ETV Bharat / opinion

మోయలేని భారంగా ప్రైవేటు వైద్యం.. నియంత్రణేది? - ప్రభుత్వ ఆసుత్రులు

ప్రభుత్వరంగానికి పోటీగా కార్పొరేట్‌ వైద్య, విద్యా సంస్థలు ఆవిర్భవించి దీటుగా ఎదిగాయి. ఒకప్పుడు సేవాభావంతో పనిచేసే విద్య, వైద్య సంస్థలు ఇప్పుడు కార్పొరేట్‌ పెట్టుబడుల కారణంగా పక్కా వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. సాధారణంగా లాభార్జనే కార్పొరేట్‌ వైద్యశాలలకు లక్ష్యంగా ఉంటుంది. విద్య, వైద్యాలతో వ్యాపారం చేయరాదన్న చట్టాలు దేశంలో ఉన్నప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల రుసుముల వసూలును హేతుబద్ధీకరించడానికి కేంద్రప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది!

SITUATION OF PRIVATE HOSPITAL IN INDIA
మోయలేని భారంగా మారిన ప్రైవేటు వైద్యం
author img

By

Published : Jul 22, 2020, 10:36 AM IST

భారత దేశంలో పరిశ్రమలతో మొదలైన కార్పొరేట్‌ సంస్కృతి కాలక్రమంలో విద్య, వైద్య రంగాలకు విస్తరించింది. ప్రభుత్వరంగానికి పోటీగా కార్పొరేట్‌ వైద్య, విద్య సంస్థలు ఆవిర్భవించి దీటుగా ఎదిగాయి. ఒకప్పుడు సేవాభావంతో పనిచేసే విద్య, వైద్య సంస్థలు ఇప్పుడు కార్పొరేట్‌ పెట్టుబడుల కారణంగా పక్కా వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. విద్యారంగం ప్రైవేటీకరణ వల్ల అనేకమంది భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, స్థిరాస్తి వ్యాపారులు ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీల వ్యాపారంలోకి పెట్టుబడులు మళ్లించారు. ఆ క్రమంలో వైద్యరంగమూ కార్పొరేట్‌లో చేరిపోయింది. వైద్య విద్య అభ్యసించడానికి లక్షల రూపాయల ఖర్చు చేయాల్సిన రోజులు పోయి కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. అంత డబ్బు చెల్లించి చదివినవారు ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్యశాలల్లో చేరక తప్పని పరిస్థితులున్నాయి. కొందరు విదేశీబాట పడుతున్నారు. ప్రభుత్వ జీతాలు ఆకర్షణీయంగా లేకపోవడం, పింఛను సౌకర్యం ఎత్తేయడం వల్ల ప్రైవేటు వైద్యశాలల్లో చేరడానికే అనేకమంది మొగ్గు చూపుతున్నారు.

సాధారణంగా లాభార్జనే కార్పొరేట్‌ వైద్యశాలలకు లక్ష్యంగా ఉంటుంది. నిర్వాహకులు వైద్యులకు వసూళ్ల లక్ష్యాలు నిర్దేశిస్తారు. విద్య, వైద్యాలతో వ్యాపారం చేయరాదన్న చట్టాలు దేశంలో ఉన్నప్పటికీ అవి కొరగానివిగా ఉండిపోవడమే విడ్డూరం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవాలోపాలు అనేకం. అత్యవసర మందులు లభ్యం కావడం లేదు. కరోనా నేపథ్యంలో సరైన మాస్కుల సరఫరా లేక వైద్యుల నుంచే అనేక ఫిర్యాదులు వినిపించాయి. ప్రశ్నించిన వైద్యులపట్ల కక్షపూరితంగా వ్యవహరించిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ప్రారంభంలో కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే వెళ్ళాలని ఆదేశించిన ప్రభుత్వాలు- మంత్రులు, శాసనసభ్యులు సైతం రోగం బారిన పడుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతించారు. వాటికి మార్గదర్శకాలు జారీ చేయడం తప్ప ఏ విధమైన నియంత్రణ చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా అనేక ఆస్పత్రులు ప్రజలనుంచి ఇష్టారాజ్యంగా వేలు, లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ప్రైవేటు కేంద్రాలు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో ఫలితాలు తప్పుల తడకగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు తప్ప ఎక్కువ కార్పొరేట్‌ వైద్యశాలలు రకరకాల పరీక్షల పేర్లు చెప్పి గరిష్ఠంగా రుసుములు వసూలు చేసుకొంటున్నట్లు ఫిర్యాదులూ వస్తున్నాయి.

వైద్యరంగ నైతిక సూత్ర నియమావళి ప్రకారం ఏ వైద్యశాల, వైద్యుడు తమ చికిత్సల గురించి ప్రచారం చేయరాదు. చికిత్స కోసం వచ్చినవారికి అన్ని వివరాలూ తెలియజేయాలి. ఏ పరీక్షలు ఎందుకోసం చేస్తున్నదీ వివరించాలి. రోగుల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా చికిత్సను సూచించాలి. వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కొద్దిరోజులకే లక్షల రూపాయల బిల్లులు వస్తున్న తీరే అందుకు నిదర్శనం. అనేక సందర్భాల్లో ఇవి గొడవలకూ దారితీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విలాసవంతమైన హోటళ్లలో టీ ధర ఏడెనిమిది వందలు ఉన్నప్పుడు వైద్యానికి ఆ మాత్రం రుసుములు వసూలు చేయడంలో తప్పేమిటన్న వాదనలను సంబంధిత వర్గాలు రివాజుగా వినిపిస్తుంటాయి. వైద్యాన్ని, విలాసాన్ని ఒకే గాటన కట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడమే ఇక్కడ విషాదం!

ప్రభుత్వ వైద్యశాలలు రోగులతో నిండిపోయాయి. ఎక్కడా ఖాళీలు లేవని ప్రభుత్వమే చెబుతోంది. అనుమతించిన వైద్యశాలల్లోనే చికిత్స చేయించుకోవాలని నిర్దేశిస్తోంది. ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకంలోకాని, ఆరోగ్యశ్రీలోకాని కొవిడ్‌ను చేర్చలేదు. దీంతో పేదలు, మధ్యతరగతివారు ప్రాణాలు నిలుపుకోవాలన్న ఆశతో అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. వైద్యం పూర్తయి ఇంటికి పంపిస్తున్న సమయంలో బిల్లులు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. వైద్యం కోసం పొలాలు సైతం అమ్ముకొని రోడ్డునపడ్డ కుటుంబాలు చాలానే ఉన్నాయి. వైద్యంలో సాగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వపరంగా నిర్దిష్ట నియామావళిని రూపొందించాలి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు వీటిని విధిగా పాటించేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఆస్పత్రులు అందించే సౌకర్యాల స్థాయినిబట్టి రుసుములు నిర్ధారించాలి. వాటిలో విపరీతమైన అంతరాలు లేకుండా చూడాలి. రుసుముల వివరాలను వైద్యశాలలో విధిగా ప్రధానంగా స్థానిక భాషలో ప్రదర్శించాలి. చికిత్స వ్యయం అధికం అవుతున్నప్పుడు సంబంధీకులతో స్పష్టంగా స్థానిక భాషలో పరిస్థితిని విడమరచి చెప్పాలి. స్థానిక భాషలో, పెద్ద అక్షరాలతో ముద్రించిన అంగీకార పత్రంలో ఆమోదం పొందిన తరవాతే చికిత్స మొదలుపెట్టాలి. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం మిగతా అంశాలతోపాటు వైద్యవిద్య, వైద్యం ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్యాలుగాని, కేంద్ర ప్రభుత్వంగాని చట్టాలు, నిబంధనలు రూపొందించవచ్చు. కేంద్రం చట్టం చేయనంత వరకు రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చు. ఒకవేళ కేంద్రం చట్టం చేస్తే అంతిమంగా అదే చెల్లుతుంది. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల రుసుముల వసూలును హేతుబద్ధీకరించడానికి కేంద్రప్రభుత్వం చొరవ చూపాల్సిఉంది!

- అనిసెట్టి శాయికుమార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.