Rising drug sales: దేశవ్యాప్తంగా ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వాటి అక్రమ రవాణా పెచ్చుమీరాయి. అక్రమార్కులు నిత్యం ఏదో ఒక మూల గంజాయి, దాని అనుబంధ ఉత్పత్తులు, ఇతర మత్తు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాటి విక్రయాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. సమాజానికి హానికరంగా మారుతున్న మత్తుమందు వ్యాపారులపట్ల ఎటువంటి దాక్షిణ్యం కనబరచాల్సిన అవసరం లేదని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మాదకద్రవ్యాల కట్టడికోసం 1986 మార్చి 17న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ప్రత్యేకంగా ఏర్పాటైంది. మానవ వనరుల లేమి ఆ సంస్థను పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం అందులో 1100 లోపు సిబ్బందే విధులు నిర్వర్తిస్తున్నారు. అంత తక్కువ మందితో దేశవ్యాప్తంగా దాడులు చేయడం, మాదక ద్రవ్యాల ముఠాలపై నిఘా పెట్టడం ఆ సంస్థకు కష్టతరంగా మారుతోంది.
Drugs usage in India
దక్షిణాది రాష్ట్రాల్లో గంజాయి, దాని అనుబంధ ఉత్పత్తుల రవాణా, విక్రయాలు, వినియోగం క్రమంగా అధికమవుతున్నాయి. వాటిని నియంత్రించే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించాలనే ప్రతిపాదనను అధికార యంత్రాంగం ముందుకు తెచ్చింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్‌సీబీని విస్తరించాలని నిఘావర్గాలూ సూచిస్తున్నాయి. మాదకద్రవ్యాల సరఫరాదారులు, విక్రేతలకు సంకెళ్లు బిగించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వివిధ సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలి. అందుకోసమే 2016లో నార్కో సమన్వయ కేంద్ర వ్యవస్థ(ఎన్‌సీఓఆర్‌డీ) కొలువుతీరింది. జిల్లాస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా ఆ తరవాత దాని విధివిధానాల్లో మార్పులు చేశారు. అయినా క్షేత్రస్థాయిలో తగిన ఫలితాలు కొరవడ్డాయి. ఎన్‌సీబీలో సిబ్బంది లేమివల్ల ఇతర విభాగాల సహాయంతో దాడులు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీసులకు, ఇతర విభాగాలకు సరైన అవగాహన ఉండటం లేదు. ఆ విషయంలో వారికి తగిన శిక్షణ సైతం లభించడం లేదు. ఫలితంగా కొన్ని కేసుల్లో సరైన ఆధారాలను న్యాయస్థానాలకు సమర్పించడంలో ఎన్‌సీబీ విఫలమవుతోంది. దర్యాప్తులోనూ చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Drugs business India
మాదకద్రవ్యాల వ్యాపారం దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ఆందోళన వ్యక్తంచేశారు. యువతరాన్ని నాశనం చేస్తున్న మాదక మహమ్మారిని పూర్తిగా కట్టడి చేయాలంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డీపీఎస్) చట్టాన్ని బలోపేతం చేయడం, దాన్ని అమలు చేసే ఇతర ఏజెన్సీలను పటిష్ఠం చేయడం అవసరమని ప్రభుత్వం తలపోస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, బీఎస్‌ఎఫ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ వంటి వాటితో పాటు సరిహద్దుల్లో పనిచేసే వివిధ దళాలకు, గిరిజన ప్రాంతాలు, దేశంలోని మారుమూల ప్రదేశాల్లో పనిచేసే ప్రత్యేక బలగాలకు మాదక ద్రవ్యాల నియంత్రణ, దాడుల కోసం ప్రత్యేక అధికారాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ ఆలోచిస్తోంది. తద్వారా మత్తుమందుల అక్రమరవాణా, వినియోగాలపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. మరోవైపు భారత్‌లో మాదకద్రవ్యాలపై పోరాటం చేస్తున్న ఏకైక నోడల్ ఏజెన్సీగా ఎన్‌సీబీకి గుర్తింపు ఉంది. మత్తు సంస్కృతిని అడ్డుకునేందుకు ఎన్‌సీబీ ప్రాంతీయ కేంద్రాలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు వెళ్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏపీలో మాదక ముఠాల ఆగడాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా పోటెత్తుతోంది. దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సి ఉంది. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్న స్థానిక నాయకులు- ఎన్‌సీబీ చండీగఢ్ యూనిట్‌ను బలోపేతం చేయాలని కోరుతున్నారు.
ముమ్మరిస్తున్న సవాళ్లు
మాదకద్రవ్యాల ముఠాలు సరకు అక్రమ రవాణాలో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇటీవల విశాఖ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా వివిధ నగరాలకు పెద్దయెత్తున గంజాయి రవాణా కావడం నిఘా వర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో అధికమవుతున్న ఈ తరహా వ్యాపారం ఎన్‌సీబీకి సవాళ్లు విసురుతోంది. ప్రస్తుతం ముంబయి, కోల్‌కతా, ఇండోర్, దిల్లీ, చెన్నై, లఖ్‌నవూ, చండీగఢ్, జమ్మూ, అహ్మదాబాద్, బెంగళూరు, గువాహటి, పట్నాల్లో ఎన్‌సీబీకి ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అతితక్కువ సిబ్బందితో మాదకాసురులను కట్టడిచేయడం ఆ సంస్థకు తలకుమించిన పని అవుతోంది. దాన్ని బలోపేతం చేయాలంటే కొత్తగా మూడు వేల మంది సిబ్బందిని నియమించాలని కేంద్ర హోంశాఖ ఇటీవల ప్రతిపాదించింది. నిధులు, ఇతర మౌలిక సదుపాయాల పరంగా నెలకొన్న సమస్యలనూ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. భావిభారత పౌరులను నిర్వీర్యం చేస్తున్న ఆ మహమ్మారులను నిర్మూలించాలంటే ఎన్‌సీబీని పటిష్ఠపరచాలి. ఆ దిశగా పాలకులు సత్వరం స్పందించకపోతే భవిష్యత్తులో దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
- నాదెళ్ల తిరుపతయ్య