రామలక్ష్మణుల సంరక్షణలో విశ్వామిత్రుడి యాగం సలక్షణంగా సాగుతోంది. అంతలోనే దూసుకొచ్చారు మారీచ సుబాహులు. క్రతువును భగ్నం చేయాలని చూశారు. రాముడు గమనించాడు. వాయువ్యాస్త్రాన్ని సంధించాడు. 'మారీచు వక్షమునందూసిన మారుతాస్త్రమున రక్షస్సొక్క నూరామడల్ భ్రమితుండై చని సాగరంబున బడెన్ బారుష్య వేగంబునన్' అన్నారు విశ్వనాథ. రాముడి బాణం దెబ్బకు నూరామడల దూరాన సముద్రంలో పడ్డాడట. నిజానికి మారీచుడి గుండెల్లో రాముడు నాటింది బాణాన్ని కాదు- అంతులేని భయాన్ని! గాయానిదేముంది... ఆకు పసరుతో మరికొన్నాళ్లకు మాసిపోయుంటుంది. మరి భయమో! ఆమరణాంతం గుండెల్లో నిలిచిపోయింది. అనుక్షణం రాక్షసుణ్ని దహించింది. 'రకారాదీని నామాని...' రాముడి పేరు కూడా కాదు, రకారంతో మొదలయ్యే రత్నం రథం... వంటి పదాలు చెవిన పడినా చాలు- మారీచుడికి చెమటలు పట్టేవి. వణికిపోయేవాడు. చితి ఒక్కసారే దహిస్తుంది. చింత నిరంతరం అలా కాలుస్తూనే ఉంటుంది. భయమూ అలాంటిదే.
కాలగర్భంలో కనుమరుగవుతున్న కరోనా నామ సంవత్సరం సరిగ్గా మారీచుడి అనుభవాన్నే మనిషికి రుచి చూపించింది. ప్రపంచాన్ని గడగడలాడించింది. కపివీరులు భీకరంగా పోరాడుతుండగా అకస్మాత్తుగా అంతర్ధానమయ్యాడు ఇంద్రజిత్తు. బాణవర్షం కురిపించాడు. 'కన్ను కన్ను పొడుచుకొన్న కానిపింపనట్టుల ఆసన్నమైన అంధకార చయము క్రమ్మచేసి' వానర వీరులను భయకంపితుల్ని చేశాడు. మనిషికి ఆ అనుభవాన్నీ చవిచూపించింది కరోనా. గుర్తించిన నాటినుంచీ యుద్ధం సాగుతూనే ఉంది- కనపడని శత్రువుతో! భయం మా చెడ్డది. చాలామందిని మానసికంగా వృద్ధుల్ని(మెంటల్లీ ఓల్డ్) చేసింది. పది నెలల వ్యవధిలోనే పదేళ్ల వయసొచ్చి మీద పడింది.
ఇన్నాళ్లూ మనిషి తన మరణానంతర జీవితం గురించే మథనపడుతూ వచ్చాడు. 'అసలు మరణానికి ముందు నీవు జీవించే ఉన్నావా?' అనే ప్రశ్నను 2020 మన ముందుకు తెచ్చింది. 'భయం అంతమైన చోటు నుంచే జీవితం ఆరంభమవుతుంది' అన్న ఓషో హితవచనం నేపథ్యంగా ఆ ప్రశ్నను విశ్లేషించుకోవాలి. 'కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి! జిహ్వకున్ వంటకమించునే... కంటకుడైన శాత్రవుడు ఒకండు తనంతటివాడు కల్గినన్' అని అడిగాడు శ్రీనాథుడు. ఈ కొత్త శత్రువు సమానుడు కాడు సరికదా, మనిషికంటే ఎన్నోరెట్ల బలవంతుడు. పైగా ఒక తల తెగితే మరో తల మొలుచుకొచ్చే దశకంఠుడిలా కరోనాకు సరికొత్త పిలకలు మొలుచుకొస్తున్నాయి. లోకాన్ని కలవరపెడుతున్నాయి. ఈ దశలో మనం జయించవలసింది భయాన్ని! ఓషో సమాధిపై రెండు తేదీలు కనిపిస్తాయి. అవి కాదు మనకు ముఖ్యం- దానిపై 'ఓషో జన్మించనూ లేదు, మరణించనూ లేదు... ఆ తేదీల మధ్యలో ఈ లోకాన్ని సందర్శించాడు' అన్న రాతలు జీర్ణం కావాలి. పరీక్షిత్తు కథలో భాగవతం బోధించిన పరమ సత్యమదే! రెండో అధ్యాయంలో భగవద్గీత ఉపదేశించిన 'వాసాంసి జీర్ణాని...' శ్లోకానికి తాత్పర్యమూ అదే. అంతెందుకు- 'మృత్యువు ఊసుతెచ్చి భయపెట్టకండి నన్ను... కాలరహస్యం తెలిసినవాణ్ని కాలుడికి భయపడతానా?' అంటూ ఆచార్య గోపి ఆలపించిన 'నిర్భయగీతి' అర్థమైనా చాలు! కరోనా వస్తుందేమోనని కాదు, వస్తే ఏమవుతుందోనన్న భయమే జనాన్ని ఎక్కువ పీడించింది. కాబట్టి టీకా కన్నా అవగాహనే మంచి మందు. 'వెస అసాధ్యుండని వెరవక నరకుని నరకెదో పార్వేట నరికినట్లు' అని కాసుల పురుషోత్తమ కవి చెప్పినట్లు శాస్త్రజ్ఞుల అవిశ్రాంత పోరాటం కరోనాసురుని మట్టుపెట్టే తీరుతుంది. ఈలోగా తగు జాగ్రత్తలు పాటిస్తూ భయవిహ్వలత నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం... కొత్త సంవత్సరాన్ని కాలగతిలో మేలిమలుపుగా మారుద్దాం!