దేశంలో వరదలు పోటెత్తి పంటల్ని, ప్రాణాల్ని కబళిస్తున్నాయి. మరోవంక అనేక ప్రాంతాలు నీరు లేక అల్లాడుతున్నాయి. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక వృద్ధీ దెబ్బతింటోంది. నదీజలాల సద్వినియోగం ద్వారా ఇలాంటి దురవస్థలకు అడ్డుకట్ట వేసి సుస్థిర మానవాభివృద్ధిని సాధించేందుకు నదుల అనుసంధానమే అత్యుత్తమ పరిష్కారం. ఎన్నో అధ్యయనాలు, మరెన్నో నివేదికలు దశాబ్దాలుగా ఘోషిస్తున్నదీ ఇదే. ఈ వాస్తవాన్ని అవగతం చేసుకున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఈ బృహత్పథకం సాకారం కావడం తన ప్రగాఢవాంఛ అని ప్రకటించారు. పదిహేనేళ్లు గడచిపోయినా ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇదే వాగ్దానం చేసినా, నదుల అనుసంధాన పథకం ముందుకు కదలలేదు. వాజ్‌పేయీ ప్రకటన తరవాత అప్పటి నీటివనరుల మంత్రిత్వశాఖ, జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ముందుగా రాష్ట్రస్థాయిలో నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు కోరుతూ రాష్ట్రాలకు లేఖలు పంపి కార్యాచరణకు ఉపక్రమించింది.
సుదీర్ఘ సమీక్షలు
నదుల అనుసంధానంపై రాష్ట్రాలు సవివర అధ్యయనం జరిపి 2006లోనే కేంద్రానికి తమ ప్రతిపాదనలు సమర్పించాయి. స్పందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. తొమ్మిది రాష్ట్రాల నుంచి మొత్తం 47 ప్రతిపాదనలు అందినప్పటికీ, అడుగు కాస్త ముందుకుపడింది ఒకటి రెండు ప్రతిపాదనలకు సంబంధించి మాత్రమే. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. నదుల అనుసంధానంపై కేంద్రవైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు పదేళ్ల తరవాత, ఈ మధ్యే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కెన్-బెత్వా అంతర్రాష్ట్ర నదీ అనుసంధాన ప్రతిపాదన దస్త్రం దుమ్ము దులిపింది. సవివర పథక నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్- డీపీఆర్)కు ఆమోదం తెలిపింది. యమున ఉపనదులైన కెన్, బెత్వాల అనుసంధాన ప్రాజెక్టు వల్ల సువిశాలమైన మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. మరికొన్ని ఇతర అనుసంధాన పథకాల ప్రతిపాదనలపై సంబంధిత రాష్ట్రాలతో కేంద్ర మంత్రిత్వశాఖ సుదీర్ఘ సమీక్షలు పూర్తి చేసింది. పార్-తప్తి-నర్మద లింకు, దమనగంగ-పింజాల్, దమనగంగ-వైతరణ-గోదావరి, దమనగంగ(ఏక్దారే)-గోదావరి, బెడ్తీ-వర్దా, కావేరీ(కట్టలయి)-వైగై-గున్దర్ అనుసంధాన పథకాలు వీటిలో ఉన్నాయి. మిగిలినవాటి మీదా సంప్రతింపులు కొనసాగుతున్నాయి.
అసోం, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తరచూ వరదల బారిన పడుతుండగా- దేశంలోని కొన్ని పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొంటున్నాయి. గోదావరి-కావేరి అనుసంధాన పథకం తన స్వప్నమని, దీన్ని వాస్తవం చేస్తానని 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, అప్పటి జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పుదుచ్చేరిలోని కరైకల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరిలో నిర్వహించిన స్నాతకోత్సవ సభలోనూ ఆయన తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. రూ. 60 వేలకోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరీ నదులు అనుసంధానమైతే 1,200 శతకోటి ఘనపుటడుగుల (టీఎమ్‌సీల)జలాలు సముద్రం పాలుకాకుండా సద్వినియోగమవుతాయని, ఈ పథకాన్ని తమ ప్రభుత్వం చేపడుతుందని ప్రకటించారు. పథకాలెన్నో కాగితాలపై ఉన్నా ఆచరణలో సున్నాగా మిగిలిపోవడం శోచనీయం. గోదావరి-గున్దర్ నదీ సంధాన ప్రాజెక్టును తక్షణం చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె.పళనిస్వామి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కోరుతున్నారు. ప్రాజెక్టులో ఎందుకింత జాప్యమన్న ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద స్పష్టమైన సమాధానం లేదు. దాదాపు అన్ని ప్రతిపాదనలదీ ఇదే తీరు.
చిగురిస్తున్న ఆశలు
భారత ద్వీపకల్పంలో, హిమాలయ ప్రాంతంలో ప్రవహిస్తున్న దాదాపు 30 నదులు అనుసంధానమయ్యే బృహత్పథకాన్ని దశాబ్దాలుగా నాన్చడం క్షంతవ్యం కాదు. ఒకవంక అపార జలరాశులు వృథాగా సముద్రాల్లో కలిసిపోతుండగా, అదే సమయాన అనేక ప్రాంతాలు నీటి ఇక్కట్లతో విలవిల్లాడే దురవస్థల పాలవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య తీవ్రతను, పథకం ఆవశ్యకతను గుర్తించిందనడానికి- సంబంధిత మంత్రిత్వ శాఖలు తరచూ దీనిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండటమే నిదర్శనం. కేంద్రప్రభుత్వానికి నదుల అనుసంధాన ప్రతిపాదన చేసిన జలవనరుల సామాజిక కార్యకర్త ఎ.సి.కామరాజ్ అభిప్రాయం ప్రకారం- అపారమైన నీటివనరుల సమర్థ యాజమాన్యం నదుల అనుసంధానం మీదే ఆధారపడి ఉంది. వేలాది టీఎమ్‌సీల వరద నీరు సముద్రం పాలయ్యే దీనావస్థను నివారించగలిగితే, వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు అమిత ప్రయోజనం కలుగుతుంది. దేశంలో జలమార్గ రవాణా కూడా సాధ్యపడి యావత్ ఆర్థికవ్యవస్థ ఇతోధికంగా లాభపడుతుంది. సుస్థిర మానవాభివృద్ధి సాకారమవుతుంది!
- ఎం.మణికందన్