ETV Bharat / opinion

ఉష్ణగుండంలా భూగోళం- హడలెత్తిస్తున్న వాతావరణ మార్పులు - causes of melting glaciers

వాతావరణ మార్పులను నివారించడానికి సమయం మించిపోయినా వాటి తీవ్రతను తగ్గించే అవకాశం ఇంకా చేజారలేదు. భూగోళాన్ని రక్షించుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. గడచిన కొన్ని వారాలుగా అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని తీవ్ర అనావృష్టి నెలకొంటుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

global warming
గ్లోబల్​ వార్మింగ్
author img

By

Published : Jul 6, 2021, 8:46 AM IST

కొవిడ్‌ బారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే వాతావరణ మార్పుల దుష్ప్రభావం మానవాళిని అల్లాడిస్తోంది. కొవిడ్‌ ఏడాదిలోనో రెండేళ్లలోనో అదుపులోకి రావచ్చు కానీ, వాతావరణ మార్పులు మనల్ని దీర్ఘకాలం వెంటాడనున్నాయి. ఈ మార్పులను నివారించడానికి సమయం మించిపోయినా వాటి తీవ్రతను తగ్గించే అవకాశం ఇంకా చేజారలేదు. భూగోళాన్ని రక్షించుకొంటేనే మనకు మనుగడ ఉంటుంది. గడచిన కొన్ని వారాలుగా అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని తీవ్ర అనావృష్టి నెలకొంటుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, కెనడాలలో సూర్యుడి భగభగలను తట్టుకోలేక వందలమంది చనిపోయారు. కాలుష్యానికి తోడు కొన్ని ప్రాంతాల వాతావరణ పొరల్లో వేడిమి చిక్కుపడటం వల్ల అక్కడ ఉష్ణోగ్రత తగ్గడంలేదు. సైబీరియా వంటి అతిశీతల ప్రాంతంలోనూ ఉష్ణ పవనాలు వీస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల వల్లనే ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

కరుగుతున్న హిమనదాలు

ఈ పెను మార్పులకు మానవ కార్యకలాపాలే కారణమవుతున్నాయి. బ్రెజిల్‌లో వాతావరణ సమాచార సేకరణ 1931 నుంచి మొదలైంది. అక్కడ ఇటీవల ఎన్నడూ లేనంత తక్కువ వర్షాలు కురవడంతో దుర్భిక్షం ముంచుకొస్తోంది. అమెరికాలో హూవర్‌ డ్యామ్‌లో నీటి మట్టం కనీవినీ ఎరుగనంత తక్కువ స్థాయికి పడిపోయింది. అక్కడ క్యాలిఫోర్నియా రాష్ట్ర రైతులు నీటిని సంరక్షించాలని చెట్లను కూకటి వేళ్లతో పెకలిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్‌లో అక్కడ 1901 తరవాత ఎన్నడూ ఎరుగనంత గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. శతాబ్దానికి ఒక్కసారో, రెండుసార్లో వచ్చిపడే అత్యుష్ణ పరిస్థితులు ఇప్పుడు అయిదేళ్లకు ఒకసారి సంభవిస్తున్నాయి. గూగుల్‌, ఐరోపా సమాఖ్యకు చెందిన కొపెర్నికస్‌ ప్రాజెక్ట్‌, నాసా, ఒక అమెరికన్‌ విశ్వవిద్యాలయం కలిసి 'టైమ్‌ ల్యాప్స్‌' పేరిట చేపట్టిన కార్యక్రమం కింద 37 ఏళ్ల నుంచి భూగోళంపై వస్తున్న మార్పులను ఉపగ్రహాల ద్వారా వీక్షించారు. ఆ చిత్రమాలికతో రూపొందించిన ఒక వీడియోలో భూమిపై హిమనదాలు వేగంగా కరిగిపోవడం చూడవచ్చు. దీనివల్ల 2015-19 మధ్య ఏటా 298 గిగాటన్నుల హిమనదాల మంచు కరిగి ప్రవహించింది. ఒక గిగాటన్ను వందకోట్ల మెట్రిక్‌ టన్నులకు సమానం. 2000 సంవత్సరం నుంచి 49,000 గిగాటన్నుల మంచు కరిగింది. హిమనదాల నుంచి ఏటా పారుతున్న నీరు 24 అడుగులకు చేరి, స్విట్జర్లాండ్‌ వంటి దేశాన్ని ముంచేయగలదు. 1901 నుంచి కరిగిపోతున్న మంచు ఫలకాల వల్ల సముద్ర నీటిమట్టాలు ఎనిమిది అంగుళాల మేరకు పెరిగాయని నాసా లెక్కగట్టింది.

రుతు పవనాలు ఆలస్యం కావడం, కుండపోత వర్షాలు, వర్షాభావం వెనువెంటనే వచ్చిపడటం వాతావరణ మార్పుల ప్రభావమే. ఈ వైపరీత్యాలు ప్రాణనష్టాలను, ఆస్తి నష్టాలను పెంచుతాయి. భారత్‌లో 75శాతం జిల్లాలు విషమ వాతావరణ మార్పులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంభవిస్తుంది. వాతావరణ వైపరీత్యాల పరంపర పెరగడం ఆందోళనకర పరిణామం. 1970-2005 మధ్య 250 వాతావరణ వైపరీత్యాలు సంభవించగా, 2005-19 మధ్య కాలంలో వాటి సంఖ్య 310కి పెరిగింది. ఒక్క 2020లోనే భారీ వరదలు 40 లక్షలమందిని నిర్వాసితుల్ని చేశాయి. ఇకపై ఏటా 9.7 కోట్లమంది వరకు వరదలబారిన పడతారని అంచనా. భారత్‌తోపాటు పలు దేశాలు విషమ వాతావరణం వల్ల పెను నష్టాలను చవిచూస్తున్నాయి. అతివృష్టి వల్ల వరదలు సంభవిస్తే దీర్ఘకాల అనావృష్టి వల్ల ఎడారీకరణ విస్తరించే ముప్పు ఉంది. ప్రపంచ జనాభా పెరుగుతూ నీరు తదితర వనరులకు గిరాకీ హెచ్చుతున్న సమయంలో ఇది వినాశకరమైన పరిణామం కానుంది. దట్టమైన అడవులు, పుష్కలమైన వర్షపాతంతో సుసంపన్నమైన బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాలు ప్రపంచానికి ప్రధాన ఆహార సరఫరాదారులుగా నిలుస్తున్నాయి. వాతావరణ మార్పులు ఇప్పుడు ఈ రెండు దేశాలకూ తీవ్ర నష్టదాయకంగా పరిణమిస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల అక్కడ పంటలు దెబ్బతిని ప్రపంచంలో ఆహార ధరలు పెరిగి- పేద దేశాల ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం పొంచిఉంది. ఈ తరహా మార్పులవల్ల కోట్లమంది దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతారు. వర్షాలు కురవకపోతే దెబ్బతినేది వ్యవసాయం ఒక్కటే కాదు. జలవిద్యుదుత్పత్తి పడిపోయి పారిశ్రామిక, సేవా రంగాలూ సతమతమవుతాయి.

చురుగ్గా తక్షణ చర్యలు

వాతావరణ మార్పులు తెచ్చిపెట్టే ఈ వినాశకర ఫలితాల గురించి ఇప్పుడప్పుడే ఆందోళన చెందనక్కర్లేదని, అదే దీర్ఘకాలంలో వచ్చిపడే పరిణామమని భావిస్తే- అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఈ విధ్వంసాన్ని నివారించడానికి ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, వ్యక్తులు, కుటుంబాలు ఇప్పటి నుంచే నడుం బిగించాలి. వాతావరణానికి హానిచేయని విధంగా మన జీవన శైలిని, పని సంస్కృతిని మార్చుకోవాలి. రానున్న పదేళ్లలో కర్బన ఉద్గారాలకు తావులేని ఆర్థిక, సామాజిక వ్యవస్థలను నిర్మించుకోవాలి. ఇది జరగాలంటే శిలాజ ఇంధనాలకు స్వస్తిచెప్పి పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం ఎంతో అవసరం. వాతావరణాన్ని సంరక్షించుకుంటూనే అభివృద్ధి సాధించడంపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి కేంద్రీకరించాలి. ప్రాజెక్టుల పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే రేపు పెద్దయెత్తున వాతావరణ వైపరీత్యాలకు గురికావలసి ఉంటుంది. కంపెనీలు, ప్రజలు పునరుత్పాదక ఇంధన వనరులకు మారేందుకు సర్కారు తగిన ప్రోత్సాహకాలను అందించాలి. పవన, సౌర విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వాడే కంపెనీలకు 1990లలో నూరు శాతం తరుగుదలను అనుమతించేవారు. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం, సమయం వచ్చేశాయి. ఇళ్లు, కార్యాలయాల్లో ఎయిర్‌ కండిషనర్లు పనిచేసేటప్పడు తలుపు సందుల నుంచి, కిటికీల నుంచి చల్లని గాలి బయటకు వెళ్ళిపోవడం, గదిని చల్లబరచడానికి ఎయిర్‌ కండిషనర్లు మరింత విద్యుత్తును ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. దీన్ని నివారించడం పర్యావరణ హితకర చర్యల్లో ముఖ్యమైనది. వ్యక్తులు, సంస్థల ధోరణి సమూలంగా మారితే- కనీసం వాతావరణ మార్పుల వేగాన్ని తగ్గించగలుగుతాం.

కవచాలు అదృశ్యం

భూమిని అత్యుష్ణం నుంచి కాపాడే కవచాలు హిమనదాలు. వీటిలో పేరుకున్న తెల్లని మంచు సూర్యకిరణాలను అద్దంలా అంతరిక్షంలోకి పరావర్తనం చెందించడం ద్వారా భూఉష్ణోగ్రత పెరగకుండా ఆపుతుంది. హిమనదాలు లేకుంటే సూర్యకిరణాలు నేరుగా భూ ఉపరితలాన్ని తాకుతాయి. వాటి వేడిని ఉపరితలం ఇముడ్చుకుని వాతావరణం వేడెక్కడానికి దోహదం చేస్తుంది. ఆర్కిటిక్‌, అంటార్కిటికాలతోపాటు హిమాలయాల్లోనూ మంచు వేగంగా కరిగిపోయి దక్షిణాసియా దేశాలకు నీటి కొరతను తెచ్చిపెట్టనుంది. గంగ, బ్రహ్మపుత్ర నదులకు హిమాలయాలే మూలం. వాతావరణ మార్పుల వల్ల రుతువుల్లోనూ మార్పులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. భారత్‌పై నడి వేసవిలోనూ వాయుగుండాలు విరుచుకుపడటం ఇక్కడ గమనించాల్సిన పరిణామం.

-డాక్టర్​ అనంత్​

ఇదీ చూడండి: 'మాటలు కాదు.. చేతల్లో చూపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.