పాకిస్థాన్‌లోని కీలకమైన సింధ్ రాష్ట్రంలో స్వాతంత్య్ర పోరాటం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే బలూచిస్థాన్ వేర్పాటువాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు తాజాగా సింధ్ జాతీయవాదం పెనుసవాలు విసరుతోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. సింధ్ జాతీయవాద పితామహుడిగా ఖ్యాతికెక్కిన జీఎం సయ్యద్ 117వ జయంతి సందర్భంగా జనవరి 17న సింధ్ రాష్ట్రంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.
మోదీ జీ సాయం చేయండి
పాక్‌చెర నుంచి సింధ్ ప్రాంతాన్ని విడిపించి- ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీల్లో తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ... భారత ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ప్రపంచనేతల ప్లకార్డులను ప్రదర్శించడం సంచలనం సృష్టించింది. భారత్‌తో సహా ఇతర ప్రపంచదేశాలు తమ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు పలకాలని సింధ్ జాతీయవాదులు కోరుతున్నారు. సింధు నాగరికత కాలం నాటి నుంచి బ్రిటిషర్లు ఆక్రమించేవరకు ఆ ప్రాంతం తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వంతో ఉండేదని, దేశ విభజన సమయంలో ఈ ప్రాంతాన్ని పాక్‌కు అప్పగించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత సంస్కృతి, చరిత్రను ధ్వంసం చేయాలని పాక్ పాలకులు కుట్రలకు పాల్పడుతున్నా సింధ్ సమాజం మాత్రం బహుళత్వం, సహనం, అన్ని వర్గాలతో కలిసి జీవించడం... వంటి అంశాలను కోల్పోలేదని సింధ్ ముత్తాహిద మహజ్ ఛైర్మన్ షఫీ మహమ్మద్ బుర్ఫట్ చెబుతున్నారు.
హిందువుల నివాసాలపై దాడి
దేశవిభజన సమయంలో సింధ్ లౌకికవాదానికి కేంద్రబిందువుగా ఉండేది. విభజన సమయంలో కరాచీలో హిందువుల నివాసాలపై కొందరు మతవాదులు దాడులు జరపడంతో లక్షలాది హిందువులు కట్టుబట్టలతో భారత్‌కు వలసవచ్చారు. ఈ హింసాత్మక ఘటనలతో కలత చెందిన సింధ్ జాతీయవాదులు దాడుల వెనక పాక్ ప్రభుత్వకుట్ర ఉందని అనుమానించారు. నాటి సింధ్ జాతీయవాదులైన ఇబ్రహీం జోయో, జీఎం సయ్యద్... తదితరులు సింధ్ జాతీయవాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. భారత్, పాక్ విభజన అనంతరం- పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రాంతీయుల ప్రాబల్యం బాగా పెరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో వారిదే అధికారం. కీలకపదవుల్లో వారు నియమితులయ్యారు. వారి ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు బలూచ్, సింధ్ తదితర ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
ఇలా మొదలైన స్వాతంత్ర్య కాంక్ష
పాక్‌లో అతిపెద్ద నౌకాశ్రయం కరాచీ. ఈ నగరం పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటిది. ఇక్కడ నుంచి వచ్చే ఆదాయాన్ని పాక్ పాలకులు పంజాబ్‌కు తరలించడాన్ని సింధ్ జాతీయవాదులు ప్రశ్నిస్తున్నారు. 1972లో సయ్యద్ సారథ్యంలోని జీయ్‌సింధ్ తొలిసారిగా తాము పాక్‌నుంచి స్వాతంత్య్రం కోరుకుంటున్నామని ప్రకటించింది. 1971లో పాక్ నుంచి తూర్పు పాకిస్థాన్ వేరువడి బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఇదే సింధ్ దేశ ఏర్పాటుకు సరైన వేదిక అని సయ్యద్ భావించారు. సింధ్ ప్రాంతానికి చెందిన జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానిగా ఎన్నిక కావడంతో ఆ డిమాండ్ ప్రాధాన్యం కోల్పోయింది. అనంతరం అధికారం కైవసం చేసుకున్న జనరల్ జియా ఉల్‌హక్ హయాములో జీయ్‌సింధ్ పలు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్యమం తాత్కాలికంగా కనుమరుగైంది. భారత్ నుంచి పాక్‌కు వచ్చిన ముహజిర్లు క్రమంగా సింధ్‌లో బలపడటం ప్రారంభమైంది. ముహజిర్లకు చెందిన ముత్తహిద క్వామీ ఉద్యమ నేత అల్తాఫ్ హుస్సేన్ రాజకీయంగా బలమైన శక్తిగా మారారు. సింధ్ జాతీయవాదులకు ఇది నచ్చకపోవడంతో తిరిగి ఉద్యమం ప్రారంభమైంది. జీయ్‌సింధ్ క్వామీ మహజ్‌తో పాటు సింధ్ ప్రాంతానికి చెందిన సంస్థలు ప్రపంచ సింధీ కాంగ్రెస్‌లు శాంతియుతంగా తమ పోరాటాన్ని ప్రారంభించాయి.
2010, 2011లో ‘సింధ్ దేశ్ లిబరేషన్ ఆర్మీ’ అనే మిలిటెంట్ సంస్థ కొన్ని ఉగ్రకార్యకలాపాలకు పాల్పడింది. 2012లో కరాచీ సింధ్ దేశ్ ర్యాలీ పేరిట భారీ ప్రదర్శన నిర్వహించారు. మొదట్లో ఈ ఉద్యమాలను చూసీచూడనట్లు ఉన్న పాక్ ప్రభుత్వం 2020లో ఈ ప్రాంత స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమున్న ఉద్యమ, రాజకీయ సంస్థలను నిషేధించింది.
పంజాబీల రాకను వ్యతిరేకిస్తూ..
పాక్ రాజకీయాలను శాసిస్తున్న పంజాబ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సింధ్ రాష్ట్రంలో తిష్ఠవేసి ఖనిజాల వెలికితీత నిమగ్నమయ్యారు. పంజాబీల రాకను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. బయటి వ్యక్తుల ఆధిపత్యాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఖనిజాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పాక్ సైన్యం స్వాధీనం చేసుకోవడం, ఖనిజాల వెలికితీతకు పంజాబ్‌వాసులను అనుమతించడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ బడ్జెట్‌లో 70శాతం సింధ్ నుంచే వస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాల్ని భారత్ అక్కడ ప్రచారం చేయాలి
ఇటీవల బలూచ్, సింధ్ వర్గాలకు చెందిన సంస్థలు పాక్ విస్తరణవాదానికి వ్యతిరేకంగా, చైనా ఆధ్వర్వంలో నిర్మిస్తున్న ఆర్థిక నడవాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అన్ని రకాలుగా సాయం చేస్తున్న పాక్‌కు ముకుతాడు వేసేందుకు భారత్ అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాలను ప్రచారం చేయాల్సిన అవసరముంది.
- కొలకలూరి శ్రీధర్
ఇదీ చూడండి: వ్యవసాయశాఖ మంత్రిపై ప్రధాని ప్రశంసలు