ఆ క్రూర కిరాతకుల కన్నా జలగలే మెరుగు. అవి నెత్తురే పీలుస్తాయి; రుణ యాప్‌ల సిబ్బంది కర్కశంగా ప్రాణాలే తోడేస్తారు. పత్రాలూ హామీలూ అక్కర్లేకుండా చిటికెలో అప్పులిస్తామంటూ ఉచ్చు బిగిస్తున్న యాప్‌ల నిర్వాహక సిబ్బంది వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాజాగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. వాస్తవానికిది ఏ ఒక్క రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. ఆన్‌లైన్ రుణ యాప్‌ల దారుణ పరంపరపై గగ్గోలు పుట్టిన దరిమిలా బాధితులు సైబర్ నేర విభాగాన్ని ఆశ్రయించాలని చెన్నై, బెంగళూరు పోలీసులు గత డిసెంబరులో సూచనలు జారీ చేశారు.
పేరు మార్చుకుని మరీ..
కేరళలో ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మిగతా చోట్లా వరస వేధింపులు, ఆత్మహత్యలు వెలుగు చూశాక అటు రిజర్వ్ బ్యాంక్‌తో, ఇటు గూగుల్ సంస్థతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. డిజిటల్ రుణాలు మంజూరు చేస్తామనేవారి వలలో పడవద్దని జనానికి ఉద్బోధించిన ఆర్‌బీఐ- అనధికారిక వ్యక్తులెవరికీ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు ఇవ్వరాదని పిలుపిచ్చి సరిపుచ్చింది. వందలాది రుణ యాప్‌ల పనిపోకడల్ని సమీక్షించి, కొన్నింటిని ప్లే స్టోర్ నుంచి తొలగించామన్న గూగుల్- తక్కినవి స్థానిక చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టీకరించింది. వాస్తవంలో, వేటుపడ్డ యాప్‌ల పేరు మార్చి మళ్ళీ మోసాలకు తెగబడుతున్న ఉదంతాలు ముమ్మరిస్తున్నాయి. నిబంధనలు పాటించాలన్న హెచ్చరికలు వల్లెవేయడం కాదు- న్యాయస్థానం నిర్దేశించినట్లు, మృత్యుపాశాలు విసరుతున్న రుణ యాప్‌లన్నింటిపైనా టోకున వేటు వేసి, నిర్వాహకుల్ని నరహంతకుల్లా పరిగణించి, కఠిన దండన విధింపజేసే పకడ్బందీ కార్యాచరణ జరూరుగా పట్టాలకు ఎక్కాలి.
ఆర్‌బీఐ పై విమర్శలు..
రుణ యాప్‌ల దారుణాలపై అంటీ ముట్టనట్లు వ్యవహరించడమేమిటన్న తీవ్ర విమర్శల నేపథ్యంలో- నియంత్రణ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు, క్రమబద్ధీకరించని డిజిటల్ యాప్‌లపై అధ్యయనం కోసం ప్రత్యేక బృందాన్నొకదాన్ని ఆర్‌బీఐ మూడు వారాల క్రితం నెలకొల్పింది. గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించే ఏ యాప్ అయినా సరే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లతో ఒప్పందం కుదుర్చుకుంటేనే గాని రుణాలివ్వడం కుదరని పని. ఆ నిబంధన దర్జాగా ఉల్లంఘనకు గురవుతున్నా తక్షణ చర్యలకు ఉపక్రమించని ఆర్‌బీఐ, ఇంకెప్పటికి మేలుకొంటుందో అగమ్యగోచరంగా ఉంది.
చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు
ఆన్‌లైన్ లోన్ యాప్ కేసులో మరో నలుగురు అరెస్టు
కదిలిన డొంక..
రుణ యాప్‌ల సంక్షోభంపై ఎదురైన ప్రశ్నలకు లోక్‌సభలో కేంద్ర ఎలెక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ- పోలీసులు, పబ్లిక్ ఆర్డర్ రాష్ట్రాల పరిధిలోనివంటూ చేతులు దులిపేసుకోవడం విస్మయపరుస్తోంది. జకార్తా(ఇండొనేసియా)లో మకాం వేసిన చైనా జాతీయురాలిని రుణ యాప్‌ల సృష్టికర్తగా చెబుతున్నారు. దిల్లీ, హైదరాబాదులతోపాటు ఇతర ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నవాళ్ల లోగుట్టుమట్లు కూపీ లాగాక ఒక్క తెలంగాణలోనే 30వరకు అరెస్టులు జరిగాయి. కేవలం ఏడునెలల వ్యవధిలో రూ.25వేల కోట్ల లావాదేవీల వెనక సూత్రధారుల్ని పాత్రధారుల్ని పూర్తిగా వెలికి లాగి కంతలు మూసేయడమన్నది- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బీఐ, నిఘా సంస్థలు, పోలీసు దళాల అర్థవంతమైన సమన్వయంతోనే సుసాధ్యమవుతుంది.
ఉదాసీనత తగదు..
వినియోగదారులందరికీ సురక్షిత ప్రమాణాలతో కూడిన సేవలందించడమే విధ్యుక్త ధర్మమంటున్న గూగుల్- తొలగించిన యాప్‌లు మారుపేర్లతో తిరిగి మొలుచుకొస్తున్నా ఉదాసీనంగా వ్యవహరించడం అంతిమంగా పౌరప్రయోజనాలకే గొడ్డలిపెట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక విభాగాల తోడ్పాటుతో కలిసికట్టుగా రుణ యాప్ ముఠాల భరతం పడితేనే గాని, ఆన్‌లైన్‌లో యమపాశాల భయానక పీడ విరగడ కాదు!
ఇవీ చదవండి: 'రుణయాప్‌లపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలి'