Save power for future generation : ఇంధనం దేశ సామాజిక, ఆర్థిక ప్రగతికి మూలం. అది ఆధునిక మానవుడి జీవిత గమనాన్ని శాసిస్తోంది. నాగరికత, సాంకేతికత, జనాభా, కొనుగోలు శక్తి పెరుగుతున్న కొద్దీ ఇంధన వినియోగమూ ఎక్కువైంది. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఇంధన వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో వినియోగంలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుంది. మానవాళి ప్రాథమిక ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులపైనే 97.4 శాతంమేర ఆధారపడటం వల్ల, కాలుష్యం పెరుగుతూ సహజ వనరుల లభ్యత క్షీణించడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రాథమిక వనరుల్లో సింహభాగం విద్యుదుత్పత్తికే వినియోగిస్తున్నారు. ఇంధన వనరుల లభ్యత- దేశ భౌగోళిక పరిస్థితులు, సహజ వనరుల నిక్షేపాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ఇంధన గణాంక శాఖ నివేదిక ప్రకారం 2018లో భారత్‌లో 80.92 కోట్ల టన్నుల మేర సహజ వనరులను వెలికి తీయగా... 54.09 కోట్ల టన్నులనే వినియోగించుకోగలిగినట్లు లెక్క తేలింది. అంటే అత్యంత విలువైన వనరుల్లో మూడింట ఒక వంతు వృథా అవుతున్నాయన్నమాట.
నిబంధనలు పాటించాలని నిర్దేశం
పొదుపు లేని జీవితం అదుపు లేని నావ లాంటిది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం 2001లోనే ఇంధన పొదుపు చట్టం తీసుకువచ్చింది. దాని అమలును పర్యవేక్షించేందుకు ఇంధన సామర్థ్య సంస్థ(బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ-బీఈఈ)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఇంధన పొదుపుపై అనేక కార్యక్రమాలు రూపొందించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. ఇంధన వినియోగంలో మెలకువలను సూచిస్తోంది. రైల్వేతో సహా భారీగా ఇంధనాన్ని వినియోగించే విద్యుత్, సిమెంటు, ఉక్కు, ఎరువులు, రసాయనాలు, అల్యూమినియం, టెక్స్‌టైల్, పేపర్ లాంటి 15 పరిశ్రమలపై పరిమితులు విధించింది. నిర్దేశించిన దానికన్నా తక్కువ వాడినవారికి ఇంధన పొదుపు ధ్రువపత్రాలు ఇస్తుంది. పరిమితికి మించి వాడేవారు ఇంధనం కొనుగోలు చేయాలని నిబంధనలు విధించింది. భవనాల నిర్మాణంలో ఇంధనాల పొదుపుకోసం ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)’ను ప్రవేశపెట్టింది. 100 కిలోవాట్స్ విద్యుత్తును వినియోగించే వ్యాపార భవన సముదాయాలు, తప్పనిసరిగా నిర్మాణం నుంచే పొదుపు నిబంధనలు పాటించాలని నిర్దేశించింది. ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలో పకడ్బందీగా భవన నిర్మాణ నిబంధనలు అమలు చేసినట్లయితే 30 వేల కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని తెలిపింది. ఇంధన పొదుపు కార్యక్రమాల అమలుకు రాష్ట్రాల పరిధిలో టీఎస్ రెడ్కో, ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ లాంటి సంస్థలు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయి.
భారత్‌లో ఇంధన వినియోగంలో వ్యవసాయ రంగం 18శాతంతో మూడో స్థానంలో ఉంది. భారత్‌లోని 2.2 కోట్ల నాసిరకం పంపుసెట్లను తీసివేసి ఇంధన సామర్థ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మోటార్లను అమర్చితే, సంవత్సరానికి సుమారు 5,565 కోట్ల యూనిట్ల విద్యుత్ (మొత్తం వినియోగంలో 25-30శాతం) ఆదా అవుతుంది. నూతన సాంకేతికతతో బిందు, సూక్ష్మ సేద్యం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. స్వయంగా పొలాల్లోనే సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గిపోవడమే కాకుండా- ఆ మేరకు కాలుష్యం బారి నుంచీ తప్పించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన పొదుపు నిబంధనల అమలుకు భవన నిర్మాణ దశలోనే సహజమైన గాలి, వెలుతురు తగినంతగా ఉండేలా జాగ్రత్త పడాలంటూ వెయ్యి లేదా రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే వ్యాపార సముదాయాలకు ఆదేశాలు జారీ చేశారు. అత్యంత సామర్థ్యం (ఫైవ్ స్టార్ రేటింగ్) ఉన్న ఏసీ, ఫ్యాన్, బల్బ్ తదితర విద్యుత్ పరికరాలను వాడటంవల్ల సుమారు 15శాతం ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. రవాణా రంగం పూర్తిగా పెట్రోలియం ఉత్పత్తులపై ఆధార పడటంతో, దేశీయంగా సరిపడా ఇంధనం లేక దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు వ్యయం కావడంతో పాటు, వాయు కాలుష్యమూ పెచ్చరిల్లుతోంది.
విద్యుత్, హైడ్రోజన్ వాహనాలకు ప్రోత్సాహం కల్పించడంద్వారా ప్రత్యామ్నాయ విధానాలకు ఊతమివ్వాలి. మెట్రో రైలు, బస్సులువంటి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచాలి. పరిశ్రమల్లో కాలం చెల్లిన యంత్ర సామగ్రికి బదులు ఆధునిక సాంకేతిక పరికరాలను స్థాపించాలి. మునిసిపాలిటీల్లో వీధి దీపాలకోసం అత్యంత సామర్థ్యం ఉన్న ఎల్‌ఈడీ బల్బులను వినియోగించాలి. నూతన సాంకేతికతతో కేవలం రాత్రిపూట మాత్రమే అవి వెలిగేలా నియంత్రిస్తే 50-60 శాతం మేర విద్యుత్ ఆదా అవుతుంది. తాగు, మురుగు నీటి పంపులను బీఈఈ స్టార్ రేటింగ్ యంత్రాలతో మార్చినట్లయితే మరో 20-30శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
అవగాహన కీలకం
కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) లాంటి సంస్థలు స్వయంగా పెట్టుబడితో విశేష కృషిని కొనసాగిస్తూ వ్యవసాయ పంపుసెట్లు, విద్యుత్ వాహనాలు, మునిసిపల్, వీధిదీపాలు, పంపులు తదితరాల్లో గణనీయంగా ఆదా చేయగలిగాయి. విద్యుత్ పరికరాల ప్రమాణాలను నిర్దేశించడం, ఉజాల, డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్, పీఎం కుసుమ్, ఫేమ్‌లాంటి వివిధ కార్యక్రమాలు అమలు చేయించడం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.89,122 కోట్లు ఆదా చేశారు. ఇది 2.37 కోట్ల టన్నుల చమురుతో సమానం. దీనివల్ల 152 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నిలువరించారు. నిర్దేశిత రంగాల్లో నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా ఇంధన పొదుపు చట్ట సవరణను కేంద్రం ప్రతిపాదించింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక పరికరాల వినియోగంతో, విద్యుత్ వృథాను అరికట్టాలి. విద్యార్థులకు ఇంధన పొదుపు పాఠాలు తప్పనిసరి చేయాలి. విద్యుత్తును పొదుపుగా వినియోగించడాన్ని బాల్యం నుంచే అలవాటుగా మార్చాలి. భారత్‌లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో, ఇంధన స్వయం సమృద్ధి సాధించడంలో పొదుపు ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా ప్రభుత్వాలు అవగాహన పెంపొందించాలి.
విద్యుత్ సంస్థలు బలోపేతమైతేనే...
విద్యుత్ సరఫరా, పంపిణీల్లో నిమగ్నమైన సంస్థలు ప్రస్తుతం 20.66శాతం మేర నష్టాలు చవిచూస్తున్నాయి. వీటిని బలోపేతం చేసి నష్టాలను ప్రపంచ సగటు అయిన తొమ్మిది శాతానికి తగ్గిస్తే లక్షల కోట్ల రూపాయల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల జవాబుదారీతనం కోసం, విద్యుత్ వినియోగంపై స్పష్టతకు స్మార్ట్ మీటర్లు ఉండేలా చూడాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఉన్న అనుభవాన్ని బట్టి ప్రతి సంస్థలో 10-30శాతం వార్షిక ఇంధన పొదుపునకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ప్రతి సంస్థలో ఇంధన లెక్కలను ఆధునిక ప్రమాణాల ప్రకారం తనిఖీ చేస్తే లోపాలను గుర్తించి వృథాను అరికట్టవచ్చు.
రచయిత- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, విద్యుత్ ఇంధన రంగ నిపుణులు
ఇదీ చూడండి: 'భార్యకు తెలియకుండా మాటల రికార్డు ఆమె గోప్యతకు భంగమే'