ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న 5జి వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు సమీప భవిష్యత్తులోనే సాకారం కానున్నాయి. ప్రస్తుత 4జి నెట్‌వర్క్‌లకన్నా వంద రెట్లు ఎక్కువ వేగంతో పనిచేసే 5జి నెట్‌వర్క్‌లు సత్వర నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి తోడ్పడతాయి. వినియోగదారులకు చప్పున నాణ్యమైన సేవలు అందజేయడానికి ఉపకరిస్తాయి. దీనివల్ల మన ఆర్థిక జీవనం విప్లవాత్మకంగా రూపాంతరం చెంది ప్రపంచమంతటా 2035కల్లా 2.23కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), కృత్రిమ మేధ (ఏఐ), రియల్ టైమ్ ఎనలిటిక్స్ వంటి అధునాతన టెక్నాలజీలను అత్యంత సమర్థంగా ఉపయోగించుకునే శక్తిని 5జి ఇస్తుంది. కాబట్టి వ్యక్తులకు, కంపెనీలకు, ప్రభుత్వాలకు కొంగొత్త అవకాశాలు అందివస్తాయి. వినియోగదారుడి చర్యకు వెబ్ అప్లికేషన్ స్పందించడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఈ విలంబాన్ని లేటెన్సీ అంటారు.
3.6 సెకన్లలోనే హెచ్‌డీ సినిమా డౌన్‌లోడ్
నెట్‌వర్క్ వేగం తక్కువగా ఉంటే లేటెన్సీ ఎక్కువగా ఉంటుంది. 4జితో పోలిస్తే 5జిలో లేటెన్సీ చాలా చాలా తక్కువ. 4జి ద్వారా ఒక సందేశం పంపడానికి 50 మిల్లీ సెకన్లు పడితే, 5జి ద్వారా కేవలం ఒక్క మిల్లీ సెకను పడుతుంది. అంటే 5జి నెట్‌వర్క్ ద్వారా పంపిన ఒక సందేశం సెకనులో వెయ్యో వంతు సమయంలోనే అవతలి వ్యక్తి లేదా పరికరానికి చేరిపోతుంది. ఫలితంగా కార్యకలాపాలు అమిత వేగంగా జరుగుతాయి. ఒక రెండు గంటల హెచ్‌డీ సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి 3జిలో 26 గంటలు, 4జిలో ఆరు నిమిషాలు పడితే 5జిలో కేవలం 3.6 సెకన్లు పడుతుంది.
బహుళ ప్రయోజనాలు
ఉగ్ర దాడులు, ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు సెల్ టవర్లు కూలి సమాచార సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ఉపగ్రహాల సాయంతో సంభాషించడానికి 5జి ఎంతో అనుకూలంగా ఉంటుంది. నేడు వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వాలు సమాచార ప్రసారానికి వైఫై నెట్‌వర్కుల మీద ఆధారపడటం ఎక్కువవుతోంది. ఆన్‌లైన్ వీడియోలు చూడటం, సంగీతం వినడంలో ప్రస్తుత నెట్‌వర్కులు కిక్కిరిసిపోతున్నాయి. ఒక ప్రాంతంలో ప్రజలు పెద్దయెత్తున ఒకేసారి మొబైల్ ఫోన్లు వాడుతుంటే నెట్‌వర్క్ సేవలు కుప్పకూలుతున్నాయి. 5జి వచ్చాక ఎంతటి గిరాకీనైనా నెట్‌వర్కులు తట్టుకోగలుగుతాయి. పనులు వేగంగా జరుగుతాయి. 4జి కన్నా 90శాతం తక్కువ విద్యుత్ వినియోగంతో 5జి సేవలు అందించవచ్చు. 5జి నెట్‌వర్క్‌లో కిలోమీటరుకు 10 లక్షల నోడ్‌లను ఏర్పరుస్తారు కాబట్టి టెలికాం సేవలు అందరికీ సమ వేగంతో అందుతాయి. 4జి కన్నా వంద రెట్లు ఎక్కువగా, నిరంతరాయంగా టెలికాం సేవలు అందించవచ్చు.
ఆర్థిక వ్యవస్థకూ లబ్ధి
5జి వల్ల 2035కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 13.2 లక్షల కోట్ల అదనపు విలువ సమకూరనుంది. 2026కల్లా భారత్‌లో 5జి ఆధారిత డిజిటలీకరణ వల్ల సమకూరే ఆదాయం 2,700 కోట్ల డాలర్లకన్నా ఎక్కువే ఉంటుందని ఎరిక్సన్ ఇండియా సంస్థ అంచనా. 2025కల్లా భారత్‌లో ఏడు కోట్ల 5జి కనెక్షన్లు ఏర్పడతాయి. అసలు 2022కల్లా ప్రపంచమంతటా 12శాతం మొబైల్ సేవలు 5జి ద్వారానే జరుగుతాయని సిస్కో తెలిపింది. ఇదంతా దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం త్వరలోనే 5జి స్పెక్ట్రమ్ వేలానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేలం విలువ రూ.4.9 లక్షల కోట్లు. విద్యారంగంలో 5జి రిమోట్ బోధనాభ్యాసాలను సులభతరం చేస్తుంది. 2020 నూతన విద్యావిధానం 5జి సేవలకు అగ్రాసనం వేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం తమ ఉపాధ్యాయులతో తక్షణం సంభాషించగలుగుతారు. అచ్చం తరగతి గదిలో ఉన్న అనుభూతిని 5జి ఇస్తుంది కాబట్టి, కొత్త తరహా టెలీ బోధనాభ్యాసాలు అందివస్తాయి. దూరవిద్య కొత్త పుంతలు తొక్కుతుంది. వర్చువల్ రియాలిటీ విస్తరించి ఉపాధ్యాయుడు-విద్యార్థుల మధ్య పటిష్ఠమైన సంబంధం ఏర్పడుతుంది.
ప్రమాదాలకూ అడ్డుకట్ట
మున్ముందు ఆగ్మెంటెడ్ రియాలిటీ సైతం సాకారమవుతుంది. 2025కల్లా వర్చువల్, అనుబంధ వాస్తవికత (ఆగ్మెంటెడ్ రియాలిటీ) మార్కెట్ 2,500 కోట్ల డాలర్లకు చేరి, ఆపైన మరింత విస్తరించనుంది. అతి తక్కువ విద్యుత్ వినియోగంతోనే ఎక్కువ ఫలితాలు సాధించడం 5జి విశిష్టత. ఉదాహరణకు 4జిలో 300 హెచ్‌డీ సినిమాలను డౌన్‌లోడ్ చేయడానికి ఒక కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) విద్యుత్ అవసరమైతే, 5జిలో ఒక్క కేడబ్ల్యూహెచ్ తోనే 5,000 అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్ చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో 95శాతం మానవ పొరపాట్ల వల్లే జరుగుతున్నాయి. వాహనాలను నడిపే పనిని 5జితో పనిచేసే కృత్రిమ మేధకు అప్పగిస్తే ఏటా 12.5 లక్షల రోడ్డు ప్రమాద మరణాలను నివారించవచ్చు. డ్రైవర్ రహిత కార్లలో అమర్చే సెన్సర్ల సాయంతో అవి తమలో తాము సంభాషించుకుంటాయి. ట్రాఫిక్ లైట్లు, రోడ్డు సంకేతాలను చక్కగా పాటిస్తాయి. అలాగే నేలలో అమర్చే సెన్సర్లు భూసారాన్ని అంచనా వేస్తాయి, తెగుళ్లను అరికట్టడానికి తోడ్పడతాయి.
ఆరోగ్య రంగంలోనూ..
ఆరోగ్య రంగంలో రోగుల సమస్యలను కచ్చితంగా అంచనా వేసి సరైన చికిత్స అందించే సౌలభ్యం పెరుగుతుంది. 5జి ఆధారిత రోబోలు, డిజిటల్ పరికరాలు శస్త్ర చికిత్సలు చేసే రోజు వస్తుంది. వైద్యులు దూరం నుంచి టెలీ శస్త్రచికిత్సలు చేయగలుగుతారు. స్మార్ట్ భవనాల్లో ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, నీరు, విద్యుత్ వినియోగం, భద్రతా విధులను 5జి సాయంతో అత్యంత సమర్థంగా నిర్వహించవచ్చు. 5జి ఆధారిత టెలివిజన్ సెట్లు ఈనాటి హెచ్‌డీ, 4కె టీవీలకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పిక్సెల్‌లతో నాణ్యమైన ప్రసారాలు అందిస్తాయి. 5జివల్ల 2021లో ఈ-కామర్స్ రంగ ఆదాయం 1,200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని ఎడోబ్ నివేదిక తెలిపింది. 2021 ద్వితీయార్ధంలో రిలయన్స్ జియో భారత్‌లో 5జి సేవలు ప్రారంభించనుంది. 5జి, ఏఐ, ఐఓటీలు కలిసి మానవ జీవితంలోని ప్రతి పార్శ్వాన్నీ రూపాంతరం చెందిస్తాయి. కొత్త అవకాశాలు అందిస్తాయి. భారత్ వీటిని వేగంగా అందిపుచ్చుకోవాలి.
పర్యావరణ హితకరం
నేడు అంతర్జాలం లేనిదే దైనందిన జీవితం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ కొవిడ్ రోజుల్లో కిరాణా సరకులు కొనడానికి, ఇంటి నుంచి పని చేయడానికి, వైద్య సహాయం పొందడానికి, వార్తలకు, వినోదానికి... అంతర్జాలమే ఆలంబన అయింది. రానున్న రోజుల్లో అంతర్జాల వినియోగం ఎన్నోరెట్లు పెరిగిపోనుంది. ఆ గిరాకీని తీర్చగలిగేది 5జి మాత్రమే. మొబైల్ ఫోన్ల ద్వారా సంభాషణలకు, వేలాది పరికరాల అనుసంధానానికి 5జి సేవలు అనివార్యం కానున్నాయి. ఈ సేవలు పర్యావరణ హితకరమైనవి. వీటివల్ల ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) విస్తరించి, కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. జల, వాయుకాలుష్యాలు తగ్గుతాయి. 5జితో పనిచేసే ఐఓటీ 2030కల్లా కర్బన ఉద్గారాలను 15శాతం తగ్గిస్తుందని ఎరిక్సన్ లెక్కకట్టింది. ఈ సాంకేతికతవల్ల తక్కువ విద్యుత్తుతో ఎక్కువ పనులు జరుగుతాయి. 5జి సాయంతో స్మార్ట్ నగరాలు లక్షలాది ఐఓటీ పరికరాల నుంచి వచ్చే సమాచారాన్ని సమర్థంగా నిభాయించగలవు. రవాణా రద్దీని, వాయు కాలుష్యాన్ని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 16,000 కోట్ల డాలర్లు ఆదా అవుతాయి.
- డాక్టర్ కే. బాలాజి రెడ్డి, రచయిత - సాంకేతిక విద్యారంగ నిపుణులు
ఇదీ చదవండి: వావ్..వాహనాలకు మంచి కిక్కిచ్చే 'ఇంధనం'