కరోనా హోరుగాలికి ఉపాధి దీపాలు కొండెక్కి గూడు చెదిరి గుండె పగిలి సొంతూళ్లకు తరలిపోయిన వలస శ్రామికులు కోట్ల సంఖ్యలో ఉన్న దేశం మనది. భావోద్వేగాలతో ఇళ్లకు పయనం కట్టిన వారందరినీ నేడు బతుకు భయం వెంటాడుతోంది. రెక్కాడితేగాని డొక్కాడని శ్రమజీవులందరికీ గ్రామీణ ఉపాధి హామీ పథకమే అన్నపూర్ణ అవుతోంది. నిరుడు ఏప్రిల్ నెలలో కోటీ 70 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ భరోసా దక్కగా, లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ఈ ఏడాది ఉపాధి 34 లక్షల కుటుంబాలకే పరిమితమైంది. గ్రామాలకు పోటెత్తిన వలస కూలీల ఉపాధి వేటకు గత నెల గణాంకాలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 కోట్ల మంది ఉపాధి హామీ కింద దరఖాస్తు చేసుకోగా- రెండు కోట్ల మందికి రిక్తహస్తమే ఎదురైంది. పోయినేడాది మొత్తం 1.45 కోట్ల మందికి ఉపాధి కల్పించలేక పోయారని, అదే ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లోనే అంతకంటే ఎక్కువ మందికి కూలీనాలీ కరవైందన్న సమాచారం ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) వ్యూహంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయింపులు రూ.61వేల కోట్లకు అదనంగా కేంద్రం మరో రూ.40వేల కోట్లు మంజూరు చేసింది. ఆ మేరకు 300 కోట్ల పని దినాల పరికల్పనను కేంద్రం లక్షించినా- అవసరార్థులకు ఉపాధి అందని మాని పండు కావడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంలో ఒకరికి ఏడాదికి వంద రోజుల పని కల్పించడానికి గ్రామీణ ఉపాధి చట్టం హామీ ఇస్తోంది. ఆ వంద రోజుల పని పరిమితి రేఖను ఇప్పటికే లక్షా 40వేల కుటుంబాలు చేరాయి. 23 లక్షల కుటుంబాలు 60 రోజుల పని పూర్తి చేశాయి. ఉపాధి పనులతో తప్ప పూట గడవని లక్షలాది కుటుంబాలు ఆకలి మంటల్లో సమిధలు కారాదంటే, సత్వర చర్యలకు కేంద్రం సమకట్టాలి. కాల పరిమితి లేని ఉపాధికి హామీ ఇవ్వాలి!
కొవిడ్ కట్టడికి లక్షించిన లాక్‌డౌన్ కారణంగా పట్టణాల్లో 12 కోట్ల మంది, పల్లెల్లో 28 కోట్ల మంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారని అధ్యయనాలు చాటుతున్నాయి. దేశ జనావళిలో 47 శాతాన్ని కడు పేదరికంలోకి దిగలాగిన మహోత్పాతం- నగరాల్లో నిన్న మొన్నటిదాకా పారిశ్రామిక సేవారంగ ఉద్యోగులుగా ధీమాగా గడిపినవారినీ పొట్టకూటి కోసం తట్టలు మోసేలా చేసింది. కేంద్రం ఉపాధి హామీ పనుల చెల్లింపుల్ని 11శాతం పెంచినా, అది వ్యవసాయ కూలీల కనీస వేతనం కంటే 40-50శాతం తక్కువే! కలోగంజో తాగి బతకడానికి వేరే దారిలేక ఉపాధి హామీ పనుల కోసం ఉరికి వచ్చే కోట్లాది బడుగు జీవులను- ఎక్కడికక్కడ పథకాల్ని విస్తరించి ఆదుకోవాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే! అడిగిన వారికి కాదనకుండా పని కల్పించలేక పోతున్నట్లు, ఏడాదికి 46 రోజులే ఉపాధి అందించగలుగుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖే లోగడ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 5.48 కోట్ల గ్రామీణ కుటుంబాలకు సగటున 48 రోజుల పని కల్పించడానికి కేంద్రం దాదాపు రూ.68 వేల కోట్లు వ్యయీకరించింది. అందులో వేతనాల బిల్లు సుమారు రూ.49 వేల కోట్లు. ఆరు రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాలకు వలస శ్రామికుల పోటు పెరిగిందంటూ వారి పనీపాటల నిమిత్తం రూ.50 వేల కోట్లతో ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ చేపట్టిన కేంద్రం- దేశవ్యాప్త ఉపాధి హామీని అన్ని విధాలుగా పరిపుష్టం చేయాల్సిన అవసరాన్ని విస్మరించలేదు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా బావులు, నీటి గుంతల తవ్వకం, ఉద్యానవనాల పెంపకం వంటి పథకాల్ని ప్రస్తావించిన కేంద్రం- మహమ్మరి ప్రభావం రూపుమాసిపోయేదాకా దేశవ్యాప్తంగా ఉపాధికి భరోసా ఇవ్వాలి. కోరిన అందరికీ పని, సాయంత్రానికి కూలీ గిట్టేలా గట్టి చర్యలు చేపట్టి- అవినీతికి ఆస్కారం లేని విధంగా జన ప్రయోజనకర ఆస్తుల నిర్మాణానికి రాష్ట్రాలు పూచీ పడాల్సిన తరుణమిది!