ETV Bharat / opinion

నిరంతర విద్యుత్‌ విని‘యోగం’? - విద్యుత్​ సరఫరాలో సమస్యలు

దేశంలో విద్యుత్​ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే నాణ్యమైన సేవల లభ్యతను లక్షిస్తూ తాజాగా నిర్దిష్ట నిబంధనావళిని క్రోడీకరించింది ప్రభుత్వం. మరి ఈ కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాయి?

opinion-on-centers-implementation-of- new- rules- in- electricity- department, editorial
నిరంతర విద్యుత్‌ విని‘యోగం’?
author img

By

Published : Dec 23, 2020, 8:15 AM IST

కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ లోగడ చెప్పినట్లు- మనిషికి శ్వాస మాదిరిగా జాతికి విద్యుత్‌ ప్రాణావసరంగా మారింది. నిరంతరాయంగా అందరికీ విద్యుత్‌ సరఫరాపై నేతాగణాలు ఎవరెంతగా మోతెక్కించినా, ఏళ్లతరబడి అవి నెరవేరని హామీలుగానే మిగిలిపోయాయి. విద్యుత్‌ వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పిస్తూ నూతన ఒరవడి దిద్దిన కేంద్రం, నాణ్యమైన సేవల లభ్యతను లక్షిస్తూ తాజాగా నిర్దిష్ట నిబంధనావళిని క్రోడీకరించడం స్వాగతించదగింది. అన్ని రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపి రూపొందించిన నిబంధనలను డిస్కమ్‌(పంపిణీ సంస్థ)లు విధిగా పాటించాల్సిందేనని, సేవా లోపాలకు జరిమానా ఎంతన్నది విద్యుత్‌ కమిషన్‌ వెల్లడిస్తుందని కేంద్రమంత్రి చెబుతున్నారు.

సరఫరాల్లో అంతరాయానికి వివరణ

విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు దేశవాసులకు అనుభవమే. సబ్‌స్టేషన్లు, లైన్ల అధ్వాన నిర్వహణ, లోడ్‌ హెచ్చుతగ్గుల మూలాన మోటార్లు కాలిపోవడం, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై సరైన సమాచారం కరవై అయోమయావస్థ... చాలాచోట్ల పునరావృతమవుతుండటం తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం- సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎక్కడ ఎందుకు సరఫరా దెబ్బతిన్నదో, ఎంతసేపట్లో సాధారణ స్థితి నెలకొంటుందో ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా తెలియబరచడమే కాదు- ప్రాంతాలవారీగా నిర్దేశిత గడువులో కనెక్షన్ల జారీ, సరిగ్గా పనిచేయని మీటర్ల స్థానే కొత్తవాటి ఏర్పాటు చురుగ్గా సాగాల్సిందేననీ నిబంధనలు చాటుతున్నాయి.

2022లోగా అన్ని రాష్ట్రాలూ ముందస్తు చెల్లింపు మీటర్లు, స్మార్ట్‌మీటర్లు సమకూర్చాల్సి ఉంటుందని కేంద్రం 2019 జనవరిలోనే గిరిగీసినా- కార్యాచరణపై చెప్పుకోదగ్గ కదలిక కొరవడింది. బిల్లుల్లో పారదర్శకతను, ప్రీపెయిడ్‌ మీటర్ల అమరికను, వయోవృద్ధులకు ఇంటివద్దే సేవలను సైతం ప్రస్తావిస్తున్న నూతన నిబంధనావళి అక్షరాలా అమలుకు నోచుకుంటే- ఈ చొరవ విశేష ప్రభావాన్వితమవుతుంది.

విద్యుత్ మిగులు ​రాష్ట్రాల్లో కూడా...

ఏ దేశ అభ్యున్నతికైనా తలసరి విద్యుత్‌ వినియోగాన్ని కొలమానంగా పరిగణిస్తున్న తరుణమిది. పొరుగున చైనాలో అది దాదాపు నాలుగు వేల కిలోవాట్లు ఉండగా- అమెరికా, యూఏఈ, తైవాన్‌ ప్రభృత దేశాల్లో 10వేల కిలోవాట్లకు పైబడుతోంది. ఈ సంవత్సరం మొదట్లో దేశీయంగా అది వెయ్యి కిలోవాట్లకు లోపే! గుజరాత్‌, ఏపీ, మహారాష్ట్ర వంటి విద్యుత్‌ మిగులు రాష్ట్రాలున్న దేశంలోనే రోజులో సగం కరెంటుకు దిక్కులేక సతమతమయ్యే ప్రాంతాలూ పోగుపడ్డాయి. దిల్లీలో కేజ్రీవాల్‌ సర్కారు సహా పలు రాష్ట్రప్రభుత్వాలు ఎన్నికల లబ్ధిని కాంక్షించి విద్యుత్‌ రాయితీలపై వాగ్దానాలు గుమ్మరిస్తున్న పర్యవసానంగా- వివిధ డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులు కిందుమీదులవుతున్నాయి.

బకాయిల భారం

2012-13లో మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరిన డిస్కమ్‌ల బకాయిల భారం తరవాత ఆరేళ్లలోనే నాలుగు లక్షల 80వేలకోట్ల రూపాయలకు ఎగబాకడం- రాయితీలు గుప్పించిన నాయకులు ఆ మేరకు స్వీయ బాధ్యతను దులపరించేసుకున్న దుష్ఫలితమే. డిస్కమ్‌ల ఆర్థిక స్వస్థత ఛిద్రం కాకుండా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు బాకీలు తీర్చేస్తేనే, పంపిణీ సంస్థల పనితీరు గాడిన పడుతుంది. సాధారణ వినియోగదారులకు 24గంటలూ విద్యుత్‌ సరఫరాను నిర్దేశించిన కేంద్రం, సేద్యానికి ఎంతసేపు అందించాలో రాష్ట్రస్థాయి రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయిస్తాయంటోంది.

మరి, పరిశ్రమల మాటేమిటి? నిరంతర విద్యుత్‌ అందుబాటులో లేనందువల్లే ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలు కుంగి పలు సామాజికార్థిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గతంలో ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) చెప్పింది అక్షరసత్యం. మారుమూల ప్రాంతాలూ సకల ఉపాధి కల్పన వ్యవస్థలూ విద్యుత్‌ సౌభాగ్యానికి నోచుకునేలా సాకల్య క్షాళన సాకారమైనప్పుడే- దేశ ప్రగతి జేగీయమానమవుతుంది!

ఇదీ చదవండి : న్యాయ సంస్కరణలు ఎండమావేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.