'శతాబ్ది సంక్షోభం'గా దాపురించిన కరోనా మహమ్మారి దారుణ విలయతాండవం పోనుపోను దుర్భర స్థితిగతుల్ని ఆవిష్కరిస్తోంది. కొవిడ్ ఖడ్గప్రహారాలకు తెగటారుతున్న ఉపాధి అవకాశాలు, కుటుంబాలు ఛిద్రమై అనాథలుగా మిగిలినవారి దుఃఖార్తి, ఎక్కడికక్కడ పెచ్చరిల్లుతున్న ఆకలిమంటలు.. మానవ మహా విషాదాన్ని కళ్లకు కడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మే నెలలో 90.3లక్షల కొవిడ్ కేసులు, దాదాపు లక్షా ఇరవైవేల దాకా మరణాలు నమోదైన భారత్‌లో- కన్నవారిని కోల్పోయి దిక్కు తోచక విలపిస్తున్న అభాగ్యుల సంఖ్యా పెరుగుతోంది.
గత రెండు నెలల్లో కొవిడ్ బారిన పడి తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు 577 మందేనని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ తొలుత నమ్మబలికింది. ఒక్క రాజస్థాన్‌లోనే అటువంటివారి సంఖ్య నాలుగు వందలకు పైబడిందన్న సమాచారం వెల్లడైన దరిమిలా- గత సంవత్సరం మార్చ్ నెలనుంచీ లెక్కలు తీసే పని మొదలైంది. పిల్లల ఆన్‌లైన్ పోర్టల్ 'బాల్ స్వరాజ్' చెబుతున్న మేరకు, ప్రభుత్వ తక్షణ సాయంకోసం ఆక్రందిస్తున్న అనాథలు దేశంలో 10వేల మంది వరకు ఉన్నారు. అందులో తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు ఏడున్నర వేలమందిగా జాతీయ బాలల హక్కుల సంఘం (ఎన్‌సీపీసీఆర్) సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. కొవిడ్ కారణంగా అనాథలైన బాలలు పశ్చిమ్‌బంగలో ఒక్కరేనని, దిల్లీలో అయిదుకు మించలేదన్న గణాంకాలు- కొన్నిచోట్ల పూర్తి సమాచారం వెలుగులోకి రాలేదన్న యథార్థాన్ని స్పష్టీకరిస్తున్నాయి.
పీఎం కేర్స్..
కొవిడ్ కారణంగా అయినవారిని పోగొట్టుకున్నవారికి 'పీఎంకేర్స్' కింద కేంద్రం ఉచిత విద్య, ఉద్యోగుల వారసులకు పింఛన్ సదుపాయం కల్పిస్తామంటోంది. మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఏపీ, కేరళ, యూపీ రాష్ట్రప్రభుత్వాలూ వేర్వేరు ప్రణాళికలతో ముందుకొస్తున్నాయి. జాతిసంపద అనదగ్గ ఆయా బాలల మెరుగైన భవితవ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సమన్వయంతో అర్థవంతమైన కార్యాచరణ వడివడిగా పట్టాలకు ఎక్కాల్సి ఉంది.
ప్రభుత్వాలదే బాధ్యత
నేటి బాలలే రేపటి పౌరులు. వారే దేశ భావినిర్ణేతలు. సజావుగా విద్యాబుద్ధులు సమకూరి, చైతన్య వికాస కాంతిపుంజాలుగా ఎదిగే అవకాశాన్ని ఉన్నట్టుండి కోల్పోయినవారి మాటేమిటి? కుటుంబంలో సంపాదించే పెద్దదిక్కును, కంటికి రెప్పలా సంరక్షించే అమ్మ ఆప్యాయతను మాయదారి కరోనా అదాటున మటుమాయం చేసేస్తే- వారిని ఆదుకోవాల్సింది, భవితను సక్రమంగా తీర్చిదిద్దాల్సింది బాధ్యతాయుత ప్రజాప్రభుత్వాలే! దేశదేశాల్లో సుమారు అయిదోవంతు బాలలు, యుక్తవయస్కులు వివిధ కారణాలతో నేరాల బాట పట్టి సామాజిక విద్రోహ శక్తులుగా మారుతున్నట్లు లోగడ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ధ్రువీకరించింది.
సంక్షేమ చర్యలు..
కాచి కాపాడేవారు లేరన్న ధీమాతో కొవిడ్ శాపగ్రస్తులను మాటువేసి అక్రమ రవాణాకో, పడుపు వృత్తికో మళ్ళించే తెరచాటు యత్నాల్ని ఎన్‌సీపీసీఆర్ న్యాయస్థానానికే నివేదించింది. తల్లిదండ్రుల్లో ఒకర్ని లేదా ఇద్దర్నీ కోల్పోయిన దురదృష్టవంతుల్లో 56 శాతం నాలుగు నుంచి 13 ఏళ్లలోపు వారేనన్న యథార్థం గుండెల్ని మెలిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ముందుగానే సన్నద్ధమై, టీకాల కొనుగోలూ పంపిణీల్లో గందరగోళానికి తావివ్వకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే నేడింతటి దుస్థితి దాపురించేదే కాదేమో! ఎన్నో కుటుంబాలు తెగిన గాలిపటాలై ఎందరో పిల్లలు నడివీధుల పాలైన తరుణంలో- వారిలో ప్రతిఒక్కరి భవితవ్యం కుదుటపడేలా అన్నిరకాల సంక్షేమ చర్యలూ చేపట్టడం ప్రభుత్వాల నైతిక బాధ్యత.
'మేం అనాథలం కాదు.. మా బాగోగుల్ని చూసుకోవడానికి యావద్దేశం తోడూ నీడగా నిలిచింది' అని వారంతా సాంత్వన పొందేలా, జాతి గర్వించే స్థాయిలో సుశిక్షిత ఆదర్శపౌరులుగా ఎదిగేలా సంరక్షణ ప్రణాళికలు పదును తేలాలి. పాఠశాల చదువు, ఉన్నత విద్య, ఆరోగ్య బీమా సహా ప్రతి దశలో ఏ లోటూ రాకుండా చూసుకుంటే- నేడు దుఃఖవివశులై కుములుతున్నవారు క్రమేణా తేరుకుంటారు. మున్ముందు చరిత్రను తిరగరాసే దక్షత సంతరించుకుంటారు!
ఇదీ చదవండి:'బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా అసంపూర్ణమే'