ETV Bharat / opinion

అందరికీ పోషకాలు అందేదెలా?

author img

By

Published : Dec 19, 2020, 7:26 AM IST

ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో పప్పు ధాన్యాలను పండిస్తున్న ప్రాంతంగా భారత్​ ప్రసిద్ధి పొందింది. అయినప్పటికీ అందరికీ పోషకాహారం అందట్లేదు. పల్లెల్లో పప్పుల వినియోగం గణనీయంగా తగ్గుతోంది. బిస్కెట్లు, కేకులు, శీతల పానీయాల వాడకం పెరుగుతోంది. ఆరోగ్యానికి మంచి చేసే ఆహార పదార్థాలను ప్రజలు విస్మరిస్తున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 2016-20 మధ్యకాలంలో పల్లెల్లో శీతల పానీయాల వినియోగం రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.

the-number-of-victims-of-increasing-malnutrition
అందరికీ పోషకాలు అందేదెలా?

గడచిన రెండు దశాబ్దాల్లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నాలుగున్నర రెట్లు పెరిగితే, ప్రజల తలసరి వినియోగం మూడు రెట్లు హెచ్చింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు రెట్లు పెరిగినందువల్ల భారత్‌ ఎగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రజల ఆహార అవసరాలను తానే తీర్చగలుగుతోంది. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న పేద ప్రజానీకానికి పౌష్టికాహారం అందించడంలో భారత్‌ చేయవలసింది చాలా ఉంది. దేశంలో దాదాపు 19 కోట్లమంది పేద ప్రజలు పౌష్టికాహార లోపం కలిగి ఉన్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2020 సంవత్సర నివేదిక తెలిపింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసు మహిళల్లో 51.4శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది పిల్లలను కనే వయసు కావడంతో ఆ మహిళల సంతానం దుర్బలంగా మారుతోంది. అందుకే భారత్‌లో అయిదేళ్ల లోపు బాలల్లో 34.7శాతం తమ వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. మరి 20 శాతం ఉండాల్సిన బరువుకన్నా తక్కువ ఉంటున్నారు. సరైన పోషణ లేని పిల్లలు నీళ్ల విరేచనాలతో, మలేరియా, న్యుమోనియాలతో మరణించే ప్రమాదం ఎక్కువ. ఇటీవల గ్రామాల్లోని పేద కుటుంబాల్లో పాలు, గుడ్ల వాడకం పెరిగినా అవి చాలినంత పరిమాణంలో ఉండటం లేదు. మాంసకృత్తులు దండిగా ఉండే పప్పుగింజల వాడకం పెరగనిదే పేదల్లో పౌష్టికాహార లోపాన్ని తొలగించలేం.

పడిపోతున్న పప్పుగింజల వినియోగం

పల్లెల్లో ఉన్నకాస్త పప్పుల వినియోగమూ తగ్గిపోతూ బిస్కెట్లు, కేకులు, శీతల పానీయాల వాడకం పెరుగుతోందని జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సంస్థ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2016-20 మధ్యకాలంలో పల్లెల్లో శీతల పానీయాల వినియోగం రెట్టింపు అయింది. ఇంటింటా టెలివిజన్‌ ఉన్నందువల్ల ఈ తరహా వ్యర్థాహారాల వాణిజ్య ప్రకటనలు గ్రామీణ శ్రామిక జనాన్ని, ముఖ్యంగా ఆ కుటుంబాల్లోని యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో బిస్కెట్లు, కూల్‌ డ్రింకుల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ తరహా ఆహారాలను భుజిస్తూ, సంప్రదాయ పప్పులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రేషన్‌ కార్డులున్న ప్రతి కుటుంబానికీ ఈ ఏడాది నవంబరు వరకు నెలకు అదనంగా అయిదు కిలోల బియ్యం లేక గోధుమలు, ఒక కిలో పప్పు గింజలను అందించడానికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని అమలు చేశారు. ఇది స్వాగతించాల్సిన పథకమే కానీ, దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పోషకాహార లోపాన్ని అదుపు చేయడానికిది పూర్తిస్థాయిలో తోడ్పడదు.

కొరవడిన పరిశోధనలు

మంచి విత్తనాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు లేకపోవడం, అసమర్థ సేకరణ యంత్రాంగంవంటివి రైతులకు పప్పుగింజల సాగు పట్ల విముఖత పెంచుతున్నాయి. ఇది ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తోంది. 2012-13 నుంచి 2014-15 వరకు సాగైన ఆహార ధాన్యాల్లో దాదాపు 30 శాతాన్ని సేకరించిన ప్రభుత్వ సంస్థలు, పప్పుల ఉత్పత్తిలో కేవలం ఒకశాతం నుంచి నాలుగుశాతం వరకు మాత్రమే సేకరించాయి. ఇది పప్పుల ధరల పతనానికి దారితీసింది. భారత్‌లో ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లోనే పప్పులు పండిస్తారు. ఈ పొలాలకు సాగునీటి సౌకర్యం లేక పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. నాసిరకం విత్తనాలు ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. మేలైన విత్తనాల కోసం పరిశోధనలు జరగడం లేదు. ఇతర ఉత్పత్తి సాధనాలూ రైతులకు లభ్యం కావడం లేదు. ఇదంతా పప్పుగింజల ఉత్పత్తిని ఎదుగూబొదుగూ లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలి. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేవలం వరి-గోధుమ పంటలకే పరిమితమైన ప్రాంతాల్లో పప్పుగింజల సాగును ప్రోత్సహించాలి.

ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో ఎక్కువ పరిమాణంలో పప్పు గింజలను పండిస్తున్నది- భారతదేశమే. ఏటా 2.2 కోట్ల నుంచి 2.4 కోట్ల టన్నుల పప్పులను పండిస్తూ- జనాభా అంతటికీ సమృద్ధిగా వాటిని అందించలేకపోతోంది. కారణం- మన దేశంలో పప్పుల దిగుబడి హెక్టారుకు 800 కిలోలు మాత్రమే కావడం. అందుకే 2018 వరకు ఏటా 20 నుంచి 60 లక్షల టన్నుల పప్పులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. అయినా తలసరి పప్పుల లభ్యత తగ్గిపోతోంది. 1961లో తలసరి లభ్యత రోజుకు 62.19 గ్రాములైతే, 2019లో అది 47.9 గ్రాములకు తగ్గిపోయింది. చిత్రంగా- హరిత విప్లవం వల్ల భారత్‌లో పప్పు గింజల ఉత్పత్తి క్షీణించసాగింది. భారత్‌ వరి, గోధుమ పంటల్లో స్వయంసమృద్ధమైనా, పప్పుగింజల ఉత్పత్తిలో వెనకబడింది. 1960-61తో పోలిస్తే 2013-14లో వరి ఉత్పత్తి 225 శాతం, గోధుమ ఉత్పత్తి 808 శాతం పెరగ్గా, పప్పుల ఉత్పత్తి కేవలం 47 శాతమే పెరిగింది. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితి మెరుగుపడనేలేదు. దేశంలో 80శాతం పప్పుల సాగు వర్షాధార భూముల్లోనే సాగు కావడం దీనికి ప్రధాన కారణం.

ఆహార ధాన్యాలను మాత్రమే పండించడం వల్ల రసాయన ఎరువుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం తీవ్ర వాయుకాలుష్యానికి దారితీస్తోంది. ఆహార ధాన్యాల సాగు వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఆహార ధాన్యాల తరవాత పప్పులను సాగుచేస్తే నేలలో నత్రజని పెరిగి భూసారం వర్ధిల్లుతుంది. ఉపగ్రహాలు, బయోటెక్నాలజీ, సమాచార సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పప్పుల పంటలో అద్భుతాలు చేయవచ్చు. తెగుళ్లను తట్టుకోగల పప్పు వంగడాల సృష్టికి 2011-14 మధ్యకాలంలో జరిగిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కందులు, సెనగ పంటలను ఆశించే తెగుళ్లను తట్టుకోవడానికి బీటీ వంగడాలను సృష్టించడం వల్ల దిగుబడులు పెరిగి రైతులకు మంచి ధర వచ్చింది. కానీ, తరవాత ప్రభుత్వం ఈ తరహా పథకాలపై తగిన శ్రద్ధ పెట్టకపోవడం విచారకరం.

చౌకగా పోషక విలువలు

మన విధానకర్తలు పప్పుల ఉత్పత్తిలో భారత్‌ స్వయం సమృద్ధమైందనే అపోహలో ఉన్నారు. కానీ, తలసరి పప్పుల లభ్యత కనీసం 20 కిలోలు ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటే, వాస్తవంలో 14 కిలోలే అందుబాటులో ఉంది. దేశంలో పప్పుల ఉత్పత్తి 2.4 కోట్ల టన్నులను మించదు. మన 130 కోట్ల జనాభా అవసరాలను తీర్చాలంటే కనీసం మూడు కోట్ల టన్నులదాకా ఉత్పత్తి చేయాలి. అదీకాకుండా 30శాతం ఉన్నతాదాయ వర్గాలు వినియోగించే పప్పుల పరిమాణంకన్నా, 30శాతం అల్పాదాయ వర్గాల వినియోగం చాలా తక్కువ. మాంసం, పాలు, గుడ్లతో పోలిస్తే పప్పుగింజల ధరలు తక్కువ కాబట్టి, పేదలకు అవి అందుబాటులో ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం పప్పుల సాగు, వినియోగాలను పెద్దయెత్తున పెంచి పేదల్లో పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దాలి. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తున్న బియ్యం, గోధుమలకు తోడు కనీసం రెండు కిలోల పప్పులను అందించాలి. పంట దిగుబడులను పెంచి పేదలకు సరసమైన ధరలకే పప్పులు లభించేట్లు చూడాలి. భారతదేశానికి ఏకకాలంలో పప్పుల సాగు, వినియోగాలను పెంచగల సామర్థ్యం ఉంది. దాన్ని వెంటనే కార్యాచరణలో చూపి ప్రజలందరికీ బలవర్ధకమైన ఆహారం అందించాలి.

పరిటాల పురుషోత్తం (రచయిత-సామాజిక ఆర్థిక విశ్లేషకులు)

ఇదీ చదవండి: పోషకాహార లోపంతో భారీగా చిన్నారుల మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.