Madhya Pradesh Scindia Election : మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోరులో సింధియా బెల్ట్‌లో ఈసారి రాజకీయం ఎలా ఉంటుందో అనే చర్చ ఊపందుకుంది. తమ పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలను రాజకుటుంబం ఎప్పటి నుంచో ప్రభావితం చేస్తూ వస్తోంది. అయితే, గత మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలిచిన జ్యోతిరాదిత్య సింధియా... ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజాతీర్పుపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ బెల్ట్‌లో రాజకీయంగా గ్వాలియర్ రాజకుటుంబం సింధియాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఆ ప్రాంతాన్ని సింధియా బెల్ట్‌గాను పిలుస్తారు. సింధియా బెల్ట్‌లో ఈసారి బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్వాలియర్ సంస్థానాన్ని చివరగా పాలించిన జివాజీరావు సింధియా మనవడు, కేంద్ర మాజీ మంత్రి మాధవరావ్ సింధియా కుమారుడు జ్యోతిరాదిత్యనే... చాలాకాలంగా రాజకుటుంబం తరపున ఆ ప్రాంతంలో రాజకీయంగా చురుగ్గా ఉంటున్నారు. గత మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి జ్యోతిరాదిత్య దోహదం చేశారు. గ్వాలియర్-చంబల్ బెల్ట్‌లోని 34అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో 26స్థానాలు.. కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో ఆయన పాత్రే కీలకం.
అయితే, 2020లో నాటి ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో విభేదించిన జోతిరాదిత్య 22మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగాయి. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో సింధియా అనుచరులు.. బీజేపీ అభ్యర్థులుగా విజయం సాధించారు. ప్రస్తుతం గ్వాలియర్-చంబల్ బెల్ట్‌లో పరిణామాలు మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతఎన్నికల్లో గ్వాలియర్-చంబల్ బెల్ట్‌లో 34కు 26స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన సింధియా ఇప్పుడు ఆ స్థాయి ప్రభావం చూపగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈసారి సింధియా మూల్యం చెల్లించుకోక తప్పదు : కాంగ్రెస్
రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన అనుచరుల్లో 12 మందికి బీజేపీ టికెట్ దక్కింది. వారి కోసం సింధియా ముమ్మరం ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, సింధియా బలం కలగలిపి 34 స్థానాలకు 26 సీట్లు దక్కాయని విశ్లేషకులు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన జ్యోతిరాదిత్య సింధియా... ఈసారి మూల్యం చెల్లించుకోకతప్పదని హస్తం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. జ్యోతిరాదిత్య అధికారం మోజులో పడి పార్టీని వీడారని అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన ఆ ఆరోపణలను అప్పట్లోనే ఖండించారు. ప్రస్తుతం బీజేపీ.. సింధియాపైనే ఆధారపడి గ్వాలియర్-చంబల్ బెల్ట్‌లో ప్రచారం ముమ్మరం చేసింది.
పార్టీ కార్యకర్తల మధ్య కుదరని సయోధ్య
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి ఈసారి జ్యోతిరాదిత్య.. అత్యధిక సీట్లను గెలుచుకోవడంలో ప్రభావం చూపగలరా అనే ప్రశ్న బీజేపీలోనూ తలెత్తుతోంది. ఎందుకంటే బీజేపీలో చేరినప్పటికీ.. సింధియా వర్గానికి, గ్వాలియర్ బెల్ట్‌లో ఆ పార్టీ కార్యకర్తల మధ్య సయోధ్య పూర్తిస్థాయిలో లేదు. జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైరి వర్గాలుగా ఉన్న వారు ఇప్పుడూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. సింధియా రాజకీయంగా సభలు, సమావేశాలకు తమను పిలవడంలేదని గ్వాలియర్ ప్రాంతంలోని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. తన అనుచరగణంతోనే ఆయన తిరుగుతారని, తమతో కనీసం మాట్లాడేందుకు ఆయన ఇష్టపడరని వారు ఆరోపిస్తున్నారు. అయితే గ్వాలియర్ బెల్ట్‌లో అసెంబ్లీ ఎన్నికలు సింధియాకు పరీక్ష పెట్టబోవని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక బీజేపీ నాయకత్వంతో ఆయన వర్గానికి ఉన్న పోరు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపదని అంచనా వేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">