ప్రజాస్వామ్య సౌధానికి పట్టిన చెదగా నేరగ్రస్త రాజకీయాల్ని రెండేళ్లనాడే సర్వోన్నత న్యాయస్థానం ఈసడించింది. 2014 నాటికే దేశవ్యాప్తంగా 1581మంది శాసనసభ్యులపై క్రిమినల్ నేరాభియోగాలున్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) నిగ్గుతేల్చిన నేపథ్యంలో వాటి సత్వర విచారణకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయించిన న్యాయపాలిక- తాజా స్థితిగతుల వివరాల్ని గట్టిగా కోరి రాబట్టింది. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తిచేసి శిక్షపడ్డ నాయకులను జీవితాంతం ఎన్నికల నుంచి బహిష్కరించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోర్టు సహాయకులు (అమికస్ క్యూరీ) హన్సారియా వెల్లడించిన వాస్తవాలు దిగ్భ్రాంతకరంగా ఉన్నాయి. దేశీయంగా మాజీ, తాజా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 4,442 మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉండగా, వారిలో 2,556మంది ప్రస్తుత ప్రజా ప్రతినిధులే. ఒక్కొక్కరిపై పలుకేసులు, ఒక్కో కేసులో పలువురు ప్రతినిధుల ప్రమేయంపై అభియోగాలు నమోదైన వైనం- నేర రాజకీయాల సాలెగూడును కళ్లకు కట్టేదే! జీవిత ఖైదు శిక్షపడే హేయనేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాన్య ప్రతినిధుల సంఖ్యాపరంగా యూపీ రికార్డు అద్వితీయం. ఆ తరహా కేసులు ఎదుర్కొంటున్న 30మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు, 43మంది మాజీ శాసనసభ్యులతో బిహారుది ద్వితీయస్థానం. 1983 నుంచే కేసులు పోగుపడ్డా అత్యధిక కేసుల్లో నేరాభియోగాలే ఇంకా నమోదు కాలేదని అమికస్ క్యూరీ నివేదిక చాటుతోంది. విచారణ కోర్టులు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు అతీగతీ లేదనీ వెల్లడించింది. జీవితఖైదు శిక్ష పడగల కేసులు 413 ఉంటే వాటిలో 174 ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే నమోదయ్యాయి. పంజాబులో 1983 నాటి హత్యకేసుకు సంబంధించి 36 ఏళ్ల తరవాత నిరుడు ఓ ప్రజాప్రతినిధిపై అభియోగాలు నమోదు కావడం- నేర రాజకీయాల దుష్ప్రభావానికి తిరుగులేని దృష్టాంతం!
'అభియోగాలు రుజువయ్యేదాకా ముద్దాయిని దోషిగా పరిగణించరాదన్నది నిజమే అయినా ప్రజాజీవనంలో ప్రవేశించి, శాసన నిర్మాణంలో పాల్పంచుకొనేవారు తీవ్ర నేరారోపణలన్నింటికీ అతీతులై ఉండితీరాలి'- అని భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా రెండేళ్లనాడు స్పష్టీకరించారు. అభ్యర్థులపై దొంగకేసులు బనాయించే ప్రమాదం లేకపోలేదంటూనే అలాంటివాటికి విరుగుడేమిటో తర్కించి పార్లమెంటే చట్టం చేయాలని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగబద్ధ లక్ష్మణ రేఖల్ని మీరలేమంటూ న్యాయపాలిక మేలిమి సూచనలకు పరిమితమవుతుంటే, నేరంతో అద్వైతసిద్ధి పొందిన రాజకీయం రాజ్యాంగబద్ధ పాలననే భ్రష్టుపట్టిస్తోంది. నేరచరిత ఎంపీల సంఖ్య పద్నాలుగో లోక్‌సభలో 24శాతం; అది క్రమంగా 30కి, దరిమిలా 34శాతానికి విస్తరించి ప్రస్తుత లోక్‌సభలో 43 శాతంగా విక్రమించింది. హత్యలు, అత్యాచారాలు, అపహరింతల వంటి హేయనేరాలతోపాటు జాతి ద్రోహమనతగ్గ మనీల్యాండరింగ్ వంటివాటికి పాల్పడినవారూ శాసన నిర్మాతలై చక్రం తిప్పుతున్న తీరు ప్రజాస్వామ్య భారతిని క్షోభిల్లజేస్తోంది. 'సుప్రీం' ధర్మాసనం సూచించినట్లు నేరచరితులు ఎన్నికల్లో పోటీచేసే వీల్లేకుండా ఇంకా ఎందుకు చట్టం చెయ్యలేదో వివరించాలని గతనెల మూడోవారంలో మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. నేరగాళ్ల వల్లే పార్టీకి జవసత్వాలు వచ్చాయని లోగడ పాసవాన్ లాంటివాళ్లు విశ్లేషిస్తే, నేరచరితులే పార్టీలు పెట్టే స్థాయిలో నేడు పరిస్థితులు విషమించాయి. 'నేరగాళ్ల వలన ధనస్వామ్యం చేత అవినీతి కొరకు'గా దిగజారిన ప్రజాస్వామ్యం ఏ మాత్రం కోలుకోవాలన్నా- పార్టీల్లో ఆత్మపరిశీలన సాగాలి. పెడదారి పట్టిన పార్టీల భరతం పట్టే జనచేతనతోనే- అసలైన ప్రజాస్వామ్యం కొత్త చిగుళ్లు వేసేది!
ఇదీ చూడండి: రాజకీయం.. నేరమయం- సుప్రీం తీర్పు ఆశాకిరణం