మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు ఉపయోగిస్తారో తెలియదు కానీ... నాలుగో ప్రపంచ యుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్లు మాత్రమే వాడతారన్నది మహా మేధావి ఐన్‌స్టీన్ సూత్రీకరణ. విపరీత పోకడలతో విస్తరిస్తున్న అణు పోటీని దృష్టిలో పెట్టుకొని ఐన్‌స్టీన్ మహాశయుడు ఆ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పోటీలో అంతిమంగా మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతాడన్న కఠోర వాస్తవాన్నే ఆయన అభిప్రాయం ఆవిష్కరిస్తోంది. మనిషి మీద మనిషి ప్రకటించే యుద్ధాల విషయాన్ని పక్కనపెడితే- గడచిన కొన్ని దశాబ్దాలుగా మానవాళిపై కాలుష్యం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో యుద్ధం సాగిస్తోంది... విరుచుకుపడుతోంది. నిజానికి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల ద్వారా మొత్తంగా జరిగిన నష్టం కన్నా వాయు కాలుష్యంవల్ల కలిగిన విధ్వంసమే చాలా ఎక్కువ!
ప్రపంచానికి కాలుష్యం కలిగిస్తున్న పెను నష్టాన్ని 'లాన్సెట్ జర్నల్' నివేదిక తాజాగా వెల్లడించింది. మరీ ముఖ్యంగా వాయు కాలుష్యంవల్ల నిరుడు భారత స్థూల దేశీయోత్పత్తిలో 1.4శాతం అంటే సుమారు రూ.2.71 లక్షల కోట్లు ఆవిరైపోయినట్లు ఆ అధ్యయనం నిర్ఘాంతపోయే నిజాలు బయటపెట్టింది. మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తున్న ఈ పరిస్థితుల్లో- అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు మనిషి మరో యుద్ధం చేయక తప్పదు. వివేచన, హేతుబద్ధతే ఈ యుద్ధంలో మనిషికి ఆయుధాలు కావాలి!
ఉత్తరాదికి దెబ్బ
పర్యావరణాన్ని ఖాతరు చేయకపోతే విలయం ఎంతలా ఉంటుందో ‘కొవిడ్’ నిరూపించింది. పర్యావరణ సంక్షోభం ప్రజల ఆరోగ్యాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో, ఆర్థిక వ్యవస్థలను ఎలా కుంగదీస్తుందో ‘లాన్సెట్’ తాజా నివేదిక స్పష్టంగా తేల్చి చెప్పింది. నిరుడు భారత్‌లో దాదాపు 17 లక్షల మరణాలకు కాలుష్యం కారణంగా తేల్చిన ఆ నివేదిక- దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో ఈ సంఖ్య 18శాతమని స్పష్టం చేసింది. కాలుష్యపు కోరల్లో చిక్కి, ఆరోగ్యం నలిగి, ఆర్థికం కుంగిన ప్రాంతాల్లో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.
ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా వెనకబాటులో చిక్కి విలవిలలాడుతున్న ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఝార్ఖండ్, దిల్లీ, హరియాణాలే కాలుష్యం బారినపడీ భారీగా మూల్యం చెల్లించుకోవడం గమనంలోకి తీసుకోవాల్సిన విషయం. ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాల్లో వంట అవసరాలకోసం 70శాతానికి పైగా ప్రజలు ఘన ఇంధనాలపై ఆధారపడుతుండటం ఈ ప్రాంతాల్లో వాయు కాలుష్యం మితిమీరడానికి కారణమైంది. అభివృద్ధి, మౌలిక సౌకర్యాల విస్తరణ ప్రాతిపదికన ఇప్పటికే తీవ్ర వెనకబాటును అనుభవిస్తున్న ఈ రాష్ట్రాల్లో కాలుష్యం కారణంగా అసమానతలు పూరించలేని స్థాయికి విస్తరించడం మరో విపత్తు!
ఆరోగ్యం ఛిద్రమై, ఆర్థిక వ్యవస్థ పతనమై దేశ సమగ్రాభివృద్ధికి వాటిల్లుతున్న గణనీయ నష్టాన్ని నివారించాలంటే రాష్ట్రాలవారీగా కాలుష్య నివారణకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుని ముందడుగు వేయడం తప్ప మరో మార్గం లేదు. కొన్నేళ్లుగా కాలుష్యం పెరగడంతో దేశంలో శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం, నరాలు, కంటి వ్యాధులు, అలర్జీలు, బరువు తక్కువ శిశువుల జననం వంటి సమస్యలు ముమ్మరిస్తున్నాయి. వీటి ప్రభావం దేశవ్యాప్తంగా ఉపాధి, ఉద్యోగిత, ఉత్పాదకతపై పడుతోంది.
ఆరోగ్య సమస్యల కారణంగా శ్రామిక శక్తి కుదేలై 23 వేల కోట్ల డాలర్లకుపైగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకంవల్ల ఆరోగ్య సమస్యలు పేట్రేగి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పని దినాల నష్టం జరిగింది. ఈ ఇంధనాలను మండించడం ద్వారా పోటెత్తే వాయు కాలుష్యం భారత ఆర్థిక వ్యవస్థకు జీడీపీలో 5.4శాతం మేర నష్టం కలిగించి ఉంటుందని అంచనా. కాలుష్యం విజృంభిస్తున్న కొద్దీ ఆరోగ్య వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. భారత ప్రభుత్వం 2015లో ప్రతి వ్యక్తిపై చేసిన తలసరి ఆరోగ్య వ్యయం రూ.1008 కాగా, తాజాగా అది రూ.1,944కి చేరింది. ఆరోగ్యంపై ప్రభుత్వాల ఖర్చు పెరగడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా.. గంప లాభం చిల్లి తీసినట్లు ఈ పెరుగుదలకు కాలుష్యం కారణం కావడమే బాధాకరం!
దిద్దుబాటలో...
దేశంలో పది లక్షలకు పైబడి జనాభా ఉన్న 46 నగరాల్లో వాయు కాలుష్యం కట్టడికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.4,400 కోట్లు కేటాయించింది. దేశ విద్యుత్ రంగాన్ని నవీకరించి సౌర, పవన ప్రత్యామ్నాయాలవైపు మరలడమన్నది ప్రభుత్వాల ప్రాథమ్యం కానంతవరకూ వాయు కాలుష్యం కట్టడికి చేసే ప్రయత్నాలేవీ ఫలితాన్ని ఇవ్వవు! కార్చిచ్చులకు, వరదలకు, కరవులకు దేశాల సరిహద్దులతోనూ; ఎవరెవరి బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందన్నదానితోనూ సంబంధం లేదు. గతి తప్పిన పర్యావరణం... మనిషితో సలిపే రణమెప్పుడూ అంతానికే ఆరంభం అవుతుంది. మనిషే ఒక యంత్రంలా మారి, దాన్ని నడిపేందుకు ఇంధన వనరుల అవసరాన్ని నానాటికీ పెంచుకుంటూ, చివరికి తనను తాను కోల్పోయే ఈ స్వయంకృతాపరాధ స్థితిని అధిగమించాలంటే చేసిన తప్పులు దిద్దుకోవాలి. అందుకు ముందుగా తన తప్పులేమిటో తెలుసుకొని వాటిని ఒప్పుకోవాలి. కాలుష్యం విసిరే సవాళ్లకు పరిష్కార మార్గంలో అదే తొలి అడుగు!
- శ్రీదీప్తి