కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో విషయం తక్కువ, ఆర్భాటం ఎక్కువగా అనిపిస్తోంది. ఇందులో పర్యావరణ మంత్రి ప్రధాన పాత్ర పోషించగా, మానవ వనరుల మంత్రి (ఇప్పుడు విద్యామంత్రి) పక్క వాయిద్యానికి పరిమితమయ్యారు. ప్రాథమిక విద్య సార్వత్రీకరణే ఎన్‌ఈపీ ధ్యేయం. సార్వజనీన పాఠశాల వ్యవస్థ లేకుండా ఇది సాధ్యపడదు.
వీధి బాలలకు విద్య అందేదెలా..?
ఈ లక్ష్య సాధనలో ప్రైవేటు విద్య ప్రథమ అవరోధంగా నిలుస్తుంది. ప్రపంచ దేశాల్లో రుజువైన సత్యమిది. ప్రధాన నగరాల్లో ఏ కూడలి వద్ద చూసినా పిల్లలు భిక్షాటన చేసుకుంటూ కనిపిస్తారు. లేదంటే బాలకార్మికులుగా ఎక్కడో చాకిరి చేస్తుంటారు. వీరిని బడి ఒడిలోకి చేర్చేదెలా? విద్యా విధాన నిర్మాతలు ఈ ప్రశ్నను పట్టించుకోలేదు. సార్వత్రీకరణ అనేది మాటలకే పరిమితం. రాజకీయ సంకల్పం కొరవడిందనేది సుస్పష్టం. ఎందుకంటే, ప్రైవేటు పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల పిల్లలకు కనీసం 25 శాతం సీట్లు ఇప్పించలేక పోతున్నాయి ఈ ప్రభుత్వాలు.
విద్యా వ్యయం స్థూల దేశీయ ఉత్పత్తిలో 6 శాతానికి సమంగా ఉండాలన్నది 1968 నాటి కొఠారీ కమిషన్ సిఫార్సు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అమలు చేస్తున్న ప్రామాణిక వ్యయమిది. మూడేళ్ల ‘ప్రీ స్కూల్’ (అంగన్‌వాడీ) కార్యక్రమాన్ని నూతన విద్యావిధానంలో భాగంగా మార్చారు. మహిళ, శిశు సంక్షేమ విభాగానికి చెందిన ఈ ‘బాలల సమీకృత అభివృద్ధి’ పథకానికి కేటాయిస్తున్న 4.3 శాతాన్ని (అలా అని చెబుతున్నారు) ఇప్పుడు 6 శాతానికి పెంచారు. మాతృభాషలో విద్యాబోధన అనేది విస్తృత ప్రచారం పొందిన మరో అంశం. ఎప్పటి నుంచో విద్యావేత్తలు ఘోషిస్తున్నదిదే. దీనికి కార్యరూపం ఎలా ఇస్తారన్నదే ప్రశ్న. చాలా ప్రైవేటు పాఠశాలలు ఆంగ్లాన్లే బోధనా మాధ్యమంగా కొనసాగించబోతున్నాయి. ఇది ఎన్‌ఈపీ రెండు నాల్కల ధోరణి. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 ప్రాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడంపై దృష్టి సారించారు. సంస్కృతం, సంప్రదాయం వంటి అంశాల గురించి మాట్లాడటం తేలికే, జనామోదం పొందడమే కష్టం. సివిల్ సర్వీసులు, ఇంజినీరింగు, వైద్యం, మేనేజ్‌మెంటు కోర్సులు, న్యాయ సేవలు- వీటికి ఆంగ్లభాషా పరిజ్ఞానం అవసరం. ఒకవైపు వాస్తవం ఇలా ఉండగా, భారతీయ భాషలకు ప్రాముఖ్యం ఇస్తామని పదేపదే చెబుతున్నారు.
త్రిభాషా సూత్రం
ఇక త్రిభాషా సూత్రం. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. తమిళనాడు దీన్ని పాటించదు. హిందీ రాష్ట్రాలు నిజాయతీగా అమలు చేయవు. నవోదయ విద్యాలయాలు మినహా ఉత్తరాదిన ఏ బడిలో హిందీ కాకుండా మరో భారతీయ భాషను నేర్పుతున్నారు? ఇక మీదటా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించలేం. విద్యాభ్యాసపు రెండోదశలో వృత్తి విద్యా శిక్షణ అన్నదీ కొత్తదేమీ కాదు. మహాత్మాగాంధీ ప్రబోధించిన ‘నూతన శిక్షణ’ భావనలో ఇదొక భాగం. ఈ భావనతో వార్దా ఆశ్రమం నడిపిన బడి ఒకటి చివరకు మూతపడింది. ఎన్‌సీఈఆర్టీ పాఠ్యప్రణాళికలో ‘సామాజిక ప్రయోజన ఉత్పాదక కార్యం’ అనేది ఒక అంశం. శారీరక శ్రమను చిన్నచూపు చూసే సమాజంలో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు చేతి వృత్తుల్ని పెద్దగా పట్టించుకోరు. ఇది కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోతుంది.
నాగరికతలే కీలకమా?
ప్రాచీన (మధ్యయుగాలు కాదు) సంస్కృతి, నాగరికతల గురించి ఎన్‌ఈపీ పదేపదే నొక్కి చెప్పింది. శాస్త్రీయ స్పృహ గురించి మొత్తం విధాన పత్రంలో ఒకటి రెండుసార్లే ప్రస్తావన ఉంది. విదేశీ ఉన్నత విశ్వవిద్యాలయాలకు గేట్లు తెరవడం అనేది ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పొసగదు. ప్రతిభావంతులైన విద్యార్థులను, బోధకులను, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఆకర్షిస్తాయి. దీంతో దేశీయ సంస్థల ప్రమాణాలు పడిపోతాయి. అదెలా ఉన్నా, ఎన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఇక్కడ ప్రాంగణాలు తెరుస్తాయో చెప్పడం కష్టం. ఉన్నత ప్రమాణాలతో కూడిన సువ్యవస్థల నిర్మాణానికి కఠోర శ్రమ అవసరం. విదేశీ విశ్వవిద్యాలయాలను పోటీలోకి దించితే పని సఫలం కాదు. ఇది వికటించే ప్రమాదమూ ఉంది. అమెరికా అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకే ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్‌లీ) ఉంది. మనదేశంలోనూ అదే పరిస్థితి నెలకొనాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా?
ఆ చేదు అనుభవం సంగతేంటి..?
పలు నియంత్రణ సంస్థలు ఉండాలని ఎన్‌ఈపీ సిఫారసు చేస్తోంది. ఈ నియంత్రణ సంస్థల పనితీరు నుంచి ఇప్పటికే భారత్ చేదు అనుభవం పొందింది. ఇవి అవినీతి కేంద్రాలుగా, ప్రభుత్వం చేతిలో ‘శిక్షించే’ ఆయుధాలుగా మిగిలాయి. రాజకీయ నియామకాలతో తెల్ల ఏనుగుల్లా మారాయి. సామాజిక చేతనా కేంద్రాలుగా బడులను వాడుకోవాలన్నది మరో సూచన. పలుకుబడిగల వ్యక్తులు, ప్రభుత్వ మద్దతు ఉన్న సంస్థలు పాఠశాల భవనాలను దుర్వినియోగం చేయబోవన్న హామీ లేదు. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యేతర వ్యవహారాల భారం మోస్తున్నారు. బోధన-అభ్యాసన కార్యకలాపాలకు ఉపాధ్యాయులు మరింతగా దూరమవుతారు. ఉపాధ్యాయులను పాఠాలు చెప్పేలా ప్రోత్సహించడం అన్నింటికంటే కీలకం. ఈ తరహా పరిస్థితుల్లో పరీక్షల గండం గట్టెక్కడానికి ఉపాధ్యాయుల అండతో మోసాలకు పాల్పడటం ఒక్కటే విద్యార్థులకు ముందుండే మార్గం. ఇలాంటి ఎన్నో క్షేత్రస్థాయి వాస్తవాలను విధాన నిర్ణేతలు మరోసారి విస్మరించారు.
- సందీప్ పాండే, (రచయిత- రామన్ మెగసెసే పురస్కార గ్రహీత)
ఇదీ చదవండి: భారత శాస్త్రవేత్తల సృష్టి.. పర్యావరణహిత లిథియం బ్యాటరీలు