పది నెలలుగా ప్రపంచదేశాల కంటికి కునుకు లేకుండా చేసి మానవాళిని తీవ్రంగా కలవరపరుస్తున్న ఉమ్మడి శత్రువు- కొవిడ్ కారక కరోనా మహమ్మారి. విశ్వవ్యాప్తంగా కొవిడ్ మృత్యుఘాతాలకు నిస్సహాయంగా బలైనవారి సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటి ఇంకా విస్తరిస్తోంది. ఆరోగ్యసేవా రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన వాటినుంచి జనాభాకు దీటైన వైద్యసేవల విస్తృతి కొరవడిన ఇండియా దాకా వివిధ దేశాల స్వాస్థ్య వ్యవస్థల పరిమితుల్ని కొవిడ్ బట్టబయలు చేసింది. వైరస్ దూకుడు పెచ్చరిల్లుతున్నకొద్దీ, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో- ఇతర వైద్యసేవలెన్నో కుంటువడ్డాయి. వాస్తవానికి కొవిడ్ మానవ మహావిషాదాన్ని తలదన్నే స్థాయిలో 15 రకాల వ్యాధులు ఏటా తలా పది లక్షలకుపైగా మరణాలకు కారణమవుతున్నాయన్న వైద్య పత్రిక 'లాన్సెట్' తాజా విశ్లేషణాత్మక కథనం, ప్రపంచం నలుమూలలా ఆరోగ్య వ్యూహాలూ విధానాల్లో తక్షణ సర్దుబాటు చర్యల అత్యావశ్యకతను ఎలుగెత్తుతోంది. గుండెజబ్బులు (కోటీ 78 లక్షలు), క్యాన్సర్లు (96 లక్షలు) మొదలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు (12 లక్షలు), క్షయ (11 లక్షలు) వరకు ఆ జాబితా కింద సగటున ఏటా కడతేరిపోతున్న ప్రాణాల సంఖ్య ఎకాయెకి 4.43 కోట్లుగా లెక్క తేలుతోంది. ఆ తీవ్రతకు తగ్గట్లు అందాల్సిన సేవలు చాలాచోట్ల కొండెక్కాయి. కరోనా కోరసాచిన మూడు నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రెండుకోట్ల 84 లక్షలు, ఒక్క ఇండియాలోనే 5.8లక్షల శస్త్ర చికిత్సలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బాధితులకు సరైన చికిత్స సమకూరక ఈ ఏడాది మరిన్ని అధిక మరణాలతో క్షయ మూలాన ప్రాణనష్టం 16.6 లక్షలకు ఎగబాకనుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక తరవాతా మారని పరిస్థితి, 'లాన్సెట్' ప్రమాద ఘంటికలతోనైనా కుదుటపడుతుందా?
ఈ సంవత్సరం ఒక్క మార్చి నెలలోనే దేశవ్యాప్తంగా లక్షలమంది పిల్లలు టీకా మందులకు దూరమయ్యారని జాతీయ ఆరోగ్య మిషన్ గణాంకాలు చాటుతున్నాయి. సాధారణ జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నవారినీ పరీక్షించి నాడిపట్టే నాథుడు కరవైన ఉదంతాలెన్నో లెక్కేలేదు. పురిటి నొప్పులతో జోరువానలో అయిదు ఆస్పత్రులకు తిరిగి కడకు 'గాంధీ'లో చేరిన బాగ్యనగర మహిళ కడుపులో శిశువును, తన ప్రాణాల్నీ పోగొట్టుకున్న ఘోరం ఎందరినో కలచివేసింది. డయాలసిస్, రక్తమార్పిడి, కీమోథెరపీల వంటివే కాదు- అత్యవసర ప్రసవ సేవల్నీ పలు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తుండటాన్ని తప్పుపట్టిన కేంద్రం, అన్ని హాస్పిటళ్లూ సక్రమంగా పనిచేసేలా చూడాలని అయిదు నెలల కిందటే రాష్ట్రాల్ని ఆదేశించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో కంటి చికిత్సా కేంద్రాలను తెరవద్దన్న కేంద్ర వైద్యారోగ్యశాఖ ఇటీవలి ఉత్తర్వులు, చాలాచోట్ల అప్రకటిత ఆంక్షలు- నిరంతర ఆరోగ్య సేవల భాగ్యాన్ని ఎండమావి చేస్తున్నాయి. వానలు ముమ్మరించేకొద్దీ సాంక్రామిక వ్యాధులు ముసురేసే ముప్పుందని ప్రధానమంత్రే హెచ్చరించినా, కరోనాయేతర వ్యాధుల కట్టడి కోసం ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ఠీకరించి సన్నద్ధపరచాలని పిలుపిచ్చినా- నేటికీ క్షేత్రస్థాయిలో భిన్న స్థితిగతులు కళ్లకు కడుతున్నాయి. థలసేమియా, మస్క్యులర్ డిస్ట్రఫీ తదితర 'అరుదైన వ్యాధుల'తో సతమతమవుతున్నవారు దేశంలో తొమ్మిది కోట్లమంది వరకు ఉంటారని అంచనా. దంత సమస్యలతో బాధపడుతూ సాంత్వనకోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నవారూ ఎందరో. కొవిడ్ భారంతో ఆస్పత్రులు నలిగిపోతుండగా, కరోనాయేతర ఆరోగ్య సేవలకు నోచక అసంఖ్యాక ప్రజలు కునారిల్లుతున్న తరుణంలో సత్వర కార్యాచరణకు ప్రభుత్వాలు పూనుకోవాలి. ఆరోగ్య సమస్యల తీవ్రతకు అనుగుణంగా చురుగ్గా వైద్యసేవలు సమకూర్చడానికి శాయశక్తులా పాటుపడటమిప్పుడు ప్రజాప్రభుత్వాల తక్షణ విధి!