వర్షాకాలం పట్టణభారతానికి పెనుశాపంగా మారుతోంది. చినుకు పడితే చాలు నగరాలు చిత్తడవుతున్నాయి. 2005, 2020 సంవత్సరాల్లో ముంబయి నగరాన్ని ముంచెత్తిన వరదలు నగర వాసులకు మరచిపోలేని పీడకలలను మిగిల్చాయి. 2015 వరద బీభత్సంతో చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలతో హైదరాబాద్‌లోనూ జనజీవనం తరచూ స్తంభించిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు చిన్న పట్టణాలూ వరద ముంపునకు గురవుతున్నాయి. నగరాల్లో ముంపు ప్రదేశాలు క్రమేణా విస్తరిస్తున్నాయి.
అదే ప్రధాన కారణం..
వాతావరణ మార్పులతో పాటు ప్రణాళికారహితంగా శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే ఈ వరదలకు ప్రధాన కారణం. నగరాలు, పట్టణాల్లో చెరువులు, కుంటలు, మురుగునీరు ప్రవహించే నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. వాటిలో వెలసిన జనావాసాలు ఏటా జల దిగ్బంధంలో చిక్కి విలవిలలాడుతున్నాయి. నగర విస్తరణే అభివృద్ధికి సంకేతంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సహజ వనరుల విధ్వంసంతో తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన ఉన్నా, వాటి పరిరక్షణ పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.
నీరుగారుతున్న నివేదికలు
నగరాలకు వరద ముప్పు పోనుపోను పెరుగుతున్నా శాస్త్రీయ వరద నివారణ వ్యూహాలను ప్రభుత్వాలు రూపొందించడం లేదు. వరద విపత్తు నివారణకు, నిర్వహణకు గత పాలకుల ప్రాప్తకాలజ్ఞత, దూరదృష్టి మనకు అనుసరణీయం కావాలి. 1908లో హైదరాబాద్‌లో సంభవించిన వరదల్లో 15 వేల మంది మరణించారు. అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ ఆలీఖాన్ నియమించిన ప్రఖ్యాత ఇంజినీరు విశ్వేశ్వరయ్య వరద ముప్పు నివారణకు పలు సూచనలు చేశారు. వాటి ఆధారంగా మూసీనది కట్ట పరిసరాలను ఉద్యాన వనాలుగా మార్చారు. నగరమంతటా పటిష్ఠమైన భూగర్భ డ్రెయినేజి వ్యవస్థను నిర్మించారు. అది ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. మూసీనది పొంగుకు అడ్డుకట్ట వేయడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ డ్యాంలను నిర్మించారు. పాత డ్రెయినేజి వ్యవస్థ పునరుద్ధరణ, పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతన వ్యవస్థ నిర్మాణం చేపట్టడానికి ప్రజాప్రభుత్వాలు ప్రయత్నించలేదు. ప్రణాళికాబద్ధంగా సాగని పట్టణీకరణ దుష్ఫలితాలు భాగ్యనగరంలో 2000 సంవత్సరంలోనే కనిపించాయి.
భారీ విధ్వంసం..
ఆ ఏడాది ఆగస్టు 24న కురిసిన 240 మి.మీ. వర్షం నగరంలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీనిపై అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీని ఏర్పాటుచేసింది. నాలాలు, చెరువుల ఆక్రమణే వరదలకు ప్రధాన కారణమని కమిటీ గుర్తించింది. నగరంలో పలు చెరువులు అదృశ్యమయ్యాయని, నాలాల వెంట 28 వేల దాకా ఆక్రమణలు ఉన్నాయని నిగ్గుతేల్చింది. చెరువుల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాన్ని నిర్ణయించాలని, నాలాల వెంట బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నగరంలో ఉన్న 1,221 కి.మీ. వరద కాలువలకు వరద ముంపును తట్టుకోగలిగే సామర్థ్యం లేదని, పట్టణీకరణకు అనుగుణంగా డ్రెయినేజి వ్యవస్థను నిర్మించాలని స్పష్టం చేసింది. ఏళ్లు గడిచినా ఈ సూచనలు అమలు కాలేదు. కృష్ణానదీ గర్భంలో, బుడమేరు శిఖం ప్రాంతాలతో విస్తరిస్తున్న జనావాసాలు, కాలువల వెంట ఆక్రమణలు, నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటినప్పుడు ప్రకాశం బ్యారేజిని రక్షించడానికి విడుదల చేస్తున్న నీరు- విజయవాడలో సంభవిస్తున్న వరదలకు ముఖ్య కారణాలని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి. ముంబయి వరదలు సైతం నగర విస్తరణ ప్రణాళికల డొల్లతనాన్ని బహిర్గతం చేశాయి.
నిపుణుల విశ్లేషణ అదే..
2006లో ఏర్పాటైన ముంబయి వరదల నిజ నిర్ధారణ కమిటీ మౌలిక వసతుల కల్పన పేరిట జరుగుతున్న కార్యక్రమాలతో దెబ్బతింటున్న పర్యావరణ సమతౌల్యాన్ని, దాని పర్యవసానాలను వివరించింది. తీరప్రాంతంలో భారీ రహదారులు, మెట్రో ప్రాజెక్టు, మడ అడవుల ఆక్రమణ, వరద నీటిని ఆపగల ఉప్పునీటి కయ్యల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి ముంబయి వరదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించి 2010లో రూపొందిన బృహత్ ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ముంబయి నగర దుస్థితిలో ఎటువంటి మార్పులేదు. 2015లో చెన్నై నగరం అతలాకుతలం కావడానికీ పలు జలవనరులు పూర్తిగా కనుమరుగైపోవడం, వరద ముంపును నిరోధించగల చిత్తడి నేలల పరిమాణం తగ్గిపోవడమే కారణాలని అనేక నివేదికలు వెల్లడించాయి. చెన్నై నగర భౌగోళిక స్వరూపాన్ని సమగ్రంగా పరిశీలించిన జాతీయ తీరప్రాంత పరిశోధన సంస్థ 'సి-ఫ్లోస్' అనే వరద హెచ్చరిక వ్యవస్థకు రూపకల్పన చేసింది. అయిదేళ్లు గడిచినా అది అమలుకు నోచుకోలేదు.
ఆక్రమణలను అరికట్టాలి
నదులు, చెరువులు, నాలాలు, వ్యవసాయ క్షేత్రాలను మింగేస్తూ సాగుతున్న నగరాల విస్తరణకు పరిమితులుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుగా ప్రభుత్వాలు పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలను రూపొందించాలి. ప్రతి నగరంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వరద హెచ్చరిక వ్యవస్థలలో 'డాప్లర్ వెదర్ రాడార్ నెట్‌వర్క్' వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు. దాన్ని మనమూ అందిపుచ్చుకోవాలి. ప్రజల్లో విపత్తులపై అవగాహనను పెంపొందించాలి. చెరువులను, నాలాలను ఆక్రమణల నుంచి రక్షించి పునరుద్ధరించడం అత్యవసరం. పట్టణీకరణ వేగానికి తగినట్టుగా మౌలిక వసతుల కల్పననూ చేపట్టాల్సి ఉంది. పర్యావరణ హితకరమై, సుస్థిరాభివృద్ధి దిశగా సాగినప్పుడే పట్టణీకరణ ప్రయోజనం నెరవేరుతుంది. వరదల వంటి విపత్తులను అధిగమించి నగరాలూ పురోగమన బాటలో సాగుతాయి.
పటిష్ఠ ప్రణాళికలు అవసరం
నదులు, చెరువులు, చిత్తడి నేలలు నగర పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర నిర్వర్తిస్తాయి. సాంఘిక, ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులవుతాయి. నగర విస్తరణే ప్రాధాన్యంగా ప్రణాళికారహితంగా సాగుతున్న పట్టణీకరణ ఈ పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర చెరుపు చేస్తోంది. సహజ వనరుల పరిరక్షణ, శాస్త్రీయ భూవినియోగం, పర్యావరణ హిత సూత్రాల ప్రాతిపదికగా నగర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జరిగితేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ప్రతి నగరం, పట్టణం తన భౌగోళిక స్వరూపం, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా పట్టణీకరణ వ్యూహాలను నిర్దేశించుకోవాల్సిన తరుణమిది.
- పుల్లూరు సుధాకర్ (పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)