అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం(Taliban Government)- భారత అంతర్గత భద్రతపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదముంది. తాలిబన్ల పూర్వ పాలనా కాలంలో (1996-2001) జమ్ముకశ్మీర్‌లో(Kashmir Taliban) చోటుచేసుకొన్న ఉగ్రవాద ఘటనలను పరిశీలిస్తే ఇది వాస్తవమేనని అనిపిస్తుంది. తాము మారిపోయామని ఆ ముష్కర మూక ప్రతినిధులు ఎంతగా నమ్మబలుకుతున్నా- వారు కొలువుతీర్చిన మంత్రులను గమనిస్తే అదంతా ఓ బూటకమేనని అర్థమవుతుంది. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భద్రతాపరంగా ఇండియా(Kashmir Taliban) కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
సోవియట్ సేనలు 1989లో అఫ్గాన్‌ను వీడాక- పాకిస్థాన్ ఉగ్రవాద తండాలను భారత్ వైపు మళ్ళించింది. 1987 కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో అవకతవకలపై అసంతృప్తితో రగిలిపోతున్నవారిని చేరదీసి హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రసంస్థలకు ఐఎస్‌ఐ పురుడు పోసింది. ఆ క్రమంలోనే 'కాబుల్ కసాయి'గా పేరుపడిన గుల్బుద్దీన్ హెక్మత్యార్ వర్గమైన 'హెజబ్-ఈ-ఇస్లామి' ఉగ్రవాదులు అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించారు. 1993 నాటికి వీరి సంఖ్య కశ్మీర్‌లో 400కి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. 1989-2000 మధ్య కశ్మీర్‌లో 55వేలకు పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఆ సమయంలో భారత దళాలు మట్టుబెట్టిన దాదాపు 16వేల మంది ఉగ్రవాదుల్లో అయిదో వంతు మంది విదేశీయులే. లక్షన్నర బాంబులు, 40వేల తుపాకులు, 60లక్షల తూటాలను అప్పట్లో భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయంటే కశ్మీర్‌లో పరిస్థితి ఎంతగా కట్టుతప్పిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్లపై 2001లో అమెరికా దాడులు మొదలుపెట్టాక మెల్లగా ఇక్కడ ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. ఆ తరవాత వాజ్‌పేయీ జమానాలో కశ్మీరీలకు దగ్గరయ్యేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు కొంత సఫలమయ్యాయి. నాటికీ నేటికీ పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా, ఉగ్రవాద సమస్య మాత్రం అలాగే ఉంది.
మాట మార్చారు...
కశ్మీర్‌పై(Kashmir Taliban) తమకు ఎలాంటి ఆసక్తి లేదని తాలిబన్లు ఏడాదిగా చెబుతున్నారు. కానీ, తమకు అధికారం ఖాయమయ్యాక ఇటీవల వారి స్వరం మారింది. కశ్మీరీ ముస్లిముల గురించి మాట్లాడే హక్కు తమకుందని తాలిబన్ల ప్రతినిధి సొహైల్ షహీన్ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. అనంతరం వెలువడిన అల్‌ఖైదా నేత అల్‌జవహరీ ప్రకటనలోనూ కశ్మీర్ ప్రస్తావన వచ్చింది. భారత్‌పై విషం కక్కడంలో ముందుండే హక్కానీ నెట్‌వర్క్‌కు అదే సమయంలో ఐఎస్‌ఐ ఆశీస్సులతో తాలిబన్ల మంత్రివర్గంలో కీలక శాఖలు దక్కాయి. సిరాజుద్దీన్ హక్కానీకి అంతర్గత వ్యవహారాల శాఖ, ఖలీల్ హక్కానీకి శరణార్థుల వ్యవహారాల శాఖను కట్టబెట్టారు. అల్‌ఖైదాతో పాటు పాక్‌లోని ఉగ్ర సంస్థలను అఫ్గాన్ గడ్డపైకి రప్పించడానికి ఈ రెండు శాఖలే చాలు! అమెరికన్ సైన్యాలు వదిలేసి వెళ్ళిన అధునాతన ఆయుధ సంపత్తి, రాత్రి వేళల్లో చూడగలిగే పరికరాలను కశ్మీర్‌లో(Kashmir Taliban) ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి వినియోగపడతాయన్న భయసందేహాలు నెలకొన్నాయి. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' పేరిట కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో లష్కరేకు పాకిస్థాన్ ఇప్పటికే కొత్త రూపునిచ్చింది. మరోవైపు మెహబూబా ముఫ్తీ వంటి స్థానిక నేతలు సైతం తాలిబన్ బూచిని చూపిస్తూ వివాదస్పద ప్రకటనలు చేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా- కశ్మీర్‌లో ప్రస్తుతం 1989 నాటి వాతావరణం లేదు. రాళ్లు రువ్వే ఘటనలు 2019లో 1900కు పైగా నమోదయ్యాయి. నిరుడు అవి 255కు తగ్గిపోయాయి.
భావజాల వ్యాప్తిని అడ్డుకోవడంపైనా..
నియంత్రణ రేఖ వెంట నిఘా పెరగడంతో చొరబాట్లు కష్టసాధ్యమవుతున్నాయి. దాంతో నిస్పృహకు లోనైన ఐఎస్‌ఐ డ్రోన్లతో ఆయుధాల చేరవేత ప్రారంభించింది. దాన్ని ఎదుర్కోవడానికి సరిహద్దులకు సమీపంలో ఇండియా డ్రోన్ నిరోధ వ్యవస్థలను మోహరిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఉగ్రవాద భావజాల వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవడంపైనా ఇండియా దృష్టి సారించాలి. సామాజిక మాధ్యమాలను ఉగ్రవాద వ్యాప్తికి వినియోగించుకోవడంలో ఐఎస్‌ఐ రాటుతేలిపోయింది. గతంలో ఐసిస్, ఇటీవల తాలిబన్ తండాలు సైతం సామాజిక మాధ్యమాల సాయంతోనే తమ పడగనీడలను విస్తరించాయి. భారత్‌లోనూ ముష్కర మూకలు ఇదే వ్యూహాన్ని అమలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సామాజిక మాధ్యమాలపై పటిష్ఠ నిఘా తప్పనిసరి! వీలైనంత త్వరగా కశ్మీర్‌లో శాసనసభను పునరుద్ధరిస్తే రాజకీయ అసంతృప్తులూ కొద్దిమేరకు తగ్గవచ్చు. అదే సమయంలో అఫ్గానిస్థాన్ ఉగ్రవాదుల పుట్ట కాకుండా చూసేందుకు రష్యాతో కలిసి పనిచేయాలి. ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి నికొలయ్ పత్రుషేవ్ ఇటీవల భారత్‌లో పర్యటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలూ పరస్పర సహకారంతో ముందడుగేస్తేనే ధూర్త దేశాల ఉగ్రవాద ఎగుమతిని నిరోధించడానికి వీలవుతుంది. దేశీయంగా అనుమానాస్పదులపై కన్నేసి ఉంచేందుకు, దాదాపు వెయ్యి సంస్థలను అనుసంధానిస్తూ తలపెట్టిన 'నాట్‌గ్రిడ్'ను వీలైనంత వేగంగా, పటిష్ఠంగా పట్టాలెక్కించాలి!
- పి.కిరణ్
ఇవీ చూడండి: