'గౌరవప్రదంగా జీవించడం' అనే ప్రాథమిక హక్కులో ఒక అంశంగా పని హక్కును చట్టబద్ధం చేసి దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే అతిపెద్ద పథకంగా నిలిచింది. కొవిడ్ సంక్షోభంలోనూ గ్రామీణ కూలీలకు ఉపాధిని కల్పించి, ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడింది. నైపుణ్యం లేని గ్రామీణ కార్మికుల ఉపాధికి హామీ ఇస్తూ, వలసలకు అడ్డుకట్టవేయాలని కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరి రెండో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. పని కావాలంటూ కోరిన వారికి పదిహేను రోజుల్లో పని కల్పించకపోతే, నిరుద్యోగభృతిని పొందే హక్కును అందించింది. కనీసం వందరోజుల ఉపాధికి హామీతో పాటు- ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అదనంగా యాభై పని దినాలు ఉపాధి పొందే అవకాశాన్నీ పథకంలో పొందుపరచింది.
నివేదికల ప్రకారం..
దేశంలోని 2.68లక్షల గ్రామ పంచాయతీల్లో, 14.86కోట్ల ఉపాధి కార్డులు, 28.78కోట్ల కూలీలతో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. మొత్తం సంఖ్యతో పోలిస్తే, క్రియాశీలకమైన ఉపాధి కార్డులు, కూలీల సంఖ్యలో అధిక వ్యత్యాసం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 311.92కోట్ల పని దినాలు కల్పించినట్లు తాజా ఆర్థిక సర్వే వెల్లడించింది. ఉపాధిహామీ మొత్తం వ్యయంలో 68.37శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పనులపై వెచ్చించి సాగురంగాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడినట్లు సర్వే తెలిపింది. 2008-09లో రూ.30వేల కోట్లు కేటాయించగా, 2020-21లో అది లక్ష కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. కానీ 2021-22 బడ్జెట్‌లో మాత్రం ప్రభుత్వం రూ.73వేల కోట్లతో సరిపెట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖ గతేడాది నివేదిక ప్రకారం రూ.3.78కోట్ల ఆస్తులను జియో ట్యాగింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. జన్మన్‌రేగా మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తూ, పథకం నిర్వహణను సులభతరం చేస్తున్నారు.
మెరుగవ్వాల్సిన ఐటీ సేవలు..
భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాయంతో కచ్చితత్వాన్ని పెంచి, సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఐటీ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందని నిపుణులు సూచించారు. కింది స్థాయి సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి. తగిన తర్ఫీదునిస్తేనే లక్షిత ప్రయోజనాలను సాధించవచ్చు. కూలీలకు సైతం సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్న తీరు పట్ల అవగాహన కల్పిస్తేనే, పథకం అమలుపై విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి సంస్థ, దిల్లీ అధ్యయనం-2018 ప్రకారం సహజ వనరుల నిర్వహణకై ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల ఉత్పాదకత, ఆదాయం పెరిగింది. పశుగ్రాసం లభ్యత, పచ్చికబయలు విస్తీర్ణం, భూగర్భ జలాలు పెరగడంతో పాటు, 76శాతం ఆస్తుల సృష్టి పనులు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించింది. పరిపాలనా సంస్కరణలు, ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ, జియోట్యాగింగ్ ద్వారా మన్నికైన ఆస్తుల కల్పన జరిగిందని అధ్యయనం తెలిపింది. పథకం వల్ల ఏర్పడిన ఆస్తులు పేద ప్రజలపై సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపి, వారి జీవితాలు పరివర్తన చెందాయని సామాజిక అభివృద్ధి మండలి నివేదిక పేర్కొంది. ఆయా అదనపు ఆదాయాన్ని విద్య, పొదుపు, రుణాల చెల్లింపు, ఆరోగ్యం, వైద్యఖర్చులు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుపై వినియోగిస్తున్నారని విశ్లేషించింది.
కూలీల్లో విశ్వాసం పెంపొందిస్తేనే..
ఉపాధి హామీ పథకంద్వారా కూలీలకు లింగభేదం లేకుండా సమాన వేతనాలు లభిస్తున్నాయి. దీనివల్ల మహిళా సాధికారతకూ అవకాశమేర్పడింది. పేదరికాన్ని తగ్గించడానికి, కూలీల ఆదాయం పెంచడానికి పలు శాఖల మధ్య సమన్వయం అవసరం. అందుకు గ్రామపంచాయతీలు, పథక నిర్వహణ సిబ్బంది చొరవ చూపాలి. కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాప్యాన్ని నివారించి, కూలీల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. కుటుంబానికి సగటున పని కల్పించే దినాల సంఖ్య తక్కువగా ఉంటోందని, అధిక కుటుంబాలు వందరోజుల పనిదినాలు పొందడం లేదని 'సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్)' నివేదిక గతంలోనే వెల్లడించింది. పథకంలో చేపడుతున్న పనుల వివరాలు, అమలులో అందించే అదనపు సౌకర్యాలపై విరివిగా ప్రజలకు అవగాహన కల్పించాలి. క్షేత్రస్థాయి సిబ్బందిని సుశిక్షితులను చేస్తూ, వారి సామర్థ్యాన్ని పెంచాలి. గ్రామీణ ప్రజల జీవనోపాధికి భరోసా కల్పించేలా, ఉపాధి హామీ పథకాన్ని ప్రణాళికాబద్ధంగా, సమర్థంగా అమలుచేస్తేనే, నైపుణ్యం లేని కార్మికుల ఉపాధికి హామీ హక్కుగా లభిస్తుంది.
- ఎ.శ్యామ్ కుమార్, రచయిత
ఇదీ చదవండి: 'అనుమానం సాక్ష్యం కాబోదు'