ETV Bharat / opinion

వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

పోలీసుల ధోరణి ఏటికేడు తీసికట్టుగా మారుతోంది. పౌరులకు, చట్టానికి, వ్యవస్థకు రక్షకభటులు జవాబుదారీ కావాలని జాతీయ పోలీసు సంఘం సుద్దులు చెబుతున్నా? సంఘటిత నేరగాళ్ల వర్గంగా తయారయ్యారని సుప్రీంకోర్టు తలంటినా... వారి ధోరణిలో మార్పు రావడం లేదు. తమిళనాట తూత్తుకుడి జిల్లాలో ఇటీవల జరిగిన దారుణం ఆ నిజాన్ని ఎలుగెత్తి చాటుతోంది!

The police system is changing for the worse
వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం
author img

By

Published : Jul 5, 2020, 8:36 AM IST

ఇరవై లక్షలకు పైగా ఉన్న పోలీసు బలగం- అంతర్గత భద్రతా కర్తవ్యదీక్షలో నిమగ్నమై ఉన్న దేశం మనది. బ్రిటిషర్ల జమానాలో పాలకశ్రేణుల కొమ్ముకాయడమే వారి విధిగా ఉన్నా, స్వాతంత్య్రం వచ్చాక ప్రజల సంరక్షణే వారి ప్రాథమిక కర్తవ్యం అయి ఉండాల్సింది! పౌరులకు, చట్టానికి, వ్యవస్థకు రక్షకభటులు జవాబుదారీ కావాలని జాతీయ పోలీసు సంఘం ఎన్ని సుద్దులు చెబితేనేం? సంఘటిత నేరగాళ్ల వర్గంగా తయారయ్యారని సుప్రీం న్యాయపాలిక మరెంతగా తలంటితేనేం? వారి ధోరణి ఏటికేడు తీసికట్టుగా మారుతూనే ఉంది. అభాగ్యుల ప్రాణాల్ని కసిగా కబళించే స్థాయిలో పోలీసు క్రౌర్యం కొత్త కోరలు తొడుక్కొంటూనే ఉంది. తమిళ నాట తూత్తుకుడి జిల్లాలో ఇటీవలి దారుణం ఆ నిజాన్ని ఎలుగెత్తి చాటుతోంది!

క్రౌర్యానికి రెండు ప్రాణాలు బలి

ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడాలంటే, లాక్‌డౌన్‌ ద్వారా జన సంచారాన్ని అదుపు చెయ్యాల్సిందేనని ప్రభుత్వాలు తీర్మానించాయి. కేసుల ఉరవడి పరంగా మహారాష్ట్రతో పోటీపడుతున్న తమిళనాడూ కఠిన లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించి రాత్రి ఏడున్నర దాటాక కూడా మొబైల్‌ దుకాణం తెరచి ఉంచడం ఏమిటంటూ జూన్‌ 19వ తేదీన జయరాజ్‌(60) అనే వ్యక్తిపై పోలీసులు దాడిచేశారు. సత్తానుకులం పోలీస్‌ స్టేషన్‌కు అతణ్ని తరలించగా, తండ్రిని విడుదల చెయ్యాలని కోరడానికి వెళ్ళిన ఫెనిక్స్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అతగాడినీ నిర్బంధించారు. 22వ తేదీన ఛాతీ నొప్పితో ఉన్న జయరాజ్‌ని పోలీసులు కొవిల్‌పట్టి ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ మరునాడు అదే ఆసుపత్రిలో కొడుకూ కన్నుమూశాడు. పోలీసుల క్రౌర్యమే ఆ ఇద్దర్నీ బలిగొందంటూ జయరాజ్‌- ఫెనిక్స్‌లకు న్యాయం కోసం రేగిన జనాందోళన, న్యాయపాలికను ప్రభుత్వాన్ని కదిలించింది. ఆ క్రమంలో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ దర్యాప్తు- నేరన్యాయ వ్యవస్థలో కీలక భూమిక పోషించే రక్షకభటుల నేరమనస్తత్వాన్ని దిసమొలతో సాక్షాత్కరింపజేసింది!

దురాకృత్యాలు

కొవిల్‌పట్టి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎంఎస్‌ భారతీదాసన్‌ సమర్పించిన నివేదిక ప్రకారం- పోలీస్‌ ఠాణాలో సీసీటీవీ కెమెరాను ఏ రోజు రికార్డు చేసింది ఆ రోజే తొలగించేలా 'ఆటో-డిలీట్‌' మోడ్‌లో పెట్టారు. ఆ రకంగా పోలీసు ఠాణాలో తమ దారుణమారణానికి సాక్ష్యం లేకుండా జాగ్రత్తపడ్డారు. కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారి దాకా అంతా దర్యాప్తు బృందం పట్లా అనుచితంగా ప్రవర్తించారన్న కమిటీ- 'మమ్మల్నేమీ పీకలే'రంటూ కానిస్టేబుల్‌ ప్రదర్శించిన నోటి దురుసుతనాన్నీ ప్రస్తావించింది. ఆ రాత్రి తండ్రీకొడుకులపై పోలీసు జులుం ఏ స్థాయిలో సాగిందో అక్కడ పనిచేసే మహిళా పోలీసు తీవ్ర భయాందోళనలతో పూసగుచ్చింది. లాఠీలకే కాదు, బల్లలకూ నెత్తుటి మరకలంటేలా వంతుల వారీగా పోలీసులు గంటల తరబడి వారిని ఎలా చావగొట్టిందీ మహిళా కానిస్టేబుల్‌ వాంగ్మూలం ఎలుగెత్తుతోంది. జనారణ్యంలో సాధు పౌరుల్ని సతాయించే నేరవ్యాఘ్రాల్ని కట్టడి చెయ్యడానికి పోలీసులకు ఇచ్చిన అధికారాలు, లాఠీలు- అభాగ్యజీవుల ఉసురుపోసుకొంటున్నాయి. పోలీసు ఠాణాల్లో పౌరుల ప్రాథమిక హక్కులూ దిక్కులేనివి అవుతున్నాయి. గణతంత్ర రాజ్యంగా ఇండియా ఆవిర్భవించిన 70 ఏళ్ల తరవాతా ఈ తరహా దురాకృతాలు దేశం పరువు తీసేస్తున్నాయి.

సంస్కరణలు కావాలి!

అమెరికాలో ఈ మధ్యనే జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రో-అమెరికన్‌ను నిర్బంధించే సందర్భంలో పోలీసు దురాగతం అతగాడి ప్రాణాల్ని బలిగొంది. దానిపై ఒక్క అమెరికాలోనే కాదు, దేశదేశాల్లో నిరసనలు పోటెత్తడంతో పోలీసు సంస్కరణలపై అక్కడ పెద్దయెత్తున కసరత్తు మొదలైంది. మినెపొలిస్‌ పాలక మండలి నగర పోలీసు శాఖను రద్దు చేసెయ్యడానికే నిర్ణయించింది. ఉక్రెయిన్‌, జార్జియా దేశాలు ఈ సరికే కాలం చెల్లిన పోలీసు వ్యవస్థలకు చెల్లుకొట్టి, నేటి అవసరాలకు దీటైన వాటిని ఏర్పాటు చేసుకొన్నాయి. అదే ఇండియాలో, దశాబ్దాల తరబడి పోలీసు సంస్కరణల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమై నాగరిక జీవన ప్రమాణాల్ని దిగలాగుతున్నాయి. చట్టబద్ధపాలన సూచీలో మొత్తం 126 దేశాల చిట్టాలో ఇండియా 68వ స్థానంలో నిలిచింది. ఎనిమిది ప్రాతిపదికల ప్రకారం ఇండియా పనితీరును విశ్లేషిస్తే- శాంతిభద్రతల పరంగా అది 111వ స్థానంలో ఉంది. వాస్తవ పరిస్థితి అంత అధ్వానమా అని బుగ్గలు నొక్కుకునేవారికి జాతీయ మానవ హక్కుల సంఘం అందించే వివరాలే జ్ఞానోదయం కలిగిస్తాయి. ప్రతిరోజూ సగటున కస్టడీ హింసకు సంబంధించి 15 కేసులు నమోదవుతున్న దేశం మనది. అందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోతున్నారని సర్కారీ లెక్కలే చెబుతున్నాయి. పోలీసు కస్టడీ మరణాలు చాలాకాలానికి గాని వెలుగు చూడటం లేదని, కొన్నిఅయితే అసలు నమోదే కావడం లేదని జాతీయ మానవ హక్కుల సంఘం తేల్చిచెప్పింది. అంతా యథాలాపంగా జరిగిపోతోందన్న నివేదిక ఇదమిత్థంగా నిగ్గు తేల్చిందేమిటి? అవ్యవస్థ ఎక్కడికక్కడ మర్రిమానులా ఊడలు దిగిందని! కస్టడీ మరణాలకు కారకులంటూ ఏ కొందరినో శిక్షించినా వ్యవస్థాగత మార్పు దుర్లభమనీ తేటపడుతున్నందువల్ల గరళ వైద్యమే గట్టిగా జరగాలి!

ఎవరూ అతీతం కాదు

ఎవరెంతటి వారైనా రాజ్యాంగం చట్టం వారికంటే ఉన్నతమైనవని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టీకరించింది. గతనెల 23న చర్చికి వెళ్లినప్పుడు మాస్కు ధరించనందుకు బల్గేరియా ప్రధానమంత్రికి ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ 300 లెవ్స్‌ (రూ.13,000) జరిమానా విధించింది. చట్టబద్ధ పాలన అంటే అదీ! కానీ ఇండియాలో 2005-2015 నడుమ నేరాల రేటు 28శాతం పెరిగినా శిక్షలు మాత్రం ఎండమావినే తలపిస్తున్నాయి. 'దాని అర్థం ఇక్కడ చట్టబద్ధ పాలన లేదని కాదు... పాలకుల చట్టం కూడా అమలవుతోందని' అంటూ యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్‌ సింగ్‌ ఆవేదన చెందారు. రాజ్యాంగ చట్టం ఏమి చెబుతోందన్నది కాకుండా, అధికారంలోని పెద్దల మెహర్బానీ కోసం ఎంతకైనా తెగించే పోలీసు బృందం నుంచి నైతిక నిష్ఠ, పౌరభద్రత వంటివాటిని ఎవరు మాత్రం ఆశించగలరు? పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడిని ఉపేక్షిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులే కదిలిపోతాయని దశాబ్దాల క్రితమే వెలువడిన హెచ్చరికలు అరణ్యరోదనమయ్యాయి. రాజ్యాంగ విలువల్ని అపహసించే అధికార దండధరుల కండకావరాన్ని పుణికిపుచ్చుకొని పోలీసుల ఇష్టారాజ్యానికి తెగబడ్డ ప్రతిసారీ చీకటి కొట్టాల్లో చావుకేకలు ప్రతిధ్వనిస్తున్నాయి.

మెరుగైన వృత్తి నైపుణ్యం, అంకితభావం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ఆధునిక శిక్షణ, దర్యాప్తులో సాంకేతికత వినియోగాల కలబోతగా కొత్తతరం పోలీసు పుట్టుకురావాలని ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ అభిలషిస్తే- 'స్మార్ట్‌' పోలీసు అవసరాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. వృత్తిపర స్వతంత్రత, జవాబుదారీతనం మచ్చుకైనా కానరాని పోలీసు వ్యవస్థకు వాటిని ప్రసాదించకుండా పైపై మెరుగుల సంస్కరణల వల్ల పౌరహక్కులకు భద్రత ఎలా కల్పించగలరు? చట్టబద్ధ నడతే విధిగా, పౌరభద్రతే పరమావధిగా పోలీసు యంత్రాంగాన్ని తీర్చిదిద్దినప్పుడుగాని దేశం తెరిపిన పడదు!

- పర్వతం మూర్తి (రచయిత)

ఇదీ చూడండి: వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్​ ప్రదేశ్​పై గురి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.