శ్వాసకోశ వ్యాధులు కలిగినవారిని కొవిడ్ కబళిస్తోంది. ఊపిరితిత్తులు బలహీన పడిన వారిని మృత్యు కోరల బారిన పడేస్తోంది. ఐసీయూలో ఉండి కృత్రిమ శ్వాస (వెంటిలేటర్)పై బతుకుపోరాటం చేయాల్సిన దుస్థితి కల్పిస్తోంది. కరోనా వైరస్ విషయంలో శ్వాసకోశాల ఆరోగ్యంపైనే వ్యక్తి రోగనిరోధక సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం అలవాటు ఉన్నవారు కరోనాకు సులభ లక్ష్యాలవుతారు. వారు తక్షణం మేలుకుని వైద్యనిపుణుల సలహాలు తీసుకోవాలి. యువకులు కౌన్సెలింగ్ ద్వారా దురలవాట్లకు దూరం కావాల్సిన సమయమిది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు అధికంగా వాడే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తున్న వేళ, ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం!
25 కోట్లకు పైగా..
పొగ తాగడం వల్ల దెబ్బతినే శ్వాసకోశాలు సులభంగా ఇన్‌ఫెక్షన్ బారిన పడతాయి. దీర్ఘకాల వ్యసనపరుల్లో వ్యాధి అంత సులభంగా తగ్గదు. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం దేశంలో 25కోట్లకు పైగా పొగాకు వినియోగదారులు ఉన్నారు. పొగాకు ఉత్పత్తిలోనే కాదు, వినియోగంలోనూ ప్రపంచంలో భారత్‌ది రెండోస్థానం. నిజానికి పొగాకు మనదేశంలో ఏళ్ల తరబడి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ధూమపాన సంబంధిత రోగాల వల్ల ఏటా సగటున 9.30 లక్షలు, పొగరాని పొగాకు కారణంగా మరో 3.50 లక్షల మరణాలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు 3,500మందిని పొగాకు పొట్టన పెట్టుకుంటోంది. దేశంలోని మొత్తం మరణాల్లో ఏడు శాతం పొగాకు వాడకం వల్లే సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరిస్తోంది. పొగాకు వాడకం వల్ల బాధితులు నష్టపోయిన మొత్తం ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలు మించిపోవడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశప్రగతికి శరాఘాతమే అనాలి. జీడీపీ మొత్తంలో ఇది 1.16 శాతానికి సమానం. ఆ ఏడాది ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఖర్చుచేసిన దానికన్నా పొగాకు వాడకంవల్ల నష్టపోయినదే ఎక్కువ.
63 శాతం మరణాలు..
ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్న క్రమంలో గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం లాంటివి చుట్టుముడతాయి. వీటివల్ల శరీరం బలహీనపడినప్పుడు కొవిడ్ సోకితే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. దేశంలో ప్రస్తుతం సాంక్రామికేతర వ్యాధుల కారణంగానే 63 శాతం మరణాలు నమోదవుతున్నాయని అంచనా. ఇప్పుడు కొవిడ్ కారణంగా వీటి ఉద్ధృతి మరింతగా పెచ్చరిల్లుతుందనడంలో సందేహం లేదు. పొగాకులో మొత్తం ఏడు వేల విషరసాయనాలు ఉన్నాయి. ఇవి 69 రకాల క్యాన్సర్లకు కారణమవుతాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. దీనివల్ల వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడలేక రోగనిరోధక వ్యవస్థ క్షీణించి రోగాలు ముదురుతాయి.
నోటిని, ముక్కును తరచూ...
పొగాకు ఉత్పత్తులను వాడేవారు తమ నోటిని, ముక్కును తరచూ తాకుతుంటారు. ఈ అలవాటు చాలు, వారు కొవిడ్ బారిన సులభంగా పడటానికి. హుక్కా పీల్చేవారు సైతం పైపులను మార్చుకుంటుండటంవల్ల కొవిడ్ సామాజిక వ్యాప్తికి కారకులవుతున్నారు. గుట్కా, జర్దా, ఖైనీలను వాడేవారు చేతుల్ని నోటిదగ్గరకు తీసుకెళ్తుంటారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతుంది. లాలాజలం తుంపర్ల ద్వారా వైరస్ గాలిలోకి ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు. పొగాకు వినియోగదారులు బహిరంగ ప్రదేశాల్లో తరచూ ఉమ్ముతుంటారు. దగ్గు, తుమ్ములు వీరిలో ఎక్కువే. కనుక వైరస్ వ్యాప్తికి వీరు కారకులవుతున్నారన్నది నిర్వివాదం. కొవిడ్‌ను నిలువరించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో పొగాకు ఉత్పత్తుల కట్టడి ఒక ప్రధాన భాగం కావాలి. వారికి ముందస్తు కౌన్సెలింగ్ అందజేయాలి. వ్యసనం బారిన పడినవారికి ప్రాథమిక అవగాహన కల్పించాలి. అలవాటును వదిలిన రెండు నుంచి 12 వారాల వ్యవధిలో రక్తప్రసరణ మెరుగుపడి ఊపిరితిత్తుల పనితీరు గాడిన పడుతుంది. తొమ్మిది నెలల వ్యవధిలో దగ్గు తగ్గుముఖం పడుతుంది. కనుక కొవిడ్ సోకకుండా తమనుతాము కాపాడుకునే బాధ్యత ఇతరులకన్నా ధూమపాన ప్రియులకు అధికంగా ఉంటుంది.
- షణ్మితా రాణి (బెంగళూరు నిమ్‌హాన్స్‌లో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్)