ETV Bharat / opinion

రాజకీయ కేంద్ర దర్యాప్తు సంస్థ.. రాజ్యాంగ నైతికత ఏది? - కేదస

'నారదా స్టింగ్' కేసులో భాగంగా.. బంగాల్​లో ఇద్దరు మంత్రులతో పాటు, మరో ఇరువురు ఎమ్మెల్యేల్నీ నిర్బంధించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(కేదస). అయితే.. అదే కేసులో నిందితులైన ఎంపీ ముకుల్‌ రాయ్‌ని, అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారిని పక్కన పెట్టేసింది. నాటి స్టింగ్‌ ఆపరేషన్‌ అంతా నాటకం, బూటకం అని మమతా బెనర్జీ విమర్శిస్తున్నా- నేరాభియోగాలకు రుజువులుగా ఉన్న టేపులు నికార్సు అయినవేనని చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ధ్రువీకరించింది.

central investigation agency
కేంద్ర దర్యాప్తు సంస్థ
author img

By

Published : May 23, 2021, 8:08 AM IST

యుద్ధ సమయంలోనే కాదు, సాధారణ పరిస్థితుల్లోనూ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగేటంత పటిష్ఠమైనది భారత రాజ్యాంగమని భారతరత్న అంబేడ్కర్‌ ఏనాడో తీర్మానించారు. రాష్ట్రాల్లో పాలన రాజ్యాంగబద్ధంగా సాగేలా చూడాల్సిన బాధ్యతనూ 355 అధికరణ ద్వారా కేంద్రానికే కట్టబెట్టారు. ఆ పెద్దరికానికే రాజకీయ వేరుపురుగు పడుతుందని, పార్టీగత వైషమ్యాలతో సమాఖ్య స్ఫూర్తే అడుగంటి పోతుందని రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు కలలోనయినా ఊహించి ఉండరు. మోదీ-అమిత్‌షాలను వేధించేందుకు యూపీఏ ప్రభుత్వం కేదస(సీబీఐ)ను ఉసిగొల్పుతోందని 2014 ఎన్నికల ముందు అరుణ్‌జైట్లీ విరుచుకుపడ్డారు. గత ఏడేళ్లుగా తస్మదీయ సర్కార్లపై కేదస ఒంటికాలి మీద పోతున్న తీరు, తాజాగా పశ్చిమ్‌ బంగ లాంటి చోట్ల కసి పోక మసిపూసుకొన్న చందంగా దుర్రాజకీయాల జోరు దిగ్భ్రాంత పరుస్తున్నాయి. అత్యంత సున్నితమైన కేంద్ర రాష్ట్ర సంబంధాల పైనా తీవ్ర దుష్ప్రభావం ప్రసరిస్తున్న సంకుచిత రాజకీయ వైరస్‌ పూర్వాపరాల్ని చిత్తగించండి!

నేతిబీరలో నెయ్యి ఎంతో సమకాలీన నేతాగణాల్లో నీతీ అంతేనన్నది అందరికీ తెలిసిన రహస్యం. అయినా ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా చక్రం తిప్పే పెద్ద నాయకుల అవినీతి చీకటి కోణాల్ని బయటపెట్టడానికి కొన్ని మీడియా సంస్థలు చేసిన, చేస్తున్న శూలశోధనలు (స్టింగ్‌ ఆపరేషన్లు) సంచలనాత్మకం అవుతున్నాయన్నది వాస్తవం. ఇలాంటి శూలశోధనల్లో పేరెన్నికగన్న తెహెల్కాలో మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేసిన మాథ్యూ శామ్యూల్‌ తన సహోద్యోగి ఏంజెల్‌ అబ్రహాంతో కలిసి 2014లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దిగ్గజ నేతలపై రెండేళ్ల పాటు రహస్య ఆపరేషన్‌ సాగించారు. తాను ఇంపెక్స్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అధిపతినంటూ సంస్థకు లబ్ధి చేకూర్చేలా సహకరిస్తే ముడుపులిస్తామన్న శామ్యూల్‌ బేరానికి ఏడుగురు ఎంపీలు, నలుగురు రాష్ట్ర మంత్రులూ తలూపి అడ్డంగా దొరికిపోయారు. 52 గంటల చిత్రమాలికలో వారంతా ఫెళఫెళలాడే నోట్లకట్టల్ని అందుకుంటున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.

తెహెల్కా నుంచి బయటికొచ్చి 'నారదా న్యూస్‌' ప్రారంభించిన శామ్యూల్‌ 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లంచాల మేత బాగోతాన్ని బట్టబయలు చేసినప్పుడే గగ్గోలు పుట్టింది. 2011 కంటే బంపర్‌ మెజారిటీతో మమత మళ్ళీ అధికారానికి వచ్చిన దరిమిలా- 2017 మధ్యలో కలకత్తా హైకోర్టు నారదా కేసులో ప్రాథమిక విచారణ జరపాలని కేదసను ఆదేశించింది. 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తిచేసి అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆపై దర్యాప్తు సాగించమనీ సూచించింది. అప్పుడు మొదలైన విచారణ ఇప్పటికి అరెస్టుల దాకా వచ్చిందని సంతోషించాలా, ఈ మధ్యకాలంలో కొందరు నిందితుల పార్టీ మార్పిళ్లు కేదస కళ్లకు రాజకీయ గంతలు కట్టినందుకు దుఃఖించాలా- ఇదీ సగటు బెంగాలీల సంకట స్థితి!

స్టింగ్‌ ఆపరేషన్‌..

నాటి స్టింగ్‌ ఆపరేషన్‌ అంతా నాటకం, బూటకం అని మమతా బెనర్జీ విమర్శిస్తున్నా- నేరాభియోగాలకు రుజువులుగా ఉన్న టేపులు నికార్సు అయినవేనని చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ధ్రువీకరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కీలక నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా కేదస అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని హైకోర్టు భావించింది. ఆ నమ్మకాన్ని కేదస నిలబెట్టుకోగలిగిందా? రెండు వారాల క్రితం మమత కొత్తగా కొలువు తీర్చిన క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులతో పాటు, మరో ఇరువురు ఎమ్మెల్యేల్నీ నిర్బంధించిన కేదస- అదే కేసులో నిందితులైన ఎంపీ ముకుల్‌ రాయ్‌ని, అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారిని పక్కన పెట్టేసింది.

చట్టసభల సభ్యుల్ని నిర్బంధించాలంటే సభాపతి లేదా గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం ఉన్నప్పుడు సభాపతి నుంచి అనుమతి పొందడం దుర్లభంగా భావించి, గతంలో కోర్టు తీర్పును అనుసరించి గవర్నర్‌ ద్వారా ముందస్తు పర్మిషన్‌ పొందిన కేదస- సువేందుకు సంబంధించిన అంశం పెండింగ్‌లో ఉందంటోంది. అదే ముకుల్‌ రాయ్‌కి సంబంధించి లోక్‌సభాపతి అనుమతే ఇంకా కోరలేదన్న వార్తాకథనాలు- కేదస దర్యాప్తులో పక్షపాత కోణాల్ని కళ్లకు కడుతున్నాయి. సమన్యాయం, సమధర్మం అని రాజ్యాంగం చెప్పినా, చట్టం ముందు అందరూ సమానమేనని కోర్టులే ఘోషించినా- కేంద్రంలోని పాలక పక్షీయుల పెంపుడు జాగిలంగా దిగజారిన కేదస బుద్ధి మారేది కాదు. పార్టీలన్నీ నేరగాళ్లతో లుకలుకలాడుతున్న వేళ- విపక్ష రాజకీయాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కేదసను అడ్డంపెట్టుకుని నెరపే కపట నాటక విన్యాసాలు, సమాఖ్య స్ఫూర్తికే చేటు!

కేదస దుందుడుకుతనం..

అధికారం కోసం రాజకీయాలను ఆదర్శాల కోసం, అవకాశవాద రాజకీయాల్ని సైద్ధాంతిక కట్టుబాటు కోసం, మోసపూరిత రాజకీయాలను శీలవర్తనం గల రాజకీయాలుగా మార్చాలన్నదే తమ ప్రయత్నమని నాలుగు దశాబ్దాల క్రితం కమలం పార్టీ పుట్టిన వేళ వాజ్‌పేయీ ఉద్ఘాటించారు. ఆ ఉపదేశాల స్ఫూర్తికి పట్టం కట్టగలిగే చేవ ఉండీ కాంగ్రెస్‌ వేసిన చెడుదారిలోనే ఎందుకు సాగుతున్నారన్న ప్రజాస్వామ్య హితైషుల ప్రశ్నకు సమాధానం లేదు! 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ముందూ కేదస ఇలాగే దుందుడుకుతనం ప్రదర్శించింది.

శారద, రోజ్‌వ్యాలీ కుంభకోణాల దర్యాప్తును నీరుగార్చారంటూ కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నిర్బంధానికి కేదస కదలడం, మమత సర్కారు ఆయనకు రక్షణగా నిలవడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 2015 డిసెంబరులో దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపై కేదస దాడిచేయడమూ సంచలనం సృష్టించింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో అత్యంత కీలకమైనది 'రాజ్యాంగ నైతికత' అని ప్రకటించిన సుప్రీంకోర్టు- 'రాజ్యాంగ హేతుబద్ధత' మరో దారిదీపమని లోగడే మార్గనిర్దేశం చేసింది.

నేడు ఆ నైతికత దేవతావస్త్రమై పోగా, రాజకీయ సుడిగాలిలో హేతుబద్ధతా దీపం కొండెక్కిపోయింది. రాజ్యాంగానికి కట్టుబడతామన్న పదవీ ప్రమాణాన్ని తరతమ భేదాలతో అన్ని పక్షాలూ తుంగలో తొక్కుతున్నాయి. రాజ్యాంగానికి రాజకీయ గ్రహణం పట్టించి ప్రజాస్వామ్య విలువల్నే అపహసిస్తున్నాయి. కాదంటారా?

- పర్వతం మూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.