పక్కపక్కనే ఉన్న ఇండియా, శ్రీలంక దేశాలు ఆయిల్‌పాం పంట సాగు విషయంలో పరస్పర విరుద్ధ విధాన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆయిల్‌పాం పంట సాగును పూర్తిగా నిషేధిస్తూ గత ఏప్రిల్‌లో శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పంటకు కూలీల వినియోగం తక్కువగా ఉండటంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని శ్రీలంకలో గ్రామీణ ప్రజలు ఆందోళనలకు దిగారు. దాంతో ప్రభుత్వం పామాయిల్ సాగుపై నిషేధం విధించింది. ఈ పంటకు అధికంగా నీరు అవసరమవుతోందని, ఇతర పంటల సాగును ఇది ఆక్రమిస్తోందనే కారణాలూ ఈ నిర్ణయం వెనక ఉన్నాయి. భారత్‌లో ఈ పంట సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో పామాయిల్ సాగు విస్తీర్ణం 8.50 లక్షల ఎకరాలు. 2025కల్లా 25 లక్షల ఎకరాలకు, 2030కల్లా 40 లక్షల ఎకరాలకు సాగును విస్తరించాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపిచ్చారు. అదనంగా పెరగబోయే విస్తీర్ణంలో తెలంగాణలోనే 8.25 లక్షల ఎకరాలుంటుంది. ఇప్పటివరకు పామాయిల్ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలే 96శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నాయి. పామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగితే మనదేశ వంటనూనెల అవసరాలు తీరతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సంప్రదాయ వంటనూనెలను అందించే పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి మాత్రం ప్రాధాన్యమివ్వడం లేదు.
విదేశీ కంపెనీల దోపిడి
నిరుడు పార్లమెంటు ఆమోదించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఒప్పంద సేద్యం కింద రైతులు సాగుచేయాల్సిన ఆయిల్‌పాం విస్తీర్ణం పెంచాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.11 వేల కోట్ల రాయితీలిస్తామని ప్రకటించింది. భారతీయ సంప్రదాయ నూనెగింజల పంటలకు ఆ స్థాయి ప్రోత్సాహకాలే కరవయ్యాయి. దేశంలోకెల్లా నాణ్యమైన వేరుసెనగ పంట పండించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాతావరణం, భూములు ఎంతో అనువైనవని పరిశోధనల్లో తేలినా సాగు విస్తీర్ణం, దిగుబడులు మాత్రం పెరగడం లేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో తెలంగాణలో కనీసం సాధారణ విస్తీర్ణంలోనైనా రైతులు వేరుసెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాచిక్కుడు పంటలు వేయలేదు.
సంప్రదాయ నూనెగింజల పంటల విత్తనాలకు రాయితీలివ్వలేమంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నిధుల విడుదల నిలిపివేసింది. ఎకరా వేరుసెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటల విత్తనాలపై రైతుకిచ్చే రాయితీ గరిష్ఠంగా రెండు వేల రూపాయల్లోపే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరా ఆయిల్‌పాం నారు ధరలో రూ.4,800 చొప్పున ప్రైవేటు కంపెనీలకు రాయితీ కింద చెల్లిస్తామంటోంది. ఈ నారును కోస్టారికా, మలేసియా వంటి సుదూర దేశాల నుంచి తెప్పించి రైతులకు సరఫరా చేయనుంది. ఆ రాయితీ సొమ్ము ప్రైవేటు కంపెనీలకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వపరంగా వేరుసెనగకు లభిస్తున్న ప్రోత్సాహం- పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలకు లేదు. తెలుగు రాష్ట్రాలు మన సంప్రదాయ పంటలకు రాయితీలిస్తే రైతులకు నేరుగా అందుతాయి. వారి ఆదాయమూ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంప్రదాయ నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 4.44 కోట్ల ఎకరాలైతే- ఇప్పటికి 4.28 కోట్ల ఎకరాల్లోనే పంట వేశారు. నిరుడు ఖరీఫ్‌తో పోల్చినా సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు తగ్గింది.
వేరుసెనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, సోయాచిక్కుడు, కుసుమలు, లిన్‌సీడ్, నైగర్, నువ్వులు, ఆముదం ఇండియాలో వందల ఏళ్లుగా పండించే సంప్రదాయ పంటలు. మలేసియా, ఇండొనేసియా దేశాలే ఆయిల్‌పాం తోటలను అత్యధికంగా సాగుచేస్తున్నాయి. వాటి పండ్లగెలలను గానుగాడి పామాయిల్‌ను ఉత్పత్తి చేసి విదేశాలకు అమ్ముకొని అక్కడి నూనెల కంపెనీలు లాభాలార్జిస్తున్నాయి. వాటి నుంచి పామాయిల్‌ను కొనే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆ రెండు దేశాల్లో అవసరానికి మించి ఉత్పత్తయ్యే పామాయిల్‌ను గుమ్మరించేందుకు భారతదేశాన్ని అక్కడి నూనె కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయనే విమర్శ అంతర్జాతీయ మార్కెట్‌లో ఉంది.
ప్రజారోగ్యం ప్రధానం
పామాయిల్‌ను ఇతర దేశాల్లో ఎక్కువగా పరిశ్రమల అవసరాలకు వాడుతుంటే భారతదేశంలో వంటలకు వాడుతున్నారు. భారతీయుల నిత్యావసరాలకు ఏటా 2.50 కోట్ల టన్నుల వంటనూనెలు అవసరం. ఇందులో 60శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుత నూనెల ఏడాదిలో 2020 నవంబరు నుంచి 2021 జూన్ వరకు దేశంలోకి 84.52 లక్షల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు. ఇందులో పామాయిలే 61శాతం (51.49 లక్షల టన్నులు). ఈ ఏడాది జనవరిలో 73శాతం పామాయిల్ దిగుమతి కావడం దేశచరిత్రలోనే నెలవారీ రికార్డు. గత నూనెల ఏడాది (2019-20) ఇదే ఎనిమిది నెలల కాలానికి 80.80 లక్షల టన్నులే దిగుమతయ్యాయి. ఇలా ప్రతి ఏడాదీ దిగుమతులు పెంచుతూనే ఉన్నారు. 2020 జూన్‌లో టన్ను ముడిపామాయిల్ ధర 629 డాలర్లుంటే 2021 జూన్‌లో 1,075 డాలర్లకు, పొద్దుతిరుగుడు 838 నుంచి 1335కు, సోయా ముడినూనె ధర 730 నుంచి 1,254 డాలర్లకు విదేశీ కంపెనీలు పెంచాయి.
పెరిగిన ధరలతో వంటనూనెలను దిగుమతి చేసుకోవడం భారతదేశానికి తీవ్ర ఆర్థిక భారంగా మారింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికే ఆయిల్‌పాం సాగు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కోరుతున్నాయి. కరోనా నియంత్రణకు దేశంలో లాక్‌డౌన్ విధించిన సందర్భాల్లో పామాయిల్ వినియోగం గరిష్ఠస్థాయిలో పడిపోయింది. లాక్‌డౌన్‌లో హోటళ్లు, సభలు, సమావేశాలు, శుభకార్యాలు లేకపోవడంతో- వాణిజ్య అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన వంటనూనెలు అందేలా చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆయిల్‌పాం సాగు, పామాయిల్ ఉత్పత్తి పెంచినా, దాంతో సమాంతరంగా మన సంప్రదాయ నూనెగింజలనూ ప్రోత్సహించాలి. మన వంటనూనెల రంగంలో విదేశీ కంపెనీల పెత్తనానికి పాలకులు అవకాశం ఇవ్వకూడదు. ఏటా రెండు సీజన్లలో సాగయ్యే సంప్రదాయ నూనెగింజల పంటల సాగు పెరిగితే వంటనూనెల కొరతను అధిగమించడం కష్టమేమీ కాదు. అందుకు పాలకులు చిత్తశుద్ధితో రైతులను ప్రోత్సహించాలి.
రచియిత- మంగమూరి శ్రీనివాస్
ఇదీ చూడండి: గాంధీ 'సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం'తోనే స్వాతంత్య్రం