ETV Bharat / opinion

'మద్య'ధరా సముద్రంలో నితీశ్​ మునక! - Bihar elections JDU

బిహార్‌ ఎన్నికల్లో జేడీయూ చాప కిందకు నీళ్లు వచ్చేశాయని... ఆర్జేడీ లాంతరువాలాలదే అధికార పీఠమని ఎగ్జిట్‌ పోల్స్‌ ఘోషిస్తున్నాయి. అదే నిజమైతే చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా అనుకోవాల్సిందే. దీనంతటికీ కారణం నాలుగేళ్లు మద్యనిషేధమంటూ కొరడా పుచ్చుకొన్న నితీశ్‌ సర్కారు.. తీరా ఎన్నికలొచ్చేసరికి నిద్ర నటించిందని అందరికీ తెలుసు. మందు పారితే ఓట్లు కొట్టుకొస్తాయని ఆశపడితే... అసలుకే మోసం వచ్చేసింది. గట్లు తెంచుకుని ఉరకలెత్తిన మద్యవాహిని చివరికి 'యజమానులనే' ముంచేసింది!

Nitish Kumar fail in the election because of release wine end of the his government
'మద్య'ధరా సముద్రంలో నీతీశ్​ మునక
author img

By

Published : Nov 9, 2020, 9:08 AM IST

'బాణం తగిలి లాంతరు గ్లాసు పగిలిపోతుందనుకుంటే ఎదురుతన్నిందేంటబ్బా?' 'మత్తు మహిమ నాయనా... గొంతులో మందు పడ్డాక మెదడు మాట వింటుందా? వణికే చేతులతో బాణాలేయమంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? పైగా ఆ లాంతరును చూశావా... అదాటున చూస్తే అచ్చం మందుబుడ్డిలా లేదూ...!' 'అయితే...' 'అయితే లేదు... గియితే లేదు... బాణాలు బాగా వేస్తారని మనోళ్లు తెగ తాగబోయించారు. నిషా తలకెక్కాక గురి చూడమంటే వాళ్లేమో లాంతరు వెలుగులకు గుడ్లప్పగించారు. తప్పులేదులే... ఈసారికి మనమిలా సరిపెట్టుకోవాల్సిందే’

బిహార్‌ ఎన్నికల్లో జేడీయూ చాప కిందకు నీళ్లు వచ్చేశాయని... ఆర్జేడీ లాంతరువాలాలదే అధికార పీఠమని ఎగ్జిట్‌ పోల్స్‌ ఘోషిస్తున్నాయి. అదే నిజమైతే చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా అనుకోవాల్సిందే. మద్యనిషేధమంటూ నాలుగేళ్లుగా కొరడా పుచ్చుకొన్న నీతీశ్‌ సర్కారు తీరా ఎన్నికలొచ్చేసరికి నిద్ర నటించిందని ఆ రాష్ట్రంలోని ప్రతి చెట్టూ పుట్టకూ తెలుసు. మందు పారితే ఓట్లు కొట్టుకొస్తాయని ఆశపడితే, పాపం అసలుకే మోసం వచ్చేసింది. గట్లు తెంచుకుని ఉరకలెత్తిన మద్యవాహిని చివరికి 'యజమానులనే' ముంచేసింది!

రాష్ట్రంలో తాగుబోతులే ఉండకూడదని 2016లో నితీశ్‌ కుమార్‌ కంకణం కట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా మద్యనిషేధ చట్టం తెచ్చేశారు. 'పులి మీద సవారీ మనకొద్దు మహాప్రభో' అని అనుచరగణం మొత్తుకున్నా 'ఠాట్‌... నేను చేస్తా... గెలుస్తా' అన్నారు ముఖ్యమంత్రి. అన్నవారు అన్నట్టుగా మాట మీద నిలబడ్డారా? లేదే... మందు లేని ఎన్నికలంటే పంచదార లేని పాయసమేనన్న జ్ఞానోదయమై చూసీ చూడనట్టుగా తలుపులు తెరిపించేశారు. 'తాగినవాళ్లకు తాగినంత' పథకాన్ని విస్తృతంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు. ఆ రకంగా ఈవీఎంల మీద ఆయన 'బాణాలె'క్కుపెడితే అవికాస్తా ఎదురు తిరిగినట్టున్నాయి. అవును మరీ, నాలుగేళ్ల కరవు తరవాత ఒక్కసారిగా మందు వచ్చిపడితే, తాగినవాళ్లకు తన పర భేదముంటుందా? అసలు ఇన్ని రోజులు తమ నోళ్లు కట్టేసిన వారి మీద కోపం రాకుండా ఉంటుందా? ఆ సురాగ్రహ ఫలితాలే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ అంటే ఎవరు కాదనగలరు?
రాజును మించిన రాజభక్తి మంచిది కాదని పెద్దలెప్పుడో చెప్పారు కానీ, ఆ బిహార్‌ అధికారులు వినిపించుకుంటేనేగా! ముఖ్యమంత్రి మద్యనిషేధం అనగానే వీళ్లు దొరికింది మహదావకాశం అనుకుని ఊళ్ల మీద పడ్డారు. మద్యనిషేధ చట్టం కింద మూడు లక్షల మంది మీద కేసులు పెట్టి కటకటాల వెనక్కి నెట్టేశారు. అలా అని వీళ్లలో ఎక్కువ మంది ఏమైనా దొంగ మందు అమ్మేవాళ్లా అంటే... అదీ కాదాయే! ఒక్కసారిగా పాతలవాటు మానుకోలేని అతి సామాన్యులు. అరివీర భయంకరమైన తమ ప్రతాపమంతటినీ అధికారగణం వీళ్ల మీద చూపించే సరికి చివరకొచ్చి అది నితీశ్‌ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు కక్కలేక మింగలేక అధికారపక్షమంతా తమ నాయకుడి వైపు ఉరిమి ఉరిమి చూసినా ఏం లాభం? చేతులు కాలాక ఆకుల కోసం వెతికితే ఎవరికి ఉపయోగం?

మందును నిషేధించి పారేస్తే మహిళలు మెచ్చుకుంటారు... మగవాళ్లు ఓట్లు వేయకపోయినా పర్లేదు, ఈ అక్కాచెల్లెళ్లే ఆదుకుంటారన్నది నితీశ్‌ దూరాలోచన. కానీ, ఆయన నమ్మకాలన్నీ వమ్ము అయ్యి కళ్లు తేలేసే పరిస్థితి రావడానికి అట్టేకాలం పట్టలేదు. నిన్నటి దాకా సందు చివర కొట్లకి పోయి తాగొచ్చే వాళ్లు. ఇప్పుడు ఏ రోజు మందుబుడ్డి ఆ రోజే ఇంటికొచ్చేస్తోంది. ఈ దొంగ సీసాల సరఫరాలో తేరగా వస్తున్న డబ్బును చూసి మా పిల్లలు ఆ పాడుపనులు చేస్తూ పోలీసుల దెబ్బలు తింటున్నారు. ఇక ఈయన మాకు చేసిందేంటంట.. అంటూ నిలదీసిన నారీలోకానికి ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఆయన ఆంతరంగికులకు అనుచరులైన వారి అనుయాయులైనా బదులివ్వలేదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎన్నికల సభల్లో ఎలుగెత్తి అభివృద్ధి మంత్రాన్ని జపించినా ఎవరు పట్టించుకుంటారు? కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు మద్యనిషేధంతో వచ్చిన కొత్త ఓట్లు ఏవీ లేవు కానీ, పాత ఓటర్లు సైతం ప్రతిపక్షం గూటికి చేరిపోయారట... హతవిధీ!!

ఆశయాలు ఆకాశంలో విహరిస్తే సరిపోదు, ఆచరణలో ఆవగింజంతన్నా ఆలోచన లేకపోతే ఎలా అన్నది అనుభవజ్ఞుల ప్రశ్న! ప్రచారం కోసం కుస్తీ పోటీకెళ్తే పక్కటెముకలు విరిగిపోయాయని, ముందూ వెనకా చూసుకోకుండా చట్టాలు చేస్తే అవి చేసినవారికే చెరుపు చేస్తాయని రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారికీ తెలుసు కదా. అనేక యుద్ధములలో ఆరితేరిన యోధుడు నితీశ్‌ మాత్రం దీన్ని మరిచిపోయి తనకు తానే మంగళం పాడుకున్నట్టున్నారు. మద్యనిషేధం మంచిదే కానీ నల్లబజారు పెద్దమనుషుల మీద పైసలవాన కురిపించడానికి మాత్రమే అది అక్కరకొస్తే అంతిమ ఫలితాలు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ మాదిరిగానే వెక్కిరిస్తాయి.

ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వాలను నిలబెట్టేది... నడిపించేది... ఆఖరికి పడగొట్టేది కూడా మద్యమే. ఎవరు అవునన్నా కదన్నా ఇదే జరుగుతోంది నిత్యం... జరగబోయేదీ ఇదే... తథ్యం!

రచయిత- శైలేష్‌ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.