కరోనా మహమ్మారికి పురిటిగడ్డగా భ్రష్టుపట్టిన చైనాకు విదేశీ పెట్టుబడుల విషయంలో కొన్నాళ్లుగా గట్టి ఎదురుగాలి వీస్తోంది. అక్కడినుంచి ఉత్పాదక విభాగాలను వేరేచోటుకు తరలించే సంస్థలకు చేయూతగా జపాన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కొన్ని కొరియన్ సంస్థలు భారత్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు ఆరు నెలలక్రితమే కథనాలు వెలుగుచూశాయి. గత సంవత్సరం అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను ఆకర్షించిన తొలి పది దేశాల్లో ఇండియా ఒకటని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించడం తెలిసిందే. ఆ జాబితాలో అమెరికా, చైనా, సింగపూర్, బ్రెజిల్, యూకే, హాంకాంగ్, ఫ్రాన్స్‌ల తరవాత భారత్‌కు దక్కింది ఎనిమిదో స్థానమే. ఆ రికార్డును తిరగరాయడమే అప్రకటిత లక్ష్యంగా నేడు ఇరవై అంతర్జాతీయ భూరి పెట్టుబడి సంస్థలతో ప్రధాని మోదీ సమావేశానికి విశేష ప్రాధాన్యముంది!
ఎఫ్‌డీఐలను రాబట్టేందుకు..
కొవిడ్ ధాటికి దేశార్థికం కకావికలమైన తరుణంలో మౌలికరంగ ప్రాజెక్టులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాల్లోకి అధమపక్షం రూ.50-60 లక్షలకోట్ల మేర పెట్టుబడులు ప్రవహిస్తేనే పరిస్థితి తిరిగి గాడిన పడుతుందని తమవంతుగా గడ్కరీ ప్రభృత కేంద్రమంత్రులు ప్రభుత్వ లక్ష్యాలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తున్నారు. చైనానుంచి తరలివెళ్ళిన సంస్థల్లో ఎక్కువభాగం వియత్నాం, తైవాన్, థాయ్‌లాండ్ తదితరాలకు మళ్ళగా- భారత్ బాట పట్టినవి తక్కువేనని ఆ మధ్య నొమురా అధ్యయనం నిగ్గు తేల్చింది. ఆ లెక్కన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకట్టుకోవడంలో ఇండియా పోటీపడాల్సిన దేశాల జాబితా చిన్నదేమీ కాదు. ఎఫ్‌డీఐల్ని రాబట్టడంలో కొన్ని మెట్లు పైకి ఎక్కాలన్న సంకల్పదీక్షతో సదస్సులు నిర్వహించి విజ్ఞప్తులు చేసినా తదుపరి కార్యాచరణే నికర లబ్ధిని నిర్దేశిస్తుందని గతానుభవాలు ఎలుగెత్తుతున్నాయి. చైనా నష్టం భారత్‌కు ఎంతమేర కలిసి వస్తుందన్నదానిపై మూడీస్ సంస్థ నివేదికాంశాలు- భావి పథప్రస్థానం ఏ తీరుగా మెరుగుపడాలో ఇప్పటికే కర్తవ్యబోధ చేస్తున్నాయి. తదనుగుణంగా ప్రభుత్వ వ్యూహాలు పదును తేలాలి.
భారత్ ఎక్కడుందంటే?
అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిరుడు 13శాతం వృద్ధితో భారత్ దాదాపు 50 బిలియన్ డాలర్ల(సుమారు మూడు లక్షల 73వేలకోట్ల రూపాయల) ఎఫ్‌డీఐలను పొందగలిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఆ మొత్తం అమెరికా రాబట్టిన వాటిలో అయిదో వంతుకన్నా తక్కువ. ఈ స్థితినుంచి 50-60 లక్షలకోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించగల దశకు చేరడమన్నది, అక్షరాలా బృహత్తర లక్ష్యం! సులభతర వాణిజ్య నిర్వహణకు సాయపడటంలో- 193 దేశాల్లో భారత్ 63వ స్థానాన నిలిచింది. ఆ ర్యాంకు గణనీయంగా మెరుగుపడాలన్నా, ఎఫ్‌డీఐల ఇతోధిక ప్రవాహం సాకారం కావాలన్నా- సత్వర అనుమతుల జారీకి, పారదర్శక నిబంధనావళికి ప్రభుత్వం మరింత కట్టుబాటు చాటాలి. న్యూజిలాండ్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్ గంటల వ్యవధిలోనే ముగుస్తుండగా, ఇక్కడ సగటున 154 రోజులపాటు నిరీక్షించాల్సి రావడమేమిటి? నిర్మాణ అనుమతుల కోసం దాదాపు మూడునెలల పాటు ఎదురుతెన్నులు తప్పడంలేదు.
వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టడానికి 136 రోజులు, కాంట్రాక్టులు అమలుకు నోచుకోవడానికి 163 రోజులు పడుతుండటం- ఎక్కడ ఏమేమి దిద్దుబాటు చర్యలు అత్యావశ్యకమో చెప్పకనే చెబుతున్నాయి. ఈ మందకొడితనానికి- ఫోర్బ్స్ నివేదిక తప్పుపట్టిన అవినీతి ప్రజ్వలనం, విద్యుత్ కడగండ్లు, రవాణా అవస్థలు జతపడి పెట్టుబడిదారుల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భూ, కార్మిక, పన్ను వ్యవస్థల్ని ప్రక్షాళించి, మౌలిక వసతుల్ని పరిపుష్టీకరించి, సుశిక్షిత మానవ వనరుల్ని సమధికంగా అందుబాటులోకి తెస్తే- ఎఫ్‌డీఐల పరిమాణం దానంతటదే ఇనుమడించడానికి మేలుబాటలు పడతాయి!
ఇదీ చదవండి: 'ఏప్రిల్ నుంచి రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్'