అధికార పీఠంపై కొలువు తీరి చక్రం తిప్పుతున్నది ఏ పార్టీ ప్రభుత్వమన్నదానితో నిమిత్తం లేకుండా- దేశానికి విదేశీ రక్షణ విధానాలున్నట్లే విద్యావిధానమూ ఉండాలన్న ప్రధాని మోదీ అభిభాషణ ఎవరూ వంక పెట్టలేనిది. జాతి నిర్మాణంలో పటిష్ఠ పునాదిగా భాసిల్లే పటుతర విద్యావిధానం కొరవడటంవల్ల దశాబ్దాల తరబడి ఇండియా ఎంతగానో కోల్పోయింది. పుస్తకాల మోత, విపరీతమైన పరీక్షల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం ప్రసాదిస్తూ విద్యార్థుల్లో పఠనాసక్తిని సృజనాత్మక ఆలోచనల్ని రేకెత్తించేందుకంటూ- మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది మొదలు, విస్తృత చర్చోపచర్చలకది కేంద్రబిందువైంది. దేశంలో అందరికన్నా ముందు దాన్ని గుజరాత్ అమలుపరుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెబుతుండగా- విధాన కూర్పుపై తమిళనాడు, పశ్చిమ్ బంగ వంటివి భిన్నగళంతో స్పందిస్తున్నాయి.
ప్రజాసేవ...
బోధనను ప్రజాసేవగా అభివర్ణించిన కేంద్రం, దేశీయంగా విద్యావ్యాపారాన్ని నియంత్రించే చర్యల్ని ప్రస్తావించకపోవడం ఏమిటన్న అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. సమష్టి కార్యాచరణ, సమధిక కేటాయింపులు, సాంకేతికతకు పట్టం కట్టడంలో సాధ్యాసాధ్యాలపై విమర్శలు, సూచనలు వినవస్తున్నాయి. ఎక్కడైనా భారీ మార్పులు తలపెట్టినప్పుడు ఎదురుగాలి ఎంత సహజమో, అనుమానాలూ అపోహల నివృత్తితో అందర్నీ కలుపుకొని ముందుకెళ్ళడమూ అంతే ఆవశ్యకం. నూతన విద్యావిధానం అమలులో ప్రభుత్వ జోక్యం కనిష్ఠస్థాయికి పరిమితమవుతుందని జాతిజనులకు ప్రధాని భరోసా ఇవ్వడం స్వాగతించదగింది. విద్యారంగం బలోపేతమైతేనే మానవ వనరుల శక్తియుక్తులు దేశానికి గరిష్ఠంగా ఉపయుక్తమవుతాయి. ఆ కలను సాకారం చేయగలిగితేనే ఈ యావత్తు కసరత్తు సార్థకమైనట్లు!
అలా చేస్తే వంద శాతం విజయం!
వర్తమాన కాలావసరాలకు, రేపటి సవాళ్లకు ఏమాత్రం దీటుగా లేని చదువులు, బతికించలేని డిగ్రీలు... కోమా స్థితికి చేరిన విద్యారంగ దురవస్థను చాటుతున్నాయి. ఎంత ఉన్నత విద్య అభ్యసిస్తే అంత నిరుద్యోగిత అన్న చందంగా దిగజారిన వాతావరణం మానవ వనరుల దారుణ దుర్వినియోగానికి పుణ్యం కట్టుకుంటోంది. బడి చదువుల స్థాయీప్రమాణాల ప్రాతిపదికన భారత్ యాభైఏళ్లు వెనకబడిందని 'యునెస్కో' అధ్యయన పత్రం నాలుగేళ్లక్రితం ఈసడించింది. 'నాణ్యమైన చదువు విద్యార్థి హక్కు' అని ఇప్పుడు నూతన విద్యావిధానం స్పష్టీకరిస్తోంది. దిగనాసి ప్రమాణాల అవ్యవస్థను చక్కదిద్దడానికి మేలిమి బోధన సిబ్బంది ఆవిష్కరణను, పునాది దృఢత్వం కోసం మాతృభాషలో విద్యాబోధనను ప్రభుత్వం లక్షించడం వినసొంపుగా ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులకూ 'టెట్' (టీచర్ అర్హత పరీక్ష)ను తప్పనిసరి చేసి వందశాతం అమలుపరచగలిగితే అక్కడికదే తొలి విజయమవుతుంది.
మాతృభాషతోనే సాధ్యం!
రాష్ట్రపతి కోవింద్ చెప్పినట్లు, మాతృభాషలో బోధన చిన్నారుల మానసిక వికాసానికి దోహదపడుతుంది. బలమైన పునాది అమ్మభాషతోనే సుసాధ్యమని ప్రధానమంత్రీ అందుకు గట్టిగా ఓటేస్తున్నారు. విధాన ప్రకటన ఒకెత్తు, అమలులో నెగ్గుకురావడం మరొకెత్తు. మాతృభాషలో బోధనపై భిన్నాభిప్రాయాల రంధికి తావివ్వకుండా రాష్ట్రాలన్నీ ఏకోన్ముఖ కృషికి నిబద్ధమయ్యేలా కేంద్రం అనుసంధాన భూమిక పోషించాలి. కీలక సంస్కరణల స్ఫూర్తి దేశమంతటా పరిఢవిల్లేలా, ఉద్యోగ నియామక నిబంధనల సాకల్య క్షాళనకూ కంకణబద్ధం కావాలి. డిజిటల్ బోధనను చురుగ్గా పట్టాలకు ఎక్కించడంలో, ఆర్థిక భారాన్ని అధిగమించేలా రాష్ట్రాలకు అండగా నిలవడంలో వెనకంజ వేసేది లేదని కేంద్రం సోదాహరణంగా నిరూపించుకోవాల్సి ఉంది. 2030 నాటికి ఉద్యోగార్హ నైపుణ్యాలు కరవై అల్లాడే 90 కోట్లమంది యువతలో భారతీయుల వాటాయే అధికంగా ఉండనుందన్న అధ్యయనాలు గతంలో వెలుగు చూశాయి. అటువంటి భయాందోళనల్ని పటాపంచలు చేసేలా, అట్టడుగు నుంచి పైస్థాయిదాకా చదువరుల సంపూర్ణ వికాసానికి, వారి భావిజీవికకు భరోసా ఇచ్చేలా- నూతన విద్యావిధానం అక్కరకు రావాలి!
ఇదీ చూడండి: రేపు వైమానిక దళంలోకి చేరనున్న రఫేల్ జెట్లు