ETV Bharat / opinion

రెక్కలు తెగిన పర్యటకం-ఆదుకుంటేనే జవజీవాలు

author img

By

Published : Aug 5, 2021, 7:30 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో పర్యటక రంగం గణనీయంగా నష్టపోయింది. రెండో దశ విజృంభణతో మరింత కష్టాల్లో పడింది. ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకు బండిని లాగేవారందరికీ తీవ్ర నష్టం వాటిల్లింది. వరసగా రెండేళ్లు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమేనని, తమ బతుకులు మరింత భారంగా మారాయని వాపోతున్నారు. కనీస అవసరాల్ని తీర్చుకోవడానికి సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు.

tourism
tourism

రెండు విడతల కొవిడ్‌ విజృంభణ, లాక్‌డౌన్లు, ఆంక్షలు, మూసివేతల ధాటికి అన్ని రంగాలూ ఛిన్నాభిన్నమయ్యాయి. అన్నింటికీ మించి పెద్ద దెబ్బ పర్యాటక రంగంపై పడింది. ప్రపంచ ప్రధాన ఆర్థిక రంగాల్లో ఇదొకటి. కొవిడ్‌ దెబ్బకు తొలిగా మూతపడి, చివరిగా తెరుచుకొనేది ఈ రంగమే. భారత ప్రయాణ, పర్యాటక రంగం వాటా జీడీపీలో 2.5 శాతంగా ఉంది. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య తొమ్మిది నెలల కాలంలో 2.15 కోట్ల మంది ఈ రంగంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయినట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించడం నష్ట తీవ్రతను స్పష్టంచేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో టూరిజం రంగంలో గణనీయ సంఖ్యలో ఉద్యోగాల నష్టం వాటిల్లినట్లు పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి రాజ్యసభకు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి ముందస్తు దశలో 2019-20లో సైతం 3.48 కోట్ల ఉద్యోగాల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పర్యటక రంగానికి తలెత్తిన నష్టాలపై ఎన్‌సీఏఈఆర్‌ అంచనాల్ని రూపొందించింది. 2020-21లో స్థూలంగా ఆర్థిక మందగమనం కారణంగా, పర్యాటక ఆర్థిక వ్యవస్థ 2020 ఏప్రిల్‌-జూన్‌లో 42.8 శాతం క్షీణించినట్లు తేలింది. మరోవైపు, 2019తో పోలిస్తే, 2020లో విదేశ మారక ద్రవ్య ఆర్జన (ఎఫ్‌ఈఈ) 76.3 శాతం తగ్గిపోయింది.

అపార నష్టం..

రెండో విడత కొవిడ్‌ ఉద్ధృతితో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పలు పర్యాటక ప్రదేశాల్ని మూసి ఉంచడంతో ఈ పరిశ్రమపై ఆధారపడే వారందరికీ తీవ్ర నష్టం వాటిల్లింది. ఆటోరిక్షా డ్రైవర్లు, బస్సులు, వాహనాలు, హోటళ్ల నిర్వాహకులు, ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌గైడ్లు, చిరు వ్యాపారులు వంటి వారందరికీ జీవనోపాధి కరవైంది. వరసగా రెండేళ్లు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమేనని, తమ బతుకులు మరింత భారంగా మారాయని వాపోతున్నారు. కనీస అవసరాల్ని తీర్చుకోవడానికి సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. రుణాలు భారీగా పెరిగి, పెనుభారంగా పరిణమించినట్లు ఆవేదన చెందుతున్నారు. పర్యాటక కేంద్రాల్ని తిరిగి తెరిచేవరకు తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటూ ప్రభుత్వాలపై ఆశలు పెట్టుకొన్నారు. పర్యాటక పరిశ్రమకు భారీ ఆర్జన సాధించిపెట్టే సీజన్లు లాక్‌డౌన్లతో నష్టాల్లోనే ముగిశాయి. అయినప్పటికీ చాలా సంస్థలు తమ ఉద్యోగులకు భారంగానైనా వేతనాలు చెల్లిస్తూ, కరెంటు ఇతరత్రా రుసుములు భరిస్తున్నాయి.

పర్యటక సీజన్‌ ప్రారంభమైన తరవాత మరోసారి వైరస్‌ వ్యాప్తి చెంది, మొత్తంగా మూసివేయకుండా ఉండేందుకు- టీకా వేసుకున్నట్లు, లేదా కరోనా నెగెటివ్‌ ధ్రువపత్రం ఉంటేనే అనుమతించాలని, లేనివారికి ప్రవేశమార్గాల వద్దే అవసరమైన ఏర్పాట్లు చేయాలని పర్యాటక సంస్థలు సూచిస్తున్నాయి.

మినహాయింపులు ఇస్తే మేలు..

2020-21లో పర్యటక రంగంపై కొవిడ్‌ ప్రభావం వల్ల తీవ్రస్థాయి ఆర్థిక నష్టాలు దాపురించాయని, తమను ఆదుకోవాలంటూ ఈ రంగానికి చెందిన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించాయి. చట్టపరమైన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈ రంగంలోని అన్ని పరిశ్రమలు, సంస్థలకు కరెంటు ఛార్జీలు, ఇతరత్రా రుసుములు, ఎక్సైజ్‌ డ్యూటీ, ఆస్తిపన్ను, అంతర్‌ రాష్ట్ర పర్యాటక రవాణా ఛార్జీలు, ఎస్‌జీఎస్‌టీ మినహాయింపు, స్థానిక పన్నుల నుంచి రాష్ట్రాలు ఎలాంటి జరిమానాలు లేకుండా వందశాతం మినహాయింపు వంటి వెసులుబాట్లు కల్పించాలని పర్యాటక, ఆతిథ్య రంగ సంస్థల సమాఖ్య విన్నవించింది. 2021-22లో గడువు ముగిసిపోయే అన్ని లైసెన్సులు, అనుమతులు పర్మిట్లను బేషరతుగా నవీకరించాలని కోరింది. ఇందుకు ఎలాంటి రుసుములు, జరిమానాలూ వసూలు చేయకూడదని పేర్కొంది. పర్యాటక రవాణా, ఆతిథ్య రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని కోరుతోంది. ఈ క్రమంలో పర్యాటక పరిశ్రమకు చెందిన వారికి సరైన రీతిలో ఉపయోగపడేలా ఉపశమన ప్యాకేజీని ప్రకటించాల్సి ఉంది. జీఎస్టీ పన్నుల మినహాయింపులు కల్పించాలి. కొవిడ్‌ టీకాల్లో ఈ రంగానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.

బలంగా పుంజుకోవాలి

కొవిడ్‌ మహమ్మారి కోరల్లో విలవిలలాడుతున్న పర్యాటక, ఆతిథ్య రంగ పరిశ్రమ బలంగా పుంజుకొనేందుకు ఉదారంగా తోడ్పడాలి. మహమ్మారి తదనంతర కాలంలో భౌతిక దూరం అనేది ఒక శాశ్వత నియమంలా స్థిరపడే అవకాశం ఉన్నందువల్ల ఆతిథ్య, పర్యాటక పరిశ్రమ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమ ప్రణాళికలకు కొత్త రూపునివ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం, పర్యాటక పరిశ్రమ జట్టుగా ఈ రంగం సుస్థిరాభివృద్ధికి అవసరమైన విధివిధానాలకు ఆకృతినివ్వాలి. ఈ పరిశ్రమ వేసే ప్రతి అడుగూ సుస్థిర భవిష్యత్తు దిశగా పడాలి. అన్ని వర్గాలూ ఏకతాటిపై నిలబడి, కొత్త మార్గాలు, పరిష్కారాలను అన్వేషిస్తేనే మళ్ళీ పర్యాటక అభివృద్ధి సాధ్యపడుతుంది.

- డి.శ్రీనివాస్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.