Union Budget-2022: 'ప్రజలకు మంచి ఆదాయం అందించే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి. వ్యాపారాలు సవ్యంగా సాగాలి. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు... అందరికీ వెన్నుదన్నుగా నిలవాలి. మొత్తంగా భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి'- 2020 బడ్జెట్ ఉపన్యాసంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన సుందర స్వప్నమిది. కొవిడ్ కవుకు దెబ్బల ధాటికి జీవితాలు దుర్భరమైన దుస్థితిలో ఆ తీయని కల సాకారమయ్యేందుకు తాజా బడ్జెట్ తోడ్పడుతుందని సామాన్య భారతం వేయికళ్లతో ఎదురుచూసింది. సమ్మిళిత వృద్ధికి కేంద్రం కంకణ బద్ధమైందంటూ అధికార వర్గమూ అందుకు తగినట్లుగానే ఊరించింది. వాస్తవ బడ్జెట్ రూపకల్పనలో ఆ అంచనాలు దెబ్బతిన్నాయి.
స్వాతంత్య్ర శతాబ్ది మహోత్సవాల నాటికి భవ్య భారతదేశ నిర్మాణానికి పునాది ప్రణాళికగా 2022-23 బడ్జెట్‌ను అభివర్ణించిన ఆర్థిక మంత్రి- పీఎం గతిశక్తి, సమీకృత ప్రగతి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు చేయూతను ప్రాధాన్యాంశాలుగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఆధునిక మౌలిక సదుపాయాలను కొలువుతీర్చి, దేశార్థిక రథాన్ని పరుగులు తీయిస్తామని హామీఇచ్చారు. రూ.22.04 లక్షల కోట్ల ఆదాయ వనరులు, రూ.16.61 లక్షల కోట్ల అప్పుల అంచనాలతో మొత్తం బడ్జెట్ పరిమాణం నిరుటితో పోలిస్తే పదమూడు శాతానికి పైగా ఎగబాకింది. వ్యయపద్దులో ఇరవై శాతం వడ్డీ చెల్లింపులకే సరిపోనుండగా- రాయితీలు, రక్షణ ఖాతాలకు ఎనిమిది శాతం చొప్పున సొమ్ము దఖలుకానుంది. ద్రవ్యలోటును 6.4శాతంగా మదింపు వేసిన సర్కారు; 2025-26 నాటికి దాన్ని 4.5శాతం కంటే దిగువకు కట్టడి చేసే లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ పెట్టుబడులు ఇతోధికమైతేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఆ మేరకు మూలధన వ్యయం పెంపు నిర్ణయం హర్షణీయం. 5జీ, డిజిటల్ రూపీ, వందేభారత్ రైళ్ల సంఖ్య పెంపు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, జాతీయ రహదారులను విస్తరించడం వంటివి వినసొంపుగా ఉన్నా- అదే సమయంలో కీలక రంగాలు, సామాజిక భద్రతా పథకాలకు కేటాయింపులను బిగపట్టడమే విస్తుగొలిపింది!
అరకొరే..
కరోనా ఆపత్కాలంలో దేశీయంగా ఉపాధి హామీ పథకం ఎన్నో కుటుంబాల కడుపులు నింపింది. ప్రస్తుతం అందులో నమోదు చేసుకున్న వారికి వంద రోజులపాటు పని కల్పించాలంటే రూ.2.6 లక్షల కోట్ల నిధులు అవసరమనే అధ్యయనాలు ఇటీవల వెలుగుచూశాయి. నిర్మలమ్మ పద్దులో అందుకు కేటాయింపులేమో 2021-22 సవరించిన అంచనాల కంటే తక్కువగా రూ.73 వేల కోట్లకు పరిమితమయ్యాయి. ప్రజారోగ్య సంక్షోభ సమయంలో వైద్య రంగానికి ఇతోధిక నిధులు తథ్యమన్న అంచనాలకు దీటుగా కేటాయింపులు కొరవడ్డాయి. అన్నదాతల ఆదాయాలను రెట్టింపు చేయడం తమ ప్రాధాన్యాంశంగా విత్తమంత్రి నిరుడు సెలవిచ్చారు. సేంద్రియ సాగు, నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహం వంటివాటిని ఈసారి ప్రస్తావించారు. అత్యవసర రుణహామీ పథకంతో 1.30 కోట్ల ఎంఎస్‌ఎంఈలకు మేలు చేకూరిందంటూ, దాన్ని మరో ఏడాది పొడిగించారు. పరిశ్రమల వాస్తవ సంఖ్యతో పోలిస్తే ఆ పథకంతో లబ్ధి పొందిన వాటి సంఖ్య స్వల్పం. కొవిడ్‌తో కుదేలైన ఎంఎస్‌ఎంఈలకు జీవంపోసేందుకు ఆ చర్య ఒక్కటీ సరిపోదన్నది వాస్తవం.
తెలుగు రాష్ట్రాలకు దక్కిందీ ఏమీ లేదు..
మరోవైపు, తాజా బడ్జెట్‌తో ఏపీ, తెలంగాణలకు ప్రత్యేకంగా దక్కిందీ ఏమీ లేదు. రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించేందుకంటూ ప్రత్యేక నిధిని ఏర్పరచామంటున్నా- తాత్కాలిక తాయిలాల పంపకాలకు ఆ సొమ్ము దారిమళ్లకుండా చూడటం కీలకం. ఉత్పాదక ఆస్తులు, ఉద్యోగాల సృష్టికి అది అక్కరకు రావాలి. పోటీ ప్రపంచంలో నవతరం నెగ్గుకురావాలంటే- డిజిటల్ విశ్వవిద్యాలయం, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం, యువతకు నైపుణ్య శిక్షణ వంటివి పూర్తిగా పట్టాలకు ఎక్కాలి. వేతన జీవులపై మరోసారి శీతకన్ను వేసిన కేంద్రం- మహమ్మారి మిగిల్చిన నష్టాల్లోంచి ఒడ్డునపడేసే ఆలంబనలను ఆశించిన భిన్న వర్గాలు, రంగాల ఆకాంక్షలకూ సరైన న్యాయం చేయలేదు!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: Union budget 2022: నవ భారత్ కోసం 'బూస్టర్ డోస్' బడ్జెట్!