ప్రపంచవ్యాప్త జీవన గమనాన్ని కరోనా కకావికలం చేసింది. వ్యాపారాలు నడవక కొందరు, వృత్తి పనులకు అవకాశం లేక ఇంకొందరు, కూలీ చేసుకుందామంటే దోవ దొరక్క మరికొందరు... అంతర్జాతీయంగా ఇలా కోట్ల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. భారత్‌పై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఇందుకు రెండు కారణాలున్నాయి.
ఒకటి-
కరోనాకు ముందునుంచే ఆర్థికంగా దేశం మందగమనంలో సాగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో 8.1శాతంగా ఉన్న వృద్ధి రేటు 2019-20నాటికి 3.1శాతానికి పడిపోయింది. ఈ ప్రభావంవల్ల నిరుద్యోగిత పెచ్చుమీరింది. ఆదాయాలు కోసుకుపోయాయి. గ్రామాలు సంక్షోభంలో పడ్డాయి. అసమానతలు విస్తరించాయి.
రెండు-
దేశంలోని అసంఘటిత రంగం మొదటినుంచీ ఒడుదొడుకుల్లో ప్రస్థానిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాంతో కార్మికులు, మరీ ముఖ్యంగా కిందిస్థాయిలోని వలస కూలీలపై కోలుకోలేని దెబ్బపడింది. ఈ ఏడాది మార్చిలో దేశంలో 8.4శాతంగా ఉన్న నిరుద్యోగిత; ఏప్రిల్-మే నాటికి 27శాతానికి ఇనుమడించిందంటే కరోనా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్ఛు దాదాపు 12.2 కోట్ల ఉద్యోగాలు మలిగిపోయాయి. ఇందులో చిరు వర్తకులు, రోజు కూలీల వాటా 9.1 కోట్లు!
ఉపాధి హామీకి నిధుల దన్ను
దేశ జనాభాలో 70శాతం ప్రజలు, కార్మిక శక్తి గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అన్ని రంగాలూ పడకేసిన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయమే దేశ పునరుజ్జీవానికి ఆశాకిరణంలా మారింది. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో అయిదు శాతం నుంచి ఎనిమిది శాతం మేర కోసుకుపోయే అవకాశం ఉందంటున్నారు. అదే సందర్భంలో వ్యవసాయ జీడీపీ మాత్రం 2.5శాతంనుంచి మూడు శాతం వరకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. తిరుగు వలసల్లో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగునుంచి అయిదు కోట్లమంది కార్మికులు తమ పల్లెలకు వెళ్ళిపోయారు. వారికిప్పుడు అక్కడ బతకడానికి పని కావాలి. కొవిడ్ ఉత్పాతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)- కార్మికులకు అక్కరకొచ్చే అద్భుతమైన సాధనం! ఈ కార్యక్రమం కింద పేదలకు పనితోపాటు- వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి అవసరమైన ఆస్తుల కల్పన సైతం సాధ్యపడుతుంది.
ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చి నిర్వహించిన అధ్యయనంలో- మహారాష్ట్రలో 'ఎన్‌ఆర్‌ఈజీఏ' పనుల ద్వారా కల్పించిన ఆస్తుల్లో 87శాతం ఇప్పటికీ పదిలంగా ఉన్నట్లు, అందులో 75శాతం నేరుగానో, పరోక్షంగానో వ్యవసాయంతో ముడివడినట్లు వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఆగస్టు మొదటివారం నాటికి ఉపాధి హామీ కింద సుమారు 170 కోట్ల వ్యక్తుల పని దినాలు (పర్సన్ డేస్) సృష్టించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 265 వ్యక్తుల పని దినాలను కల్పించారు. అంటే కిందటి ఏడాదిలో మొత్తంగా కల్పించిన పనిదినాల్లో 64శాతాన్ని ఈ దఫా కేవలం కొన్ని నెలల కాలంలోనే సృష్టించగలిగారన్నమాట! ఉపాధి హామీకి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం.
తెలుగు రాష్ట్రాల్లోనూ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ గరిష్ఠ పనిదినాలను అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఇప్పటికే 4.8 లక్షల కుటుంబాలు వంద రోజుల పని కాలావధిని ఈ పథకం కింద పూర్తి చేసుకున్నాయి. ఇటీవలి ఉద్దీపనతో కలిపి ఉపాధి హామీకోసం కేటాయించిన సుమారు లక్ష కోట్ల రూపాయల్లో దాదాపు సగం ఇప్పటికే వ్యయమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద ఖర్చు పెట్టేందుకు తమవద్ద చాలా తక్కువ డబ్బు మిగిలి ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ స్థాయీసంఘానికి ఇటీవల విన్నవించారు. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సర్వే ప్రకారం దేశంలోని అధిక గ్రామ పంచాయతీలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఉపాధి హామీ నిధులను చాలావరకు ఖర్చుపెట్టేశాయి. ఈ నెలాఖరుకు నిర్దేశిత పనుల కాలావధి కూడా ముగిసిపోనుంది. ఖరీఫ్‌లో ఉపాధి హామీ కార్యక్రమానికి డిమాండ్ కాస్త తక్కువగానే ఉన్నా- కనీసం 2021 ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు ఎన్‌ఆర్‌జీఏకి విపరీతమైన తాకిడి ఉంటుందన్నది ప్రేమ్జీ ఫౌండేషన్ అంచనా! ఈ కార్యక్రమానికి మరో లక్ష కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయడంతోపాటు గరిష్ఠ పనిదినాల సంఖ్యను వందనుంచి 200కు పెంచాలని ఆ సంస్థ సూచించింది.
పనిదినాలను 150కి పెంచాలని
కార్మికులకు బతుకుతెరువును, ఆదాయ మద్దతును ఇవ్వడంకోసం ఉపాధిహామీ పనిదినాలను 150కి పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్, ఎస్.మహేంద్ర దేవ్ (వ్యాస రచయిత) నిర్వహించిన అధ్యయనంలో సూచించారు. గ్రామీణ పథకానికి కాస్త భిన్నమైన పద్ధతిలో- పట్టణాల్లోనూ ఉపాధి హామీ కల్పించాలని; వృత్తి నైపుణ్యాలు పూర్తిగానో, పాక్షికంగానో ఉన్నవారిని సైతం ఈ పథకంలో భాగస్వాములను చేయాలని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. పల్లెలు, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి కల్పనకు అవసరపడే అదనపు వ్యయాన్ని రూ.2.48 లక్షల కోట్లు (జీడీపీలో 1.22శాతం)గా ఈ అధ్యయనం అంచనా కట్టింది.
మౌలిక సౌకర్యాలపై దృష్టి
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఉపాధి హామీ కోసం గ్రామ పంచాయతీల ద్వారా కొత్త పనుల కల్పనకు ఉపక్రమించాల్సి ఉంది. ఆటో కార్మికులు, కారు డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు వంటి నైపుణ్యాలున్న, పాక్షిక నైపుణ్యాలున్న కార్మికులకూ ఇప్పుడు ఉపాధి హామీ కావాలి. ఆ కార్మికులకు వారికి తెలిసిన రంగాల్లోనే పనులు కల్పించాలి. ఉపాధి హామీ కార్యక్రమాన్ని బలోపేతం చేయడం ఇప్పుడు తప్పనిసరి. దీంతోపాటు వ్యవసాయ రంగ పునరుద్ధరణకూ కొన్ని చర్యలు తీసుకోవాలి. ఒకటి- రైతుల ఆదాయాలు పెంచాలి. అందుకోసం కనీస మద్దతు ధర పెంపుతోపాటు సరఫరా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది వాటిని పటిష్ఠంగా తీర్చిదిద్దాల్సి ఉంది. 'ఆత్మనిర్భర్ భారత్' కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు సత్ఫలితాలివ్వాలంటే కేంద్రం-రాష్ట్రాల మధ్య సమన్వయంతోపాటు అనేక దిద్దుబాటు చర్యలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. పళ్లు, కూరగాయలు సహా వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రభుత్వం దీర్ఘకాలంపాటు దన్నుగా నిలవాలి. ఆ మేరకు ఎగుమతి మార్కెట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
ఆదాయాలు ఇనుమడిస్తాయి
వ్యవసాయ మౌలిక సౌకర్యాలకోసం ప్రధానమంత్రి ఇటీవల లక్ష కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని నాలుగేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరానికి కేవలం పదివేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ వసతులకే పరిమితం కాకుండా గ్రామాల్లో శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, రీటైలింగ్ సౌకర్యాలు కల్పిస్తే ఉపాధితోపాటు పల్లెప్రజల ఆదాయాలూ ఇనుమడిస్తాయి. గ్రామీణ నిర్మాణ రంగం సైతం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుందని గుర్తించాలి. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో 51శాతం గ్రామీణ భారతంలోనే ఉన్నాయి.
అవకాశాలు సృష్టించాలి
కొవిడ్ మూలాన దారుణంగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈలకు సాధ్యమైనంత సత్వరం తిరిగి ప్రాణం పోయాలి. చైనానుంచి అనేక కంపెనీలు బయటి దేశాలకు వెళ్ళిపోతున్న తరుణంలో- ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనా దృష్టి తప్పనిసరి. బలమైన ఎంఎస్‌ఎంఈలు లేకుండా భారత్ స్వావలంబన శక్తిగా ఎదగడం సాధ్యమయ్యే పనికాదు. మరోవంక వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు; పల్లెలు పట్టణాల మధ్య మేలిమి సమన్వయంతోనే గ్రామీణ భారత పునరుజ్జీవం సాధ్యపడుతుందనీ గుర్తించాలి. కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో ఉపాధి హామీ పనిదినాల పెంపుతోపాటు, నిధుల కేటాయింపును ఇనుమడింపజేసి, ఇబ్బడిముబ్బడిగా కొత్తపనులను సృష్టించడం ద్వారా దేశంలోని కార్మికవర్గానికి భరోసాగా నిలవడం చారిత్రక అవసరం.
ఎస్. మహేంద్ర దేవ్
(రచయిత- ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశోధన సంస్థ సంచాలకులు, ఉపకులపతి)
ఇదీ చదవండి- రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో బలపరీక్షపై ఉత్కంఠ