలవిల్లాడే దురవస్థను చెదరగొట్టి మెజారిటీ సభ్యదేశాల అభిమతమే చెల్లుబాటయ్యేలా యోగ్య ప్రాతినిధ్యానికి బాటలు పరచే సత్వర సంస్కరణలకు దృఢంగా పూనిక వహిస్తేనే- ఐరాస సార్థకమవుతుంది. 'వీటో' మాటున అసంబద్ధ విపరీత ధోరణులకూ కళ్లెం పడుతుంది!
ఇదీ చదవండి: వైరస్ నుంచి రక్షణకు 'సింగిల్ డోస్' వ్యాక్సిన్