ETV Bharat / opinion

మరింత గుట్టుగా యువజనంపై మాదకపంజా!

దేశంలో మాదక ద్రవ్యాల వాడకం నానాటికీ పెరిగిపోతుంది. 2009 నాటి మాదక ద్రవ్య నివేదికతో పోలిస్తే 30 శాతం వాడకం అధికమైంది. వీరిలో ఎక్కువగా కౌమార దశలో ఉన్న వారు, యువకులదే అతి పెద్ద వాటా. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇటీవల పట్టుకున్న మాదక ద్రవ్యాలను బట్టి చూస్తే వీటి వాడకం ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఈ మాదక ద్రవ్య సంబంధ రుగ్మతలతో బాధపడుతున్న వారు 3 కోట్ల మంది ఉన్నారన్నది బాధాకర వాస్తవం.

the consequences of drug and alcohol use for indian youth
దేశంలోని యువజనంపై మాదకపంజా!
author img

By

Published : Jun 30, 2020, 8:13 AM IST

మానవాళికి మహాపీడగా దాపురించిన మాదక ద్రవ్య మహమ్మారి- కొవిడ్‌ నేపథ్యంలో మరింత గుట్టుగా జనసామాన్యంలోకి చొచ్చుకుపోతోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి నిరాశా నిస్పృహలకు లోనైన బలహీన మనస్కులు మాదక ద్రవ్యాల విషపరిష్వంగంలోకి జారిపోతున్నారని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. వాటి వెన్నంటి వెలువడిన ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక- 2009 నాటితో పోలిస్తే 30 శాతం అధికంగా దాదాపు 27 కోట్ల మంది డ్రగ్స్‌ వినియోగిస్తున్నారని వారిలో కౌమార ప్రాయంలోని వారు, యువకులదే అతిపెద్ద వాటా అనీ స్పష్టీకరిస్తోంది. మూడున్నర కోట్లమంది మాదక ద్రవ్య సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారంటున్న నివేదిక- హెరాయిన్‌, నల్లమందు వంటి డ్రగ్స్‌ వాడకం ఇండియాలో 2004తో పోలిస్తే అయిదింతలు పెరిగిందన్న బాధాకర వాస్తవానికి అద్దం పట్టింది.

3 కోట్ల పైనే...

ఐక్యరాజ్యసమితి సారథ్యంలోని సంస్థ ఈ నిష్ఠుర సత్యాన్ని వెల్లడించడానికి ఎంతోముందే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పక్షాన నిర్వహించిన దేశవ్యాప్త సమగ్ర సర్వే- ఇండియాలో 15 శాతం జనావళి లిక్కర్‌ మత్తులో తూలుతోందని, మరో ఏడెనిమిది శాతం భిన్న మార్గాల్లో మాదక ద్రవ్యాల సేవనంలో జోగుతోందని నిర్ధారించింది. దేశంలో మాదక ద్రవ్య వ్యసనపరులు మూడు కోట్లు దాటిపోయారని నిరుడే నిగ్గుతేల్చిన నివేదిక- వారిలో అయిదు శాతానికైనా వైద్యసేవలు అందడం లేదంటోంది. మొన్నటికి మొన్న జమ్మూకశ్మీర్‌లో రూ.65 కోట్ల సరకు పట్టుబడగా- ఆరు నెలల క్రితం దేశ రాజధానిలోనే రూ.1,300 కోట్ల మాదక ద్రవ్యాలు పోలీసుల చేజిక్కాయి. అలా దొరుకుతున్న అంతంత మొత్తాలూ వాస్తవ సరఫరా పరిమాణంలో పిసరంతేనని, గిరాకీకి లోటు లేకుండా చూసుకొనే లక్ష్యంతో భావి పౌరుల్నీ నార్కోటిక్స్‌ బలిపీఠం ఎక్కిస్తున్నారన్న నివేదికలు గుండెల్ని పిండేస్తున్నాయి!

అప్పుడు 2 శాతం, ఇప్పుడు 40 శాతం

వర్ధమాన దేశాల్లో మాదక ద్రవ్య వినిమయం ఏటికేడు ప్రవర్ధమానమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా గంజాయి వినియోగం అత్యధిక స్థాయిలో సాగుతుండగా, దశాబ్ద కాలంలో మాదక ద్రవ్య సంబంధ మరణాలు 71శాతం పెరగడానికి హెరాయిన్‌ వంటివి కారణమవుతున్నాయి. మాదక ద్రవ్య వ్యసనం పంజాబ్‌ యువజనంలో పద్దెనిమిదేళ్లనాడు కేవలం రెండు శాతం; అదే నేడు 40 శాతానికి చేరింది. మొదట్లో గంజాయికి పరిమితం అయిన యువతరం హెరాయిన్‌ వంటివాటికి, దరిమిలా టాబ్లెట్లు ఇంజక్షన్లు దగ్గు మందులకు మరిగి ఇప్పుడు సింథటిక్‌ డ్రగ్‌ 'చిట్టా' చుట్టూ తూగుతోంది. మహిళలు, పిల్లలు దానికి బానిసలై సామూహిక గొలుసుగా మారి అక్రమ రవాణాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న తీరు పంజాబ్‌ అధికార యంత్రాంగానికి సవాళ్లు రువ్వుతోంది.

నిషా ముక్త్ భారత్​...

విశాఖ జిల్లాలో విస్తరించిన గంజాయి మాఫియా ఏటా రూ.7,200 కోట్ల వ్యాపారం చేస్తోందని వార్తాకథనాలు చాటుతున్నాయి. గంజాయి సేవనం ద్వారా ఒళ్లు గుల్ల అయిన 72 లక్షల మందికి దేశవ్యాప్తంగా వైద్య సేవల అవసరం ఉందని సర్కారీ అధ్యయనమే చెబుతోంది. ఇంజక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకొనే వ్యసనపరుల సంఖ్యాపరంగా యూపీ, పంజాబ్‌, దిల్లీ ఏపీ, తెలంగాణ తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలే కాదు- చాక్లెట్ల రూపేణా మాదక ద్రవ్యాల్ని పాఠశాలల చెంతకూ చేరుస్తున్న మాదక ద్రవ్య ముఠాల ఆగడాలు నానాటికీ పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా 272 జిల్లాలు డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్నాయని గుర్తించిన కేంద్రం మొన్న ఫిబ్రవరిలో రూ.336 కోట్ల జాతీయ కార్యాచరణను ‘నిషా ముక్త్‌ భారత్‌’ పేరిట పట్టాలకెక్కించాలనుకొంది. కొవిడ్‌ కారణంగా ఆ పథకం అటకెక్కినా- మాదక ద్రవ్య మాఫియా కూసాలు కదిలేలా గట్టి చర్యల అవసరం నేడు ఎంతైనా ఉంది. సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాలు నిబద్ధంగా కలసి కృషి చేస్తేనే మాదక మహమ్మారిని మట్టుపెట్టగలిగేది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.