గాంధీ మహాత్ముడి 'గ్రామ స్వరాజ్య' భావనను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం 2014లో సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై-సాగీ) పథకాన్ని ప్రారంభించింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులందరూ తమ సొంత గ్రామం, తమ జీవిత భాగస్వామికి చెందిన గ్రామం కాకుండా- నియోజకవర్గంలోని ఇతర ఏ గ్రామ పంచాయతీనైనా ఎంపిక చేసుకొని దత్తత తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ప్రతిపాదించిన గ్రామీణ పునర్నిర్మాణ వ్యవస్థను అనుసరించి పల్లెసీమల్లో పనులు చేపట్టడం- ఆదర్శ గ్రామ యోజన ముఖ్యోద్దేశం. ప్రతి పార్లమెంటు సభ్యుడు 2014 నుంచి 2019 వరకు మూడు గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. తరవాత మలిదశలో 2024 వరకు ఏటా ఒక గ్రామం చొప్పున మరో అయిదు ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించింది.
కొరవడుతున్న ప్రజాభాగస్వామ్యం
ప్రజల విస్తృత భాగసామ్యంతో ప్రణాళికల ద్వారా, సమగ్ర మానవాభివృద్ధికి పాటుపడటం 'సాగీ' లక్ష్యం. మౌలిక సదుపాయాలను కల్పించినంత మాత్రాన సమగ్ర అభివృద్ధి చోటుచేసుకోదు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అసమానతలు తగ్గించడం, వారిలో చైతన్యం కలిగించడం వంటి ప్రధాన లక్ష్యాలను సాగీలో పేర్కొన్నారు. కానీ, అవి పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. ఆదర్శ గ్రామ నిర్మాణానికి గ్రామీణులకు పేదరికం నుంచి విముక్తి కలిగించేలా ప్రణాళికలను తయారు చేయాల్సి ఉంటుంది. తొలుత గ్రామపంచాయతీలో గ్రామసభలు ఏర్పాటు చేసి, వివిధ వర్గాల ప్రజల మధ్య సమన్వయం పెంపొందించాలి. గ్రామ సమస్యలు, వనరులను గుర్తించి, స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. గ్రామస్తులు వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకోవాలి. కానీ తగిన అవగాహన, ప్రచారం, చొరవ లేక ప్రజా భాగస్వామ్యం కొరవడుతుండటం దురదృష్టకరం. గ్రామాల బాగు కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పార్లమెంటు సభ్యుల అభివృద్ధి నిధులు, కేంద్ర ఆర్థిక సంఘం నిధుల సమన్వయంతో సాగీ పనులు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ, కేంద్ర, రాష్ట్రాల నిధులతో అభివృద్ధికి పాటుపడుతున్నారు.
సాగీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం 2014-19లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం దత్తత తీసుకున్న గ్రామ పంచాయతీలు 1,510. తరవాత 2019-24 మధ్య 666 గ్రామాలను గుర్తించారు. ఈ ఏడాది జులై మాసాంతానికి మొత్తం 2,176 గ్రామ పంచాయతీల్లో పథకం అమలవుతోంది. అందులో 1,674 పంచాయతీలు మాత్రమే గ్రామ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాయి. ఇంకా 502 గ్రామ పంచాయతీలు ప్రణాళికలను తయారు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా రూపొందిన ప్రణాళికల ప్రకారం 81,448 కార్యక్రమాలను గుర్తించారు. అందులో 51,170 పూర్తయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 6,505 కార్యక్రమాలు పురోగతిలో ఉండగా, పూర్తి కావలసినవి 23,773. గుర్తించిన పనులను ఆశించినంత వేగవంతంగా చేయకపోవడంతో పథకంలో జాప్యం నెలకొంది.
గ్రామాభివృద్ధికి మౌలిక సదుపాయాలను అందించడంతోపాటు సామాజికాంశాలను సమ్మిళితం చేయాలి. గ్రామం ఆదర్శప్రాయంగా ఉండాలంటే రోడ్లు, భవనాలు, మురుగు కాలువలు వంటి నిర్మాణాత్మకమైన పనులతో పాటు- ప్రజల వ్యక్తిత్వ, సామాజిక, ఆర్థికాభివృద్ధికి సైతం కృషి చేయాలి. గ్రామీణులు మద్యం, ధూమపానం, గుట్కా, పొగాకు వినియోగం వంటి వ్యసనాల బారిన పడకుండా వారిలో అవగాహన కల్పించాలి. పరిశుభ్రత, పోషకాల గురించి వివరించాలి. అందరికీ విద్య, వైద్యం అందేలా చూడాలి. గ్రామీణ పారిశ్రామిక విధానాన్ని బలోపేతం చేయాలి. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించాలి.
ప్రణాళికల అమలు ముఖ్యం
మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచవచ్చు. మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంచాలి. సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించే దిశగా గ్రామీణులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించి, వాననీటిని ఒడిసిపట్టాలి. పటిష్ఠమైన బ్యాంకింగ్ వ్యవస్థ, పరపతి సదుపాయం కల్పించడం, ఉమ్మడి సేవా కేంద్రాలు నెలకొల్పడం వంటివి అవసరం. ప్రజాపంపిణీ వ్యవస్థను అన్ని కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సామాజిక భద్రత కల్పించడం అభివృద్ధికి కీలకం.
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి. అన్ని వర్గాల ప్రజలను తప్పనిసరిగా భాగస్వాములను చేసినప్పుడే తలపెట్టిన కార్యక్రమాలు చురుకందుకొంటాయి. తరచూ సమీక్షలు నిర్వహించి లోటుపాట్లను గుర్తించి సరిచేయాలి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరం. అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం గ్రామాలను సందర్శిస్తూ, ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా సంపూర్ణ గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలను రూపొందించి, అమలులోనూ ఆదర్శవంతంగా వ్యవహరించాలి. అప్పుడే పల్లెసీమలు ఆదర్శ గ్రామాలుగా అవతరిస్తాయి. తద్వారా స్థానిక స్వపరిపాలన స్పూర్తితో సత్వరాభివృద్ధి సాధ్యమవుతుంది. సాగీ లక్ష్యమూ నెరవేరుతుంది.
రచయిత- ఎ.శ్యామ్‌కుమార్