ETV Bharat / opinion

గుండెల్ని పిండేస్తున్న 'ప్రాణవాయువు'​ కొరత - beds scarcity

ఆక్సిజన్‌ అందుబాటులో లేక దేశంలో రోజుకు పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. రోగుల సంఖ్య పెరిగి పలు ఆసుపత్రుల్లో పడకల కొరతా ఏర్పడింది. 83 శాతం క్రియాశీల కేసులున్న 12 రాష్ట్రాల్లో గత ఆరు రోజుల్లోనే గిరాకీ 18 శాతం పెరిగింది. అయితే కేంద్రం.. యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలూ సత్వర సాంత్వన కలిగించక పోవడానికి సరఫరా అంశాలు ముఖ్య కారణంగా ఉన్నాయి.

కరోనా
ఆక్సిజన్
author img

By

Published : Apr 27, 2021, 8:06 AM IST

క్సిజన్‌ అంటే వాయువు కాదు, మనిషికి ఆయువు. దేశవ్యాప్తంగా లక్షలాది రోగులకు తక్షణావసరంగా మారిన ఆక్సిజన్‌ అందుబాటులో లేక పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు మృత్యువాత పడుతున్న దయనీయావస్థ గుండెల్ని పిండేస్తోందిప్పుడు! నిరుడు తొలి దఫా దాడికి భిన్నంగా కొవిడ్‌ శ్వాసకోశాలకే మృత్యుపాశాలు విసురుతుండటం, కరోనా పరీక్ష ఫలితాల్లో జాప్యం కారణంగా అప్పటికే బాధితుల పరిస్థితి విషమిస్తుండటం వల్ల- ప్రాణాపాయం నుంచి వారిని తప్పించడానికి ఆక్సిజనే సంజీవని. గత వారంలో 22.5 లక్షల కేసులతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇండియాలో రోగుల తాకిడి పెరిగి, ఆక్సిజన్‌ నిల్వలు తరిగి- ప్రాణవాయువు భిక్ష కోసం ఆసుపత్రుల వేడుకోళ్లు పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్​లలో​ ఆక్సిజన్‌ కొరత రోగుల ప్రాణాలు బలిగొనడమే కాదు, పలు ఆసుపత్రుల్లో పడకల సంఖ్యనూ కుదించేసింది. నిరుడు ఏప్రిల్‌ నుంచి పది నెలల కాలంలో 9300 మెట్రిక్‌ టన్నులకు పైగా ఆక్సిజన్‌ను ఎగుమతి చేసిన దేశం- నేడు ప్రాణవాయువు కోసం పరితపించాల్సి వస్తోంది. 83 శాతం క్రియాశీల కేసులున్న 12 రాష్ట్రాల్లో గత ఆరు రోజుల్లోనే గిరాకీ 18 శాతం పెరిగిందంటున్న కేంద్రం- యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలూ సత్వర సాంత్వన కలిగించక పోవడానికి సరఫరా అంశాలు ముఖ్య కారణంగా ఉన్నాయి. విపత్తు నిభాయక చట్టం కింద ఆక్సిజన్‌ సరఫరాను నియంత్రిస్తున్న కేంద్రం- 20 రాష్ట్రాలకు రోజుకు 6,785 మెట్రిక్‌ టన్నుల్ని కేటాయించింది. తమ చెంత ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను వేరే రాష్ట్రాలకు కేటాయించ వద్దంటూ తమిళనాడు లాంటివి కోరుతున్న నేపథ్యంలో 50 వేల మెట్రిక్‌ టన్నుల దిగుమతికి సిద్ధమైన కేంద్రం- తనవంతుగా 551 ఆక్సిజన్‌ ఉత్పాదక కేంద్రాల ఏర్పాటుకు సమ్మతించింది. అమెరికా, ఈయూ, రష్యా వంటివి ఆపత్కాలంలో ఆదుకోవడానికి ముందుకొస్తున్నా- దేశీయంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరాల మెరుగుదలే లక్ష్యంగా అడుగులు కదపాలి!

ఆక్సిజన్
ఆక్సిజన్ సిలిండర్లు
అత్యవసర మందుల జాబితాలో ఆక్సిజన్‌ను ఇటీవలే చేర్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ- ముంచుకొస్తున్న సంక్షోభంపై మార్చి తొలివారంలోనే హెచ్చరించింది. ప్రాణవాయువు ఉత్పత్తి పెంచి, భారీగా నిల్వ చేయాలంటూ అంతకు అయిదు నెలల క్రితమే దేశీయంగా పార్లమెంటరీ స్థాయీ సంఘమూ సూచించింది. ఆక్సిజన్‌ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, సిలిండర్ల ధరలపై పరిమితి, ఆసుపత్రుల్లో కచ్చితంగా వాటి అందుబాటు- నాటి స్థాయీసంఘం నివేదికలో కీలకాంశాలు! దరిమిలా కేంద్రం 162 ఆక్సిజన్‌ తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రకటించినా అందులో అయిదో వంతే నిర్మితమయ్యాయని అంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన కదిలితే ఒక్క వారం వ్యవధిలోనే ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయగల వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు రెండు టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే 14 ప్లాంట్లను బృహన్‌ ముంబయిలో స్థానిక సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. మూతపడిన స్టెరిలైట్‌ కర్మాగారం నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తికి తమిళనాడు సిద్ధపడినట్లుగానే, విశాఖ ఉక్కు కర్మాగారంలో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల పునరుద్ధరణకూ త్వరితంగా చర్యలు చేపట్టాలి. ఇంటిపట్టున రోగులకూ ఆక్సిజన్‌ అందేలా మద్రాస్‌ ఐఐటీ ఆవిష్కరించిన డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ (డీఐవై) వంటి పరిశోధనలూ జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవాలి. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ను తరలించే క్రయోజనిక్‌ కంటైనర్లను పలు వాణిజ్య దిగ్గజాలు దిగుమతి చేసుకుంటున్నాయి. దేశ రాజధానికి ఆక్సిజన్‌ సరఫరా కావాలంటే వెయ్యి కిలోమీటర్ల రవాణా సాగాల్సిన దేశంలో, గ్రామాలకు ప్రాణవాయువును చేర్చడం మరింత సంక్లిష్టం కానుంది. ఆ దుస్థితిని నివారించాలంటే- ఆసుపత్రులపై భారం తగ్గేలా, కొవిడ్‌ రక్షణ చర్యల్ని ప్రతి ఒక్కరూ నిష్ఠగా పాటించడం తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.