ETV Bharat / opinion

కరోనా దెబ్బతో కార్మికులుగా మారుతున్న పిల్లలు

కరోనా సంక్షోభంతో విద్యావ్యవస్థ కుదేలైంది. మహమ్మారి కారణంగా కుటుంబ ఆదాయాలపై దెబ్బపడుతున్నందున సరైన అండదండలు లేని ఎంతోమంది చిన్నారులు బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో వారికి సామాజిక రక్షణ కలిగించడం ఎంతో ముఖ్యం. ఆయా ప్రభుత్వాలు వెంటనే దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టాలి.

Situation of children in amid corona crisis
కరోనా దెబ్బతో కార్మికులుగా మారుతున్న పిల్లలు
author img

By

Published : Nov 22, 2020, 10:02 AM IST

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో విద్యావ్యవస్థ ఇదివరకెన్నడూ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సగం విద్యా సంవత్సరం గడుస్తున్నా పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక స్థోమత లేనివారికి ఆసరాగా ఉండే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంక్షేమ సంఘాల సహకారంతో చదువుకునే పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక అనాథ పిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. లక్షల మంది చిన్నారులను బడివైపు మళ్లించిన మధ్యాహ్న భోజన పథకం సరైన నిర్వహణ లేక ఎంతోమంది చిన్నారులు పోషకాహార లోపానికి గురయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బడి ఈడు పేద విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పనివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది చిన్నారులు బాల కార్మికులుగా మారే ప్రమాదముందన్న నివేదికలు కలవరపెడుతున్నాయి.

భారత్‌లో మరింత ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా బాలకార్మిక నిర్మూలన కోసం రెండు దశాబ్దాలుగా చేస్తున్న కృషి వృథా అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఈమధ్యే వచ్చిన అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా, భారత్‌లో 2006 నుంచి 2016 మధ్యకాలంలో దాదాపు 27కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ఈ పురోగతి మొత్తం వృథా అయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం చిన్నారులు చదువుకు దూరమైతే, వారిలో అనేక మంది బాల శ్రామికులుగా మారే ప్రమాదం ఉందని అంచనా. ఒకవేళ అదే జరిగితే, పాఠశాల చేరికల్లో సాధించిన ప్రగతి, అక్షరాస్యతలో పురోగతి, సామాజిక చైతన్యం కుంటువడటంతో పాటు పిల్లల ఆరోగ్యమూ దెబ్బతింటుదన్న నిపుణుల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి సొంత గ్రామాలకు వెళ్లిన తల్లిదండ్రుల ఆర్థిక సమస్యల ప్రభావం వారి పిల్లలపై పడుతున్నట్లు తెలుస్తోంది. ఇవే పరిస్థితులు మరికొంత కాలం ఉంటే, రానున్న పదేళ్లలో లక్షల సంఖ్యలో బాల్యవివాహాలు జరగవచ్చని యునెస్కో తాజాగా నివేదించింది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని అమ్మాయిల్లో ఎక్కువ మంది పేద బాలికలు చదువును మధ్యలోనే మానేసే అవకాశాలు లేకపోలేదని యునెస్కో పేర్కొనడం గమనార్హం. బడుల మూత వల్ల భారతదేశం భవిష్యత్తులో దాదాపు రూ.30లక్షల కోట్ల విలువైన ఉత్పాదకతను నష్టపోవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇవన్నీ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తున్నాయి. ఫోన్లు, అంతర్జాలం అందుబాటులో లేని వేలమంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన అందని ద్రాక్షగా మారింది. తల్లిదండ్రులతో రోజువారీ పనులకు తోడుగా వెళుతున్న నేపథ్యంలో- ఒక్కసారి ఉపాధి దొరికి, డబ్బు సంపాదనకు అలవాటు పడిన బాలల మస్తిష్కాలు తిరిగి చదువుపై శ్రద్ధ చూపలేవని మానసికవైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ నేర నమోదు కార్యాలయం (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు, ఒత్తిడి ఎక్కువైతే భవిష్యత్తులో బాలల్లో నేర ప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది చిన్నారులు బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) డెరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌ పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా కుటుంబ ఆదాయాలపై దెబ్బపడుతున్నందున సరైన అండదండలు లేని ఎంతోమంది చిన్నారులు బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో వారికి సామాజిక రక్షణ కలిగించడం ఎంతో ముఖ్యమని, ఆయా ప్రభుత్వాలు వెంటనే దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

చదువుకు చేరువైతేనే ధీమా

బడి ఈడు పిల్లలు బాలకార్మికులుగా మారకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర వ్యూహంతో కూడిన ఉద్యమాన్నే చేపట్టాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద, సేవాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సామాజిక బాధ్యతగా కీలక పాత్ర పోషించాలి. విద్యా హక్కు చట్టాన్ని వందశాతం అమలు చేస్తూ... వారిపై ఎల్లప్పుడూ పర్యవేక్షణ ఉంచాలి. పాఠశాలల రుసుముల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టిపెట్టి పేద కుటుంబాలకు భరోసా ఇవ్వాలి. పనిప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేసి బాల కార్మికులను గుర్తించి వారిని బడి బాట పట్టించే వ్యూహానికి పదునుపెట్టాలి. నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలి. మధ్యాహ్న భోజన పథకం, ప్రతి చిన్నారికి పోషకాహారం అందించే కార్యక్రమాన్ని సమర్థంగా కొనసాగించాలి. సాధ్యమైనంత వరకు పిల్లలను చదువులకు దగ్గర చేయడం వల్ల బాల్యానికి భరోసా ఇచ్చినవాళ్లమవుతాం. లేదంటే కరోనా సంక్షోభానికి వారు ప్రత్యక్ష బాధితులుగా మిగిలే ప్రమాదం ఉంది.

- అనిల్‌కుమార్‌ లోడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.