భూతలస్వర్గమైన కశ్మీరాన్ని ఉగ్రవాద భూతానికి ఎరవేసిన పాకిస్థాన్ పాపాల చిట్టా ప్రపంచమంతటికీ తెలుసు! దాదాపు నలభై ముష్కర మూకలకు చెందిన 30-40 వేల మంది తమ ఆశ్రయంలో ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖానే స్వయంగా రెండేళ్ల క్రితం అంగీకరించారు. కశ్మీర్, అఫ్గానిస్థాన్‌ల్లో రక్తపుటేళ్లు పారించేందుకు వారంతా ఉగ్ర శిక్షణ పొందినట్లు వెల్లడించారు. అటువంటి 'ఘనచరిత్ర' కలిగిన పాక్ ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు తర్ఫీదునిస్తోందంటూ ఇండియాపై అవాకులు చెవాకులు పేలుతోంది! కశ్మీర్‌లో మానవ హక్కులు మంటగలిసి పోతున్నాయంటూ మొసలికన్నీళ్లు కారుస్తోంది. ఆ మేరకు 131 పుటల వివరణ పత్రాన్ని పాక్ తాజాగా వండివార్చింది. బలూచిస్థాన్ ప్రజలు, దేశీయంగా ప్రగతిశీల పౌరులపై ఉక్కుపాదం మోపుతున్న పాకిస్థాన్- మానవ హక్కుల గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే! ఐరాస వేదికగా కశ్మీర్‌పై ఇలాగే గుండెలు బాదుకొన్న పాక్‌కు ఇటీవల ఇండియా గట్టిగానే బదులిచ్చింది.
భారతదేశంలో జమ్మూకశ్మీర్ విడదీయలేని అంతర్భాగమని స్పష్టంచేసింది. అయినా కుక్కతోక వంకరన్నట్లు పాక్ మళ్ళీ అదే పాతపాట పాడింది. తన చేతుల్లోని తాలిబన్ తోలుబొమ్మలను అఫ్గాన్ పీఠంపై పునఃప్రతిష్ఠించడంలో సఫలీకృతమయ్యాక- కశ్మీర్‌పై పాకిస్థాన్ కుట్రలు ముమ్మరించాయి. తాలిబన్ల తోడ్పాటుతో తమ ప్రణాళికలను పట్టాలెక్కించడం ఖాయమని అక్కడి నేతాగణాలు బహిరంగంగానే నోరు పారేసుకొంటున్నాయి. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కాందహార్‌లో తిష్ఠవేసి తాలిబన్లతో చర్చలు జరిపినట్లు వార్తలూ వెలువడ్డాయి. మొదట మధ్య ఆసియా, ఆ తరవాత ఇండియాపై తన పడగనీడను పరచడానికి ఐఎస్‌ఐఎస్-ఖొరసాన్ సైతం కాచుకుని కూర్చున్నట్లు రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల విజయంతో ఇతరేతర ఉగ్రబృందాలూ పేట్రేగడం ఖాయమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. భారత్‌పై విషం కక్కడంలో ముందుండే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ మూకలూ ఇటీవల క్రియాశీలమయ్యాయి. చైనా దన్నుతో ధూర్త దాయాది ఆడుతున్న కపట నాటకాలను అంతర్జాతీయంగా ఎండగడుతూనే- సరిహద్దులను శత్రుదుర్భేద్యం చేసుకోవడంపై ఇండియా దృష్టి సారించాలి. నిద్రాణ ఉగ్రశక్తులను కలుగుల్లోంచి బయటికి లాగేలా ఆసేతుహిమాచలం నిఘా యంత్రాంగాన్ని పటిష్ఠీకరించాలి!
ఉగ్ర తండాలకు కర్మభూమిగా అఫ్గాన్ గడ్డ అక్కరకు రాకూడదని బ్రిక్స్ దేశాల తాజా సదస్సు పిలుపిచ్చింది. ఆ దేశ పాలనావ్యవస్థలో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యం దక్కాలని ఇండియా, ఆస్ట్రేలియా '2+2 సమావేశం' అభిలషించింది. తద్భిన్నంగా రక్తం రుచిమరిగిన హంతకులు, పేరుమోసిన నేరగాళ్లతో కొలువుతీరిన తాలిబన్ మంత్రివర్గంపై స్థానికంగానే ఆందోళనలు రేగుతున్నాయి. మహిళలు, అల్పసంఖ్యాక జనసమూహాలపై అరాచక మూకలు సాగిస్తున్న దమనకాండ దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. తాలిబన్ల ఏలుబడిని స్వాగతించిన చైనా మాత్రం వారికి ఆర్థికసాయం చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా డ్రాగన్ కంట్లో నలుసులైన 'ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్'(ఈటీఐఎం) ఉగ్రవాదులపై తాలిబన్లు కన్నెర్రజేస్తున్నట్లుగా కథనాలు వెలుగుచూస్తున్నాయి. పాక్, తాలిబన్లకు అండదండలందిస్తూ మధ్య, దక్షిణాసియాలపై తన భల్లూకం పట్టును విస్తరించాలని చైనా తలపోస్తోంది. ఇటీవలి కాలంలో ఇండియాకు కాస్త దూరమైన రష్యా, ఇరాన్‌లు బయటకు ఏమి చెబుతున్నా- స్వప్రయోజనాల లెక్కలేసుకొంటూ గుంభనంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలపై సమాలోచనలు జరుపుతున్న క్వాడ్ దేశాలు- ఉగ్రవాదంపై సమష్టి పోరు కొనసాగాలని ఆశిస్తున్నాయి. కశ్మీర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తాలిబన్లను నిలువరించేలా భారత్ చర్చలు జరపాలనే వాదనలు వినిపిస్తున్నాయి. చుట్టూ ముసురుకొంటున్న ముప్పు మేఘాలు చెదిరిపోయేలా మిత్రదేశాల మద్దతుతో ఆ మేరకు ఇండియా తన ప్రయత్నాలను కొనసాగించాలి. దేశభద్రతపై రాజీలేని వైఖరితో కేంద్రం అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది!
ఇవీ చదవండి: