కరోనా కల్లోలంతో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులు తారుమారవుతున్నాయి. పేదరిక నిర్మూలన పథకాలతో సాధించిన ప్రగతి అంతా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. 130 కోట్లకు పైబడిన జనాభాతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ మీద ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా ఒక్క 2020లోనే 7.5 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారిపోయారని అమెరికాకు చెందిన ప్యూ పరిశోధన కేంద్రం ప్రకటించింది. అలాగే, రోజుకు రూ.700-1,500 ఆదాయం పొందే మధ్యతరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది అల్పాదాయ వర్గశ్రేణిలోకి పడిపోయారు. రోజుకు రూ.150-700 ఆర్జించే అల్పాదాయ వర్గంలోని 3.5 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువకు వెళ్ళిపోయారు. కరోనా సంక్షోభంతో దేశంలో పేదరికం గణనీయంగా పెరిగిందన్న 'ప్యూ' నివేదిక ఆందోళన రేపుతోంది.
అధికమైన అంతరాలు
దేశంలోని ధనవంతులు, పేదల ఆదాయ వ్యత్యాసాలను కొవిడ్ భారీగా పెంచిందని ఆక్స్‌ఫామ్ నివేదిక స్పష్టంచేసింది. భారత్‌లోని మొదటి వంద మంది సంపన్నుల సంపద నిరుడు మార్చి నుంచి 35 శాతం అంటే రూ.13 లక్షల కోట్ల మేరకు పెరిగింది. దీనికి సమాంతరంగా ఒక్క ఏప్రిల్ 2020లోనే గంటకు 1.70 లక్షల మంది సామాన్యులు తమ ఉపాధిని కోల్పోయారు. మొత్తమ్మీద లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరవాత 12.2 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను పోగొట్టుకున్నారు. దీంతో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నవారు ఉన్నపళంగా పేదరికంలోకి జారిపోయారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) గణాంకాల మేరకు ఏప్రిల్ 2020లో 23.52 శాతంగా నమోదైన నిరుద్యోగిత రేటు డిసెంబరు నాటికి 9.06 శాతానికి తగ్గింది.
లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చాక ఉపాధి అవకాశాలు కొద్దిమేరకు పెరిగినా ప్రైవేటు సంస్థల్లో వేతనాల్లో కోత, పెరిగిన ధరల నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాల్లో తరుగుదలే కనిపిస్తోంది. కరోనాతో దేశంలో పెరిగిన పేదరికం స్థాయుల్ని మదింపు వేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వ్యవస్థాగతమైన ప్రయత్నమేదీ జరగడం లేదు. 'కొవిడ్ వ్యాప్తి ప్రారంభమయ్యాక దేశంలో ఎంతమంది పేదరికంలోకి కూరుకుపోయారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా అధ్యయనం చేసిందా?' అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి 'లేదు' అంటూ ఒక్క మాటలో జవాబు ఇచ్చింది కేంద్రం. కరోనాపై పోరాటంలో భాగంగా పేదలకు సాయం చేయడానికి రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు మాత్రం చెప్పింది. ఎంత మందికి ఎలాంటి లబ్ధి చేకూరిందన్న వివరాలేమీ అందుబాటులో లేవు.
వాస్తవానికి దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో చెప్పే తాజా అధికారిక గణాంకాలేవీ లేవు. 'దేశంలో పేదరికం తగ్గుతోందా?' అన్న ప్రశ్నకు నిరుడు సెప్టెంబరులో కేంద్రం లోక్‌సభలో సమాధానమిస్తూ 2011-12 నాటి జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదికను ఉటంకించింది. దాని ప్రకారం దేశంలో 27 కోట్ల మంది పేదలున్నారని చెప్పింది. 2004-05లో 40.76 కోట్ల మంది పేదలుండేవారని, అప్పటి నుంచి 2011-12 వరకు ఏడాదికి 2.18 శాతం చొప్పున దేశంలో పేదరికం తగ్గుతూ వచ్చిందని పేర్కొంది. అంటే, దేశవ్యాప్తంగా పేదరిక స్థాయుల్ని గణించే సర్వే జరిగి దశాబ్దమవుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనాపై పోరులో భాగంగా ప్రకటించిన ప్యాకేజీలో ఎవరెవరికి ఏ మేరకు సాయం చేయాలో ఎలా నిర్ధారించారు? 2030 నాటికల్లా దేశంలో దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం చెబుతోంది. అసలు ఎంత మంది పేదలున్నారో... వారి జీవన స్థితిగతులేమిటో తెలియనప్పుడు పేదరిక నిర్మూలన ఎలా సాధ్యమవుతుందో పాలకులకే తెలియాలి!
ప్రభుత్వ చేయూత అవసరం
కరోనాతో ప్రభావితులైన పేదలకు సాయం చేయడానికి మే, 2020లో ప్రపంచ బ్యాంకు భారత్‌కు రూ.5,444 కోట్లు అందించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద గుర్తించిన 32 కోట్ల మంది వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా సొమ్ము వేయడానికి ఈ సాయం అక్కరకొచ్చిందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఎంఎస్‌ఎంఐలకు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ కోసం కూడా ప్రపంచ బ్యాంకు ఇంతే మొత్తాన్ని సమకూర్చింది. కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన పేద, దుర్బల కుటుంబాలకు రూ.2,895 కోట్ల మేరకు సాయం అందించడానికి నిరుడు డిసెంబరులో మరోసారి ముందుకొచ్చింది. మరోవైపు... కొవిడ్ సాయం కింద నిరుడు ఏప్రిల్-జూన్ మధ్య పేద మహిళల జన్‌ధన్ ఖాతాల్లోకి నెలకు రూ.500 చొప్పున వేశారు. వివిధ క్షేత్రస్థాయి సమస్యలతో చాలామందికి ఈ సొమ్ము అందే అవకాశం లేదని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కరోనా లాంటి ఉత్పాతాల వేళ ఇలాంటి తాత్కాలిక సాయాలతో పేదల జీవితాల్లో పెద్దగా మార్పులు రావు. ధరలు దిగివచ్చి, ఉపాధి అవకాశాలు పెరిగితే తప్ప ప్రజలకు దీర్ఘకాల లబ్ధి చేకూరదు. అలా జరగాలంటే గడచిన ఏడాదిలో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింతగా చేయూతనివ్వాలి. వ్యవసాయ సమస్యల పరిష్కారం నుంచి స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సమీక్షించి లోపాలను సరిదిద్దడం వరకు అన్ని కోణాల్లో సమగ్ర కృషితో మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది.
- శైలేష్ నిమ్మగడ్డ
ఇదీ చదవండి: 'ఆ శరణార్థులకు కూడు-గూడు ఇవ్వొద్దు'