Opportunities in space industry: చంద్రుడిపై మానవుడు కాలుమోపి 50 ఏళ్లకు పైనే అయింది. అప్పటినుంచి రోదసిలో మానవ కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. నేడు భూకక్ష్యలో 80కి పైగా దేశాల ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోనుపోను దేశాల ఆర్థికాభివృద్ధికి, సామాజిక సంబంధాలకు అంతరిక్ష కార్యకలాపాలు కీలక సాధనాలుగా మారాయి. ఈ రంగంలో పూర్తిగా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టడం కష్టమవుతున్నందువల్ల, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచారు. అంతరిక్ష శాస్త్ర సాంకేతికతల అభివృద్ధిలో ప్రైవేటు రంగ పాత్రను పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారత అంతరిక్ష సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంఘం ఛత్రం కింద రోదసి కార్యకలాపాల్లో ప్రైవేటు పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.
Space industry in India
ప్రైవేటు సంస్థలు అంతరిక్ష పర్యాటకాన్ని, రోదసిలో పారిశ్రామిక ఉత్పత్తిని చేపట్టే రోజు ఎంతో దూరంలో లేదు. గ్రహశకలాల నుంచి ఖనిజ వనరులను తవ్వితీసి భూమికి తీసుకురావడానికి ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి. ప్రస్తుతం 35,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష పరిశ్రమ పరిమాణం 2040నాటికి లక్ష కోట్ల డాలర్లకు పెరుగుతుందని మోర్గన్ స్టాన్లీ సంస్థ అంచనా. ఏరియన్ స్పేస్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేటు సంస్థలు చేపడుతున్న ప్రయోగాలు, నవకల్పనలు భూకక్ష్యలోకి రాకెట్ల ప్రయోగ ఖర్చులను తగ్గించబోతున్నాయి. భారత్‌లో ప్రైవేటు కంపెనీలు ఇప్పటిదాకా ప్రభుత్వ అంతరిక్ష కార్యక్రమానికి వస్తుసేవలను అందించడానికి పరిమితమయ్యాయి. ఉపగ్రహ ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాత్రమే చేపడుతోంది. ఈ పరిస్థితిని మార్చి ప్రైవేటు రోదసి సంస్థలకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.
Space industry market size
నేడు భారతదేశ అంతరిక్ష కార్యక్రమం రక్షణ రంగంతోపాటు ఖనిజవనరుల అన్వేషణకు, వాతావరణ పరిశోధనలు, కమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, బ్రాడ్ బ్యాండ్ సేవలు, ఉపగ్రహ ఇంటర్నెట్, అంతరిక్ష అన్వేషణకు తోడ్పడుతోంది. ఇప్పటిదాకా ఇస్రో నిర్వహిస్తున్న రోదసి కార్యకలాపాల్లో ఇకపై దశలవారీగా ప్రైవేటు సంస్థలనూ ప్రోత్సహించాలని, వాటికి ఇస్రో సేవలను, సౌకర్యాలను ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగానికి సాంకేతికతను బదిలీ చేసి చిన్న ఉపగ్రహ ప్రయోగ రాకెట్లను, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్వీ) రాకెట్లను పెద్దయెత్తున ఉత్పత్తి చేయించాలని కేంద్రం తీర్మానించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) అందుకు తోడ్పడుతుందని 2019 బడ్జెట్ సమావేశాల సమయంలో పేర్కొంది. ఏక గవాక్ష పద్ధతిలో అన్ని అనుమతులను ఇవ్వడానికి భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, ధ్రువీకరణ కేంద్రాన్ని స్థాపించాలని 2020లో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అది ఇస్రోకు, ప్రైవేటు రోదసి సంస్థలకు మధ్య అనుసంధానం నెరపుతుంది.
Private space companies in India
ఈ ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్, చెన్నైకి చెందిన అగ్నికుల్, బెంగళూరుకు చెందిన పిక్సెల్ అంకుర సంస్థలు ఇస్రోతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. అంతరిక్ష రాకెట్ల రూపకల్పన, పరీక్షలకు స్కైరూట్, అగ్నికుల్ సంస్థలు ఇస్రో సౌకర్యాలను, సాంకేతిక సహాయాన్ని తీసుకుంటాయి. స్కైరూట్ ప్రస్తుతానికి ఉపగ్రహ ప్రయోగ రాకెట్ల రూపకల్పనలో నిమగ్నమైనప్పటికీ, భవిష్యత్తులో మానవులను రోదసిలోకి పంపడానికీ సిద్ధమంటోంది. ఈ సంస్థ రెండేళ్ల నుంచి విక్రమ్ రాకెట్ల రూపకల్పనలో నిమగ్నమైంది. అగ్నికుల్ 2016లో మద్రాస్ ఐఐటీలో స్థాపితమైన అంకుర సంస్థ. 100 కిలోల బరువైన ఉపగ్రహాలను భూమి ఉపరితలానికి 700 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రయోగించడానికి ఈ సంస్థ చిన్న రాకెట్లను రూపొందిస్తోంది. బెంగళూరుకు చెందిన పిక్సెల్ 30 సూక్ష్మ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాలు 24 గంటలూ పంపే సమాచారం వాతావరణం, వ్యవసాయం, సరకుల రవాణా వంటి రంగాలకు ఉపకరిస్తుంది.
Satellite uses
ఉపగ్రహాలు భూమిపై సాగవుతున్న భూముల గురించి, వాటిలోని పంటల గురించి సునిశిత చిత్రాలను, ఇతర సమాచారాన్ని పంపగలవు. వాటి ఆధారంగా ఏయే పంటల విస్తీర్ణం పెంచాలి, వేటిని తగ్గించాలి, వ్యవసాయంలో దిగుబడులు పెంచడమెలా ఇటువంటి అంశాలపై విధానకర్తలు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుంది. ఉపగ్రహాలు పంపే భూ చిత్రాలు సరిహద్దు భద్రతకు, దేశంలో నేరాల నియంత్రణకు ఉపయోగపడతాయి. టోల్‌గేట్ల వద్ద వాహనాలను ఆపకుండానే రుసుములు వసూలు చేయడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయి. ప్రస్తుతం భూమిపై నుంచి నియంత్రిస్తున్న కార్యకలాపాలన్నింటినీ రాబోయే రోజుల్లో ఉపగ్రహాలతో నియంత్రించవచ్చు. టెలీకమ్యూనికేషన్ల రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశం వినియోగదారులకు ఎన్నో సౌలభ్యాలను అందుబాటులోకి తెచ్చింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు ప్రవేశంసైతం సాధారణ ప్రజలకు విలువైన సేవలను అందించడానికి దారితీస్తుంది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తే అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో భారత్ వాటాను ఇప్పుడున్న రెండు శాతం నుంచి 10 శాతానికి పెంచడం సాధ్యమే. వాణిజ్య రాకెట్ ప్రయోగాల మార్కెట్లో పైచేయి సాధించడానికి బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలతో చైనా అంకుర సంస్థలు పోటీపడుతున్నాయి. వాటికి దీటుగా మార్కెట్ వాటాను సాధించే సత్తా భారతదేశానికీ ఉంది. చిన్నాపెద్ద రాకెట్లను రూపొందించి, చవకగా ఉత్పత్తి చేస్తే ఇతర దేశాలకోసం వాటిని ప్రయోగించవచ్చు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ పెంచితే, రాబోయే రోజుల్లో వారు రోదసి రంగంలో భారత్‌ను విజేతగా నిలపగలుగుతారు.
ఎన్నో సానుకూలతలు
ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం 36,000 కోట్ల డాలర్లకు చేరిందని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ లెక్కగట్టింది. అందులో భారత్ వాటా కేవలం రెండు శాతమే(720 కోట్ల డాలర్లు). చంద్రయాన్, మంగళ్‌యాన్‌లను విజయవంతంగా నిర్వహించి గగన్‌యాన్‌కు సన్నద్ధమవుతున్న భారత్- ఇంతకన్నా చాలా ఎక్కువ వాటాను సంపాదించాలి. వచ్చే అయిదేళ్లలో 48శాతం సమ్మిళిత వార్షిక వృద్ధిరేటును సాధించినట్లయితే అంతరిక్ష మార్కెట్లో తన వాటాను 5,000 కోట్ల డాలర్లకు పెంచుకోవచ్చు. నిపుణ మానవ వనరులు, ఐటీ సత్తా, తక్కువ ఖర్చుకే అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సౌలభ్యం, ఇతర దేశాలకన్నా చౌకగా పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టే వెసులుబాటు- ఇండియాకు ఉన్న సానుకూల అంశాలు. అదీకాకుండా ఉపగ్రహ సేవలకు స్వదేశంలోనే ఎంతో గిరాకీ ఉంది. ఈ మార్కెట్‌ను ఉపయోగించుకుంటే భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ఆకాశమే హద్దుగా పురోగమించగలుగుతాయి.
-డాక్టర్ కె.బాలాజీ రెడ్డి (రచయిత- సాంకేతిక విద్యారంగ నిపుణులు)