ETV Bharat / opinion

టర్కీపైనా ఆంక్షల కొరడా- పాకిస్థాన్‌కు శరాఘాతం

నగదు అక్రమ చలామణీ, ఉగ్రమూకలకు నిధులు సమకూర్చడం వంటివి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా నివారించడంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ తాజాగా రూపొందించిన గ్రే జాబితాలో పాక్‌ సహా మొత్తం 23 దేశాలున్నాయి. గత నెలలో జరిగిన సమావేశంలో మారిషస్‌, బోట్స్‌వానాలను ఆ జాబితా నుంచి తొలగించారు. టర్కీ, మాలి, జోర్డాన్‌లను అందులో కొత్తగా చేర్చారు. ముఖ్యంగా టర్కీపై ఆంక్షలు విధించడం- భారత్‌ సహా పలు దేశాల కోణంలో కీలక పరిణామం.

Turkey joins Pakistan in FATF Grey list in a double blow for Islamabad
టర్కీపైనా ఆంక్షల కొరడా- పాకిస్థాన్‌కు శరాఘాతం
author img

By

Published : Nov 9, 2021, 4:54 AM IST

Updated : Nov 9, 2021, 5:57 AM IST

కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు వంతపాడుతూ ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టర్కీకి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధుల సరఫరా, నగదు అక్రమ చలామణీలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆ దేశంపై ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) కొరడా ఝళిపించింది. దాని మిత్రదేశం పాక్‌ మూడేళ్లుగా కొనసాగుతున్న గ్రే జాబితాలో టర్కీని కొత్తగా చేర్చింది. ఇప్పటికే ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఆ దేశానికి ఇది మింగుడుపడని పరిణామమే.

హెచ్చరించినా... మారని పంథా!

నగదు అక్రమ చలామణీ, ఉగ్రమూకలకు నిధులు సమకూర్చడం వంటివి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా నివారించడంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ తాజాగా రూపొందించిన గ్రే జాబితాలో పాక్‌ సహా మొత్తం 23 దేశాలున్నాయి. గత నెలలో జరిగిన సమావేశంలో మారిషస్‌, బోట్స్‌వానాలను ఆ జాబితా నుంచి తొలగించారు. టర్కీ, మాలి, జోర్డాన్‌లను అందులో కొత్తగా చేర్చారు. ముఖ్యంగా టర్కీపై ఆంక్షలు విధించడం- భారత్‌ సహా పలు దేశాల కోణంలో కీలక పరిణామం. కొన్నేళ్లుగా ఆ దేశం హద్దులు మీరుతోంది. భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతోంది. కశ్మీర్‌ విషయంలో పాక్‌కు మద్దతిస్తోంది. అంతర్జాతీయంగా పేరుకోసం పాకులాడుతూ... స్వదేశం స్థితిగతులను పట్టించుకోవడంలో టర్కీ నాయకత్వం విఫలమైంది. స్థానికంగా స్థిరాస్తి రంగంపై సరైన పర్యవేక్షణ కొరవడింది. బంగారం, విలువైన రాళ్ల వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నగదు అక్రమ చలామణీ విస్తృతమైంది. ఐఎస్‌ఐఎస్‌, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు అది వరంగా మారింది. ఆ ముష్కర మూకలు భారీగా నిధులు సమీకరించుకున్నాయి. నగదు అక్రమ చలామణీకి అడ్డుకట్ట వేయకపోవడం ద్వారా ఉగ్ర సంస్థలకు టర్కీ పరోక్షంగా సహకరిస్తున్నట్లు గుర్తించిన ఎఫ్‌ఏటీఎఫ్‌... రెండేళ్ల క్రితమే ఆ దేశాన్ని హెచ్చరించింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించింది. అధ్యక్షుడు ఎర్దొగాన్‌ నేతృత్వంలోని సర్కారు మాత్రం ఆ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. తత్ఫలితంగానే ఇప్పుడు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రపంచంలోని ఇరవై అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టర్కీ ఒకటి. జీ-20 సభ్య దేశమైన అది- కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ద్రవ్య విధానాల్లో రాజకీయ నేతల అనుచిత జోక్యాన్ని పెట్టుబడిదారులు తప్పుపడుతున్నారు. టర్కీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) సైతం ఇటీవల గణనీయంగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుంది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే అమెరికా డాలరుతో ఆ దేశ కరెన్సీ ‘లిరా’ మారకం విలువ మూడింట రెండొంతుల మేర కోసుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే జాబితాలో చేరడం టర్కీకి మరింత ప్రతికూలంగా మారనుంది. ఆ జాబితాలోని దేశాలకు ఎఫ్‌డీఐలు భారీగా తగ్గుతాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల నుంచి నిధులు, రుణాలూ అంతంతమాత్రంగానే అందుతాయి.

పాక్‌ 2018 నుంచి గ్రే జాబితాలో కొనసాగుతోంది. ఫలితంగా దాని ఆర్థిక వ్యవస్థకు ఏటా మూడు కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఇతర దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సాయం అందడం లేదు. గ్రే జాబితా నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడ్డ జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, దాని కార్యకలాపాల బాధ్యుడు జాకిర్‌ రెహ్మాన్‌ తదితరులు పాకిస్థాన్‌లోనే తిష్ఠవేశారు. దాన్ని ఎత్తిచూపుతూ ఎఫ్‌ఏటీఎఫ్‌- పాక్‌ను గ్రే జాబితాలోనే ఉంచుతోంది.

దశాబ్దాలుగా సత్సంబంధాలు

ఉగ్రవాదాన్ని ఎగదోయడంలో పాకిస్థాన్‌ పాత్ర బహిరంగ రహస్యం! ఆంక్షలు తప్పించుకోవడానికి ముష్కర మూకలపై కఠిన వైఖరి అనుసరిస్తున్నట్లు నటిస్తుంటుంది. వాస్తవానికి మసూద్‌, హఫీజ్‌ వంటి వారిని పాక్‌ తమ వ్యూహాత్మక ఆస్తులుగా పరిగణిస్తుంది. వారిపై ఎన్నటికీ కఠిన చర్యలు తీసుకోదు! కాబట్టి పాక్‌ను గ్రే జాబితాలో కాకుండా పూర్తి నిషేధిత జాబితాలో చేర్చడమే సమంజసం. ఆ దిశగా భారత్‌ సహా మరికొన్ని దేశాలు లోగడ ప్రయత్నించినా- చైనా, టర్కీ, మలేసియా మోకాలడ్డాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలున్నాయి. వాటిలో మూడింటి మద్దతు ఉంటే చాలు... నిషేధిత జాబితాలోకి వెళ్లకుండా ఏ దేశమైనా తప్పించుకోవచ్చు. చైనా, టర్కీ, మలేసియాలు ఇప్పటివరకు పాక్‌కు ఆ విషయంలో తోడ్పడుతున్నాయి. టర్కీ, పాక్‌లకు దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయి. పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ బాధ్యతలు చేపట్టాక అవి మరింతగా బలపడ్డాయి. కానీ, ఇప్పుడు టర్కీపైనే ఆంక్షల పిడికిలి బిగిసింది. కాబట్టి పాక్‌ను వెనకేసుకొచ్చే మూడో దేశమేదీ లేదు. ఎఫ్‌ఏటీఎఫ్‌ తదుపరి సమావేశం జరిగే నాటికి తన పెడపోకడలను విడనాడటం పాక్‌కు అత్యవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదులపై నిజంగా కొరడా ఝళిపించకపోతే- భవిష్యత్తులో పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోవచ్చు!

- నవీన్‌ కుమార్‌

ఇదీ చూడండి: కడగండ్ల బాటలో రవాణా బండి

Last Updated : Nov 9, 2021, 5:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.