ETV Bharat / opinion

మీ ఖాతాలో.. పుణ్యం జమ!

'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఇల్లూ వాకిలి లేనివాడు, బిచ్చమెత్తుకుని తిరిగేవాడు నీ వాడా' అని అడిగితే, 'బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి’ అంటూ జనానికి అర్థమయ్యేటట్టు జానపదంలో చెప్పారు ఓ సినీకవి! అపర శివభక్తుడు రావణబ్రహ్మ సైతం, 'భవతీ భిక్షాందేహి' అని అర్థిస్తేనే.. సీతమ్మ లక్ష్మణరేఖను దాటింది!. ఏంటీ భిక్షాటనపై సుదీర్ఘ లెక్చర్ అనుకుంటున్నారా? యాచకుల నిషేధంపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కథనం చదివేయండి మరి..

author img

By

Published : Aug 5, 2021, 6:12 AM IST

మీ ఖాతాలో.. పుణ్యం జమ!
మీ ఖాతాలో.. పుణ్యం జమ!

'ధర్మం చెయ్‌ బాబూ, కాణీ ధర్మం చెయ్‌ బాబూ..'

'ఏంటబ్బాయ్‌! పొద్దున్నే పాట పాడుకుంటూ వచ్చావు?'

'యాచకుల గురించి మన సుప్రీంకోర్టు- వాళ్లను మేమేమీ అనం. వాళ్లకూ టీకాలు ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్పింది కదా. దానికి అర్థం ఏమిటి బాబాయ్‌?'

'అర్థం కాకపోవడానికి అదేమైనా అణు సిద్ధాంతమా? తరచి చూడాలిగానీ, ఆ వృత్తి ఆనవాళ్లు కోకొల్లలు మన మూలాల్లో'

'మొదలుపెట్టావా నీ తిరకాసు మాటల్ని!'

'ఓరి నీ అజ్ఞానాన్ని అడుక్కుతినేవాడు ఎత్తుకెళ్లా! ఆయవారమని ఎంత అందమైన పేరుంది ఆ వృత్తికి! అంతెందుకు- గురుశిష్య పరంపరలో ఉదయాన్నే విద్యగరపి, అపరాహ్నానికి భిక్షాటన ద్వారా లభించే ఆహారంతో జీవనం గడిపేవారురా. పోనుపోను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు, అనేక అవకరాలు అంటుకట్టడంతో, ఆ వృత్తి మీద జనానికి గౌరవం, భక్తి స్థానే అసహ్యం, అనాదరణ పెరిగిపోయాయి'

'నిజమే బాబాయ్‌'

'తిరిపెమున కిద్దరాండ్రా, గంగ విడుము పార్వతి చాలున్‌' అని శ్రీనాథుడు ఆక్రోశించినా; 'ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది' అని కవి విరచించినా- అర్థించడంలో ఆ ఆదిశంకరుడే మన లోకానికి మూలం! 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఇల్లూ వాకిలి లేనివాడు, బిచ్చమెత్తుకుని తిరిగేవాడు నీ వాడా' అని అడిగితే, 'బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి’ అంటూ జనానికి అర్థమయ్యేటట్టు జానపదంలో చెప్పారు ఓ సినీకవి! అపర శివభక్తుడు రావణబ్రహ్మ సైతం, 'భవతీ భిక్షాందేహి' అని అర్థిస్తేనే కదా.. సీతమ్మ లక్ష్మణరేఖను దాటింది! పాండవులంతటి వాళ్లే తమ ఉనికి తెలియకుండా ఏకచక్రపురంలో భిక్షాటన చేశారు. కాబట్టి అబ్బాయ్‌, అర్థించడాన్ని అంతలా తీసిపారేయకు'

'ఊరుకో బాబాయ్‌! నా చెవిలో పువ్వేమైనా కనబడుతోందా? యాచనకు అంత అందం అవసరమా?'

'అవసరమేరా అబ్బాయ్‌! అచ్చిరాని కాలంలో అడుక్కుతినబోతే ఉన్న బొచ్చె కాస్తా ఊడ్చుకుపోయిందన్నట్టు, అర్థించడానికి సైతం సమయం, సందర్భం, కాలమాన పరిస్థితులన్నీ కలిసిరావాలి. దుర్యోధనుడినే చూడు- శ్రీకృష్ణుడిని అర్థించడానికని వెళ్ళి, దర్జాగా ఆయనగారి తలదగ్గర కూర్చుంటే ఏమైంది? మొదటి అవకాశం కాళ్లదగ్గర కూర్చున్న అర్జునుడికి దక్కింది. తవుడు తింటూ వయ్యారమా అన్నట్టు, అర్థించడానికి వెళ్ళినప్పుడు భేషజానికి పోకూడదు. ఈ విషయంలో మన నాయకులను చూడు, ఎంతలా పండిపోయారో అర్థమవుతుంది'

'అటూ ఇటూ తిప్పి మళ్ళీ రాజకీయాల దగ్గరకే వచ్చావు కదా బాబాయ్‌'

'ఎంత మాట అన్నావురా! మన జీవనమూ, జీవికా- సమస్తమూ రాజకీయాలతోనే ముడివడి ఉన్నప్పుడు, ఆ సంగతి ప్రస్తావించకుండా ఎలారా?!'

'అవునులే బాబాయ్‌. ఎన్నికలప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఓట్లు అర్థించడంలో ఒకరిని మించి మరొకరు పోటీపడతారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, కొండొకచో అర్థించడం స్థానే సొమ్ము వెచ్చించి ఆర్జించడం ఎక్కువవుతోంది'

'అదీ లెక్క. ఇప్పుడు నువ్వూ లైన్లోకి వచ్చావు. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలో యువ నేతలు, అంతలా చచ్చీచెడీ సంపాదించిన అధికారాన్ని అనుభవించలేక, అధిష్ఠానానికి సరిగ్గా వివరించుకోలేక, అర్జునుడిలా అతలాకుతలం అవుతున్నారు'

'స్వయంవరంలో ద్రౌపదిని గెలిచి, ఇంటికి తీసుకొచ్చిన అర్జునుడు- అమ్మా భిక్ష తెచ్చానని అంటే, అన్నదమ్ములందరూ కలిసి పంచుకోండి అందట ఆ తల్లి. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా గిలగిలలాడిపోయాడు అర్జునుడు! చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి, ఎన్నికల్లో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన యువ నేతల పరిస్థితి అలానే అయింది. వీళ్లు అర్థించి, ఆర్జించి తెచ్చిన అధికారం, వృద్ధనేతలు ఎగరేసుకుపోతుంటే- కుడితిలో పడ్డ ఎలుకల్లా గిలగిలలాడుతున్నారు. దీన్ని తట్టుకోలేక, ఆ పార్టీలో ఉన్నవాళ్లు ఉంటున్నారు, పోయేవాళ్లు పోతున్నారు'

'అంతేలే బాబాయ్‌. స్థాయీభేదం, స్థలభేదం తప్పించి, రాజకీయ నాయకులకు, భక్తులకు, భిక్షువులకు పెద్దగా తేడాలు లేవు'

'హారి పిడుగా! తత్వం బాగానే తలకెక్కించుకున్నావురా. అంచేత నువ్విచ్చే పదో పరకో దానంతోనే గొప్పవాడివో, పుణ్యాత్ముడివో అయిపోవు. ఆ అవకాశం నీకిచ్చినవాడే నికార్సయిన మహానుభావుడు! ముక్తి, మోక్షమార్గాలు ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడవంటారు. అలాంటిది, సులభంగా సూక్ష్మంగా నీకు పుణ్యం లభించి, మోక్షం పొందే మార్గం చూపించడానికి నీకోసం ఆ దేవదేవుడే పంపించిన దూతలు, మార్గదర్శకులురా వాళ్లు! అంచేత వాళ్లను సుప్రీంకోర్టే కాదు, మనమూ ఏమనకూడదు'.

'చాలు బాబాయ్‌ చాలు. కళ్లు తెరిపించావ్‌... ఇక నే వెళ్ళొస్తా!'

- ఆంజనేయులు

ఇదీ చదవండి: 'కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.