భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ, విమర్శల పట్ల సహనం వహిస్తూ సత్యసంధత, త్యాగనిరతి, నిజాయతీలతో ప్రజాసేవ చేయడమే ప్రజాప్రతినిధుల పేరుప్రతిష్ఠలకు గీటురాయి అన్న తొలి లోక్‌సభాపతి జి.వి.మవులంకర్ మాటలు మేలిమి ముత్యాలు! జనావళి జీవన ప్రమాణాల వృద్ధికి ఉత్ప్రేరకాలయ్యేలా పార్లమెంటరీ చర్చల్లో నిర్భీతితో నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించాలన్న ఆ రాజనీతిజ్ఞుడి సూచనలు- చట్టసభల సభ్యులకు శిరోధార్యాలు.
విపక్షాలు సన్నద్ధం..
నేటి నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులందరికీ జన సంక్షేమమే ప్రాధాన్యాంశం కావాలన్నది ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్ష! మహమ్మారి మలివిడత విజృంభణతో దేశమంతా నీరసించిపోయిన తరుణంలో కొలువుతీరుతున్న ఉభయసభలు- వాడివేడి చర్చలకు వేదికలు కాబోతున్నాయి. పెట్రో ఉత్పత్తులు, నిత్యావసరాల ధరాఘాతాలతో సామాన్యుల సంసారాలన్నీ సంక్షోభ సాగరాలవుతున్న దురవస్థను దునుమాడుతూ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడానికి విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల నియంత్రణ, సరిహద్దుల్లో చైనాతో సంఘర్షణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, అన్నదాతల నిర్విరామ నిరసన వ్రతం, కరోనా కట్టడిలో వ్యూహరాహిత్యాదులపైనా అధికారపక్షాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు తలపోస్తున్నాయి.
కంకణబద్ధులు కావాలని..
ఆరోగ్యకర, అర్థవంతమైన చర్చలకు అందరూ కంకణబద్ధులు కావాలని అఖిలపక్ష సమావేశంలో ఆకాంక్షించిన ప్రధాని మోదీ- పార్లమెంటరీ నియమాలకు అనుగుణంగా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. విపక్షాలకు దీటుగా బదులిచ్చేలా పార్లమెంటుకు సర్వసన్నద్ధమై రావాలని మంత్రివర్గ సహచరులకు ఇప్పటికే ఆయన సూచించారు. సాగుచట్టాలపై తమ అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూ పార్లమెంటు భవనం వరకు ప్రదర్శనలు నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. ఉభయసభల లోపలా వెలుపలా ఉద్విగ్నభరిత సన్నివేశాలకు ప్రస్ఫుట సంకేతాలు వెలువడుతున్న తరుణంలో పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు 17 కొత్త బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి కేంద్రం కసరత్తు పూర్తిచేసింది. సభాసదుల కూలంకష పరిశీలన, విస్తృత చర్చల అనంతరం వాటిని చట్టాలుగా తీర్చిదిద్దితేనే 'ప్రజాస్వామ్య దేవాలయ' కీర్తికేతనం రెపరెపలాడుతుంది!
మానవ అక్రమ రవాణాపై..
తాజా సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న విద్యుచ్ఛక్తి (సవరణ) బిల్లును అఖిల భారత విద్యుత్తు ఇంజినీర్ల సమాఖ్య తూర్పారపడుతోంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటుపరం చేసే ఈ ప్రయత్నంతో రాష్ట్రాల డిస్కమ్‌లు దివాలా తీస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తోంది. సాగుదారుల ప్రయోజనాలూ దీంతో సమాధి అవుతాయని రైతులోకమూ ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు సైతం అదే స్థాయిలో వివాదాస్పదమవుతోంది. వీటికి భిన్నంగా మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి ఉద్దేశించిన బిల్లుకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని పౌరసమాజం ఆశిస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆరేళ్ల క్రితమే కొట్టేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ఇంకా కేసులు నమోదవుతుండటం, దుర్వినియోగమవుతున్న రాజద్రోహం నిబంధనపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వమెలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో చట్టాలను పట్టాలెక్కించాల్సిందిపోయి ఆర్డినెన్సులపై అలవిమాలిన ఆపేక్ష ప్రదర్శిస్తోందన్న విమర్శలు కొన్నేళ్లుగా కేంద్రంపై వర్షిస్తూనే ఉన్నాయి.
వివాదాస్పద బిల్లులనూ..
చట్టాల రూపకల్పనలో స్థాయీసంఘాలు పోషించగల కీలకపాత్రను విస్మరిస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. 14, 15వ లోక్‌సభలలో 60, 71 శాతాల చొప్పున స్థాయీసంఘాల పరిశీలనకు వెళ్ళిన బిల్లులు, 16వ లోక్‌సభలో 30 శాతానికి లోపే పరిమితమయ్యాయి! 17వ లోక్‌సభలోనూ అదే సరళి సాగుతోందంటున్న విపక్షాలు- వివాదాస్పద బిల్లులను ఆ సంఘాలకు తప్పనిసరిగా నివేదించాలని కోరుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య సౌధానికి పునాదిరాళ్ల వంటి పార్లమెంటరీ సంప్రదాయాలకు అధికారపక్షం ఎత్తుపీట వేయాలి. ప్రజోపయోగ అంశాల్లో ప్రభుత్వంతో ప్రతిపక్షాలూ భుజం కలపాలి. యావద్భారతాన్నీ వెలుగుబాట పట్టించడానికి పార్లమెంటు సాక్షిగా అన్ని పక్షాలూ దీక్షాదక్షతలు కనబరచాలి!