ETV Bharat / opinion

ఇదే నయా రాజకీయం.. ప్రజాసేవకు పరమార్థం!

వారని వీరని కాదు కానీ, రాజకీయ నాయకులెందరో నూటికి నూరుపాళ్లు భయస్తులే! అందులో అనుమానమే లేదు. సప్తవర్ణ సంశోభిత అంగీలను అటకెక్కించి వారంతట వారుగా తెల్లచొక్కాల్లో చిక్కుకుపోయేదెందుకని? పదవులూ ప్రొటోకాల్‌ మర్యాదల కోసమేగా! ఆ భాగ్యం దక్కదేమో, దక్కినా నిలబడదేమో అన్న భయంతో లోలోపల వారెంతగా వణికిపోతుంటారో ఎవరికి తెలుసు! పేరుగొప్ప పార్టీలో పచ్చిపులుసుతో సరిపెట్టుకునే కంటే- పక్కపార్టీలో 'పెద్దపీట' మీద బాసింపట్టు వేసుకొని పాయసం తాగడమెంత సుఖం?

politicophobia
పొలిటికోఫోబియా
author img

By

Published : Jul 23, 2021, 7:16 AM IST

రుతువుకోమారు రౌద్రావతారం దాల్చే రాహులు కుమారప్రభువులకు మళ్ళీ పట్టలేనంత కోపమొచ్చింది. పార్టీలోంచి పోయినవాళ్లందరూ పిరికిపందలేనని పటపటా పళ్లు కొరికి.. ఉన్నవాళ్లలో ఎవరైనా జడుపు జ్వర బాధితులుంటే బయటికి పొమ్మని బల్లగుద్దేశారు! 'భళి భళి భళి రా భళి సాహోరే రాహుబలి జై హారతి నీకే పట్టాలి' అన్నంతగా వంధిమాగధులు స్తోత్ర గీతాలాపనలూ ఆరంభించేశారు. భయమో భక్తో ఏదో ఒకటి లేకుండా ఎవరూ ఎక్కడా ఎదగలేరన్న వాస్తవం యువరాజులుంగారికి తెలియదు కాబోలు- గోడ మీద పిల్లులన్నీ భయంగల బల్లులేనని తీర్మానించేశారు. అయ్యవారికి అంత ధైర్యమే ఉంటే అధ్యక్షులై రాజకీయ సమరాంగణంలో అరిభంజకులై విజృంభించవచ్చు కదా అని సగటు కార్యకర్త గొణుక్కుంటున్న విషయమూ ఆయనకు తెలిసే అవకాశం లేదు. కనీసం లోక్‌సభలోనైనా పార్టీ పగ్గాలు చేతబూని ప్రత్యర్థులపై లంఘించవయ్యా స్వామీ అన్నా- వెన్ను తప్ప దమ్ము చూపి దన్నుగా నిలబడని పెద్దమనిషి వెరపు గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడటమే మరో ప్రపంచ వింత అన్నది పార్టీ ప్రముఖుల మనసులో మాట!

రాజకీయ లౌక్యం..

వారని వీరని కాదు కానీ, రాజకీయ నాయకులెందరో నూటికి నూరుపాళ్లు భయస్తులే! అందులో అనుమానమే లేదు. సప్తవర్ణ సంశోభిత అంగీలను అటకెక్కించి వారంతట వారుగా తెల్లచొక్కాల్లో చిక్కుకుపోయేదెందుకని? పదవులూ ప్రొటోకాల్‌ మర్యాదల కోసమేగా! ఆ భాగ్యం దక్కదేమో, దక్కినా నిలబడదేమో అన్న భయంతో లోలోపల వారెంతగా వణికిపోతుంటారో ఎవరికి తెలుసు! పేరుగొప్ప పార్టీలో పచ్చిపులుసుతో సరిపెట్టుకునే కంటే- పక్కపార్టీలో 'పెద్దపీట' మీద బాసింపట్టు వేసుకొని పాయసం తాగడమెంత సుఖం? ఈమాత్రం రాజకీయ లౌక్యాన్ని సైతం అర్థం చేసుకోకుండా ఆవేశపడితే, ఆ ఆయాసం తాలూకు అలసట తీర్చుకోవడానికి ఏ విదేశీయానమో చేయాల్సి వస్తుంది రాహుల్‌ వర్యా! స్వదేశంలో పరిశ్రమించాల్సినప్పుడు పరదేశంలో విశ్రమించడం మా సారుకు మాబాగా అలవాటేనంటూ మీ అభిమానులు అసలే వైరాగ్యపూరిత విషణ్నవదనాలతో ఆక్రందనలు చేస్తున్నారు. మాసానికో మారు మీరు ఇటువంటి ఆగ్రహ ప్రదర్శన చేయడమెందుకు? పునర్దర్శనానుగ్రహ భాగ్యం కోసం అంతేవాసులు అల్లాడిపోయేలా రోజుల తరబడి మాయమై పోవడమెందుకు? యువరాజులు పెద్దమనసుతో ఆలోచించి తమను తరింపజేస్తారని అస్మదీయులందరూ ఆశపడుతున్నారు మహాశయా.. కాస్త కనికరించండి వాళ్లను!

బకాసురుడి బామ్మర్దులై..

తూటాలకు ఎదుర్రొమ్ము చూపించేంత దమ్మున్న రాజకీయాలు చేయడానికి నేటి నేతలేమైనా ఇళ్లూ వాకిళ్లూ వదులుకుని ప్రజాసేవ చేస్తున్నారా ఏమిటి? స్వాతంత్య్రోద్యమ రోజుల్లో అంటే- ఆ నాయకులేదో ఆస్తిపాస్తులన్నింటినీ దేశానికి రాసిచ్చి ప్రజలూ ప్రజలూ అంటూ పరితపించిపోయారు. ఇప్పుడసలు కాసుల కోసం, వ్యాపారాలకు రక్షణ కోసమేగా నూటికి తొంభై అయిదు మంది ప్రజాసేవకులుగా అవతరిస్తోంది! కోట్లు గుమ్మరించి ఓట్లు కొనుక్కున్నాక పెట్టుబడికి తగ్గ లాభాలను రాబట్టుకోవడానికి చిలక్కొట్టుడు ఏం ఖర్మ.. ఏకంగా బకాసురుడి బామ్మర్దులై నిధులను నంజుకు తినేస్తారు. వీళ్ల మృష్టాన్న భోజనాల ఆరగింపును వెయ్యికళ్లతో కనిపెడుతూ ఉండే పెద్దలు కొందరు సమయం వచ్చినప్పుడు లెక్కలన్నీ బయటికి తీసి 'ఏం చేద్దామంటావ్‌ మరి' అంటూ ముసిముసి నవ్వులు రువ్వుతారు. దెబ్బకు దడుపు దెయ్యం పట్టేస్తుంది! పార్టీ మారితే పరువు నిలబడటమే కాదు, ఇంకొన్ని కాసులమూటలు వెనకేసుకోవచ్చన్న జ్ఞానోదయమై.. ఓ శుభమూహర్తంలో కండువా మార్చేస్తారు. ఆ తరవాత అన్నీ 'శుభాలే'- ఇదే నయా రాజకీయం, ఇదే కదా ప్రజాసేవకు పరమార్థం! ఈ విషయాలేమీ ఆలోచించకుండా జడుసుకునే వాళ్లు జంపైపోండి అంటే పార్టీలో మిగిలేది ఎవరంట?

పెండింగ్​లోనే కేసులు..

పదవుల్లో ఉన్న, లేని నేతాశ్రీల మీద యావద్భారతంలో 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నిరుడు బయటపడిందా లేదా? వాటిలో కొన్ని అయితే ఏకంగా జీవితఖైదు పడేంత పెద్ద కేసులు. ప్రజాజీవితంలో తీపిగుర్తులుగా వీటిని సంపాదించుకున్నప్పుడు.. ఎప్పుడు ఏ పెద్దలకు కోపం వచ్చి శ్రీకృష్ణజన్మస్థాన సందర్శన భాగ్యం కలుగుతుందోనన్న భయం ఉండదా ఏమిటి నాయకరత్నాలకు? సందర్భానికి తగిన సామ దాన భేద దండోపాయాలతో ప్రత్యర్థి ప్రభువులు చెలరేగిపోతున్నప్పుడు పాపం వీళ్లందరూ ఎక్కిళ్లు పడకుండా ఉంటారా? కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపం అన్నట్టు సొంతపార్టీకి టోపీ పెట్టడం భయమవుతుందా, బతకనేర్చినతనమవుతుందా? రాహుల్‌ బాబుకు ఈ విషయాలేవీ తెలియదని కాదు కానీ, తెలియనట్టు ఆశ్చర్యపోతూ ఆవేశపడతారంతే!

పొలిటికోఫోబియా..

నోరుతిరగని పేర్లు పెట్టేసుకున్న బోలెడు జబ్బులన్నీ గుంపులు గుంపులుగా మీదపడిపోతున్నాయి కదా ఇప్పుడు.. వీటితో పోలిస్తే పాతదే 'పొలిటికోఫోబియా' అని ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతోంది! రాజకీయ నేతల భయాల సంగతేమో కానీ.. సేవచేస్తామంటూ వరస కట్టే తెల్లచొక్కాలను చూసి జడుసుకునే జనాలే ఈ ఫోబియా బాధితులు! అయినా.. ప్రజల్లో ఆ మాత్రం భయమంటూ లేకపోతే రాజకీయాల రంగు వెలిసిపోదూ! కాబట్టి.. నేతలను చూసి సామాన్యులు భయపడతారు. అసామాన్యులను తలచుకుని నేతలు దడుచుకొంటారు.

అందరినీ కలిసి ఆ పైవాళ్లు ఆడిస్తూ ఉంటారు. తెర మీద బొమ్మలు తప్ప సూత్రధారులు కనిపించని రాజకీయ ఆటల్లో నాయకుల భయమైనా భక్తయినా అవసరార్థమేనంటే కాదనేవారెవరు?

- సత్యభారతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.