రాబోయే కొన్నేళ్ల ఆర్థిక వృద్ధి అంచనాలన్నింటినీ కరోనా రెండోదశ తుడిచిపెట్టేసింది. మహమ్మారి విజృంభణతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అంతటా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో కొన్ని ఆందోళనకర అంశాలు మాత్రం విస్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. కరోనా రెండోదశ వల్ల సంభవిస్తున్న మరణాలు, పెరుగుతున్న అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై ఈ ప్రభావం దీర్ఘకాలం కొనసాగనుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో కొవిడ్ ప్రేరేపిత మార్పులను అర్థం చేసుకోవడం, వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటం ఇప్పుడు చాలా అవసరం.
దారుణ పర్యవసానాలు
ప్రపంచవ్యాప్తంగా 1950ల తరవాత పట్టణీకరణ ఊపందుకుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి హెచ్చింది. 1950 నాటికి ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల మంది మాత్రమే పెద్ద (మూడు లక్షలకు పైబడిన జనాభా కలిగిన) నగరాల్లో నివసించేవారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020 నాటికి ఈ సంఖ్య 257 కోట్లకు పెరిగింది. 2035 నాటికి ఇది 328 కోట్లకు చేరుతుందని అంచనా. మన దేశంలో అరవై ఏళ్ల కిందట 18శాతంగా ఉన్న నగర జనాభా నిరుటికి 30శాతానికి చేరింది. 2050 కల్లా 50శాతం కావచ్చని అంటున్నారు. ఈ లెక్కలన్నీ కొవిడ్ చుట్టుముట్టక ముందు కట్టినవి. కరోనా అనంతర కాలంలో వీటిలో మార్పులు రావచ్చు. నిజానికి 139 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇప్పటి వరకు మానవ వనరులతో లబ్ధి పొందుతూ వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనోపాధులపై కొవిడ్ ప్రభావాన్ని ఇప్పటికిప్పుడు కచ్చితంగా లెక్కగట్టాలనుకోవడం కొంచెం తొందరపాటు పనే అవుతుంది. కానీ, ఆందోళనకర సంకేతాలైతే వెలువడుతున్నాయి.
కరోనా వల్ల ఇప్పటి వరకూ ఎంతమంది మరణించారు, ఎందరు అస్వస్థులయ్యారన్న వాస్తవ గణాంకాలను ప్రభుత్వాలు వెలువరించడం లేదు. ఫలితంగా ఆర్థిక, సామాజిక ప్రభావాలను అర్థం చేసుకోవడం కష్టతరమవుతోంది. దిల్లీ ముఖ్యమంతి అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుల ప్రకటనలను బట్టి చూస్తే, మొదటి దశకు భిన్నంగా రెండోదశలో 45 ఏళ్ల లోపు వారు ఎక్కువగా విగతజీవులవుతున్నారు. జనాభాలోని ఈ ప్రధాన వయోవర్గంలో సంభవిస్తున్న మరణాలు మనల్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో... ముఖ్యంగా గడచిన ఆరు దశాబ్దాల్లో 5.9 శాతం నుంచి 2.19శాతానికి పడిపోయిన జననాల రేటుపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో ఎవరికీ తెలియదు! ఈ మహమ్మారికి సంబంధించిన మరో ప్రమాదకర కోణం... దీర్ఘకాల కొవిడ్. అంటే, కొవిడ్ లక్షణాలతో ప్రజలు నెలల తరబడి అనారోగ్యంతో బాధపడటం. ఈ దీర్ఘకాల అస్వస్థత వల్ల ప్రజలు పనిచేయలేరు. ఇలాంటి కేసులకు సంబంధించి భారత్‌లో ఎలాంటి సమాచారం లేదు.
మానవ వనరులను భర్తీ చేయలేం!
యూకేలో కొవిడ్ బారినపడి కోలుకున్న వారిలో అయిదు శాతానికి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. పనిచేయగలిగిన వయసులోని వారు దీర్ఘకాల కొవిడ్ బారినపడితే ఉత్పాదకత పడిపోతుంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరినో, లేదా ఇద్దరినో పోగొట్టుకునే చిన్నారుల దుర్గతి మరో బాధాకర అంశం. ఇంకో ఆందోళనకర విషయం ఏమిటంటే... రాబోయే కొన్నేళ్లలో నైపుణ్యమున్న మానవ వనరుల్లో ఏర్పడబోయే తరుగుదల. కొవిడ్ కారణంగా కోల్పోయిన మానవ వనరులను అంత త్వరగా భర్తీ చేయడం అసాధ్యం. అనారోగ్యం బారిన పడుతున్న వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులను గమనిస్తే ఈ తక్షణ ప్రమాదం అవగతమవుతుంది. వీళ్ల స్థానాల్లోకి ఇప్పటికిప్పుడు కొత్తవారిని తీసుకురావడం దుర్లభం. ముఖ్యంగా అనుభవజ్ఞులకు ప్రత్యామ్నాయం ఉండదు. కాబట్టి, ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరిస్తూ, కొవిడ్ ప్రభావాన్ని అవగతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే ఈ మహమ్మారితో సంభవిస్తున్న పెనుమార్పులకు తగిన సర్దుబాట్లు చేసుకోవడానికి అందరికీ అవకాశముంటుంది. మరోవైపు, మహమ్మారి బారిన పడిన వ్యక్తుల కుటుంబాలు వైద్య వ్యయభారంతో చితికిపోతున్నాయి. దీంతో ఇతరాలపై ఖర్చు తగ్గడమే కాదు, కుటుంబాల వృద్ధి సైతం మందగించబోతోంది.
సంక్షేమానికి పెద్దపీట
చుట్టూ చీకట్లు అలముకున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం- తొలుత ప్రజలకు వీలైనంత తక్కువ ధరకు లేదా పూర్తి ఉచితంగా టీకాలను అందించాలి. వాటిని పొందడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలి. ఇది జరగాలంటే టీకాలను జనహిత ఉత్పత్తులుగా ప్రకటించి, వాటి ధరలను నియంత్రించాలి. మహమ్మారి కోరలకు చిక్కి చాలామంది మరణిస్తున్నారు. అనేక కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలవుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి. దాని కింద ఆ చిన్నారులకు ఉచిత విద్యను అందించాలి. వాళ్ల చదువులు పూర్తయ్యేదాకా లేదా కనీసం మైనారిటీ తీరేదాకా అయినా నెలకు కొంత మొత్తంలో ఆర్థిక సాయం అందించాలి. కుటుంబ పోషకులను కోల్పోయిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు పింఛను ఏర్పాటు చేయాలి.
ఈ కొవిడ్ కల్లోలం ధాటికి లక్షల మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు కాబట్టి ఇలాంటి పథకాలను ఆ వర్గానికీ విస్తరించడం అవసరం. చివరగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం విధానాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుతాలు సమీక్షించుకుని మార్పులు చేయాలి. ముఖ్యంగా ఓట్ల పథకాల స్థానంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు, విద్య తదితరాలను ఉచితంగా లేదా సాధ్యమైనంత తక్కువ వ్యయానికి అందించాలి. సామాజిక భద్రతా పింఛన్లను కొనసాగిస్తూ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు పంచడం వంటి కార్యక్రమాలను ఆపేయాలి. ఇలాంటి పథకాల వల్ల దేశం చాలా నష్టపోతోంది. వీటివల్ల వైద్యం, విద్య, పౌరుల సామాజిక భద్రత మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టలేకపోతున్నాం. ఈ వైఫల్యాల ఫలితాలనే ఇప్పుడు చూస్తున్నాం!
ఇకపై ఎలా ఉంటుందో...
భారతీయుల సగటు ఆయుర్దాయం 1950లో 37 ఏళ్లు అయితే 2020 నాటికి 70.4 ఏళ్లకు పెరిగింది. ఇప్పుడు ప్రతి వెయ్యి జననాలకు 26.6 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అదే అరు దశాబ్దాల క్రితం అయితే 271 మంది శిశువులు పురిట్లోనే ప్రాణాలు కోల్పోయేవారు. 1955లో 7.1 కోట్లుగా ఉన్న భారత పట్టణ జనాభా 2019 నాటికి 48 కోట్లు అయింది. ఇదే సమయంలో గ్రామీణ జనాభా 82శాతం నుంచి 65శాతానికి తగ్గిపోయింది. మరోవైపు పని చేయగలిగిన వయసులోని వారి సంఖ్య పెరుగుతుండటం భారత్‌కు పెద్ద సానుకూలాంశం. దేశ జనాభాలో 67.4శాతం 16-64 ఏళ్ల వయసు వారే. కానీ, ఇకపై ఈ గణాంకాలన్నింటిపైనా కొవిడ్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
- డాక్టర్ ఎస్.అనంత్, రచయిత - ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు
ఇదీ చదవండి: రాంలీలా మైదాన్: 15రోజుల్లోనే 500 పడకల ఆస్పత్రిగా..!